సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రామాయణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే “కణ్-కణ్ మే రామ్”
డాక్యుమెంటరీ చిత్రాన్ని జూలై 23న విడుదల చేయనున్న ఐఎన్‌టీఏసీహెచ్
Posted On:
22 JUL 2025 9:06PM by PIB Hyderabad
దేశంలోని రామాయణ సంబంధిత సంప్రదాయాలు, కథనాల సాంస్కృతిక గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని ప్రదర్శించే "కణ్-కణ్ మే రామ్" అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని భారత జాతీయ కళలు-సాంస్కృతిక వారసత్వ ట్రస్టు (ఐఎన్‌టీఏసీహెచ్) రేపు విడుదల చేయనుంది. సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అధికారికంగా ఈ చిత్ర ప్రదర్శనను ప్రారంభించనున్నారు.
రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు న్యూఢిల్లీలోని ఐఎన్‌టీఏసీహెచ్, 71, లోఢీ ఎస్టేట్‌లోని మల్టీ-పర్పస్ హాల్‌లో ఈ చిత్ర విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో రామాయణ కథను ప్రదర్శించడం కోసం వాడుకలో ఉన్న సంప్రదాయిక ప్రదర్శనలు, నృత్యం-నాటకాలు, తోలుబొమ్మలాట వంటి వివిధ ప్రదర్శన రూపాలను ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తుంది. కర్ణాటక యక్షగానం, ఉప్పినికుద్రు తోలుబొమ్మలాట.. ఒడిశా లంకా పోడి యాత్ర, రావణ ఛాయ.. అస్సాం సత్రియా సంప్రదాయాలు, ఛత్తీస్గఢ్ మేవాటీ భాపాంగ్ ప్రదర్శన, రామనామి సమాజ్ వంటి ముఖ్యమైన సంప్రదాయిక ప్రదర్శనలు ఈ చిత్రంలో ఉంటాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో శ్రీరాముని సర్వవ్యాప్త సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఉనికిని ఈ డాక్యుమెంటరీ కళ్లకు కడుతుంది. మతపరమైన హద్దులను అధిగమించిన ఆయన కథలు, బోధనలను వివరిస్తుంది. ఈ చిత్ర ప్రధాన సందేశం “కణ్-కణ్ మే రామ్” శ్రీరాముని దివ్య రూపాన్ని సాక్షాత్కరింపజేస్తూ, ఆయన శాశ్వతత్వ సామూహిక స్పృహతో మానవాళిని అనుసంధానిస్తుంది.
ఈ అద్భుత సందర్భంలో.. సాంస్కృతిక, వారసత్వ ఔత్సాహికులు, పండితులు, సాధారణ ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడాన్ని ఐఎన్‌టీఏసీహెచ్ గౌరవంగా భావిస్తోంది. భారతీయ ప్రదర్శన కళల ద్వారా రామాయణ సాంస్కృతిక వైవిధ్యాన్ని, శాశ్వత వారసత్వాన్ని ప్రదర్శించే గొప్ప అవకాశంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.
***
(Release ID: 2147222)