ఆర్థిక మంత్రిత్వ శాఖ
సామర్థ్యం.. ఆర్థిక శక్తి లక్ష్యంగా ‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ విధానం కింద
ప్రభుత్వం చేపట్టిన ఏకీకరణ ప్రక్రియతో 196 నుంచి 28కి తగ్గిన ‘ఆర్‌ఆర్‌బీ’ల సంఖ్య విలీనంతో సేవల్లో నాణ్యత, ఖర్చుల్లో తగ్గుదల... సాంకేతిక వినియోగానికీ అవకాశం....ఆర్‌ఆర్‌బీ’ల లాభదాయకత పెరిగి నష్టాలు తగ్గుతాయి: ఆర్బీఐ నివేదిక ఆర్‌ఆర్‌బీ’ల విలీనంతో లాభదాయకత.. ఆర్థికశక్తి ఇనుమడిస్తాయన్న నాబార్డ్ అధ్యయనం
Posted On:
21 JUL 2025 6:38PM by PIB Hyderabad
దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) నిర్వహణ సామర్థ్యం మెరుగుదల, ఆర్థిక వ్యవస్థల సద్వినియోగం దిశగా కేంద్ర ప్రభుత్వం 2005-06లో ‘ఆర్‌ఆర్‌బీ’ల సమూల విలీనానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏకీకరణ తొలిదశ (ఫేజ్-I, 2005-2010)లో ఒక రాష్ట్రంలోని ఒకే ప్రాయోజిత బ్యాంకు పరిధిలోగల ‘ఆర్‌ఆర్‌బీ’ల విలీనం ద్వారా వాటి సంఖ్యను 196 నుంచి 82కు తగ్గించింది. అటుపైన రెండో దశ (ఫేజ్-II, 2012-14)లో భౌగోళికంగా అనుబంధ కార్యకలాపాల ప్రాంతాలుగల రాష్ట్రంలోని ప్రాయోజిత బ్యాంకుల పరిధిలో ‘ఆర్‌ఆర్‌బీ’ విలీనంతో వాటి సంఖ్య 82 నుంచి 56కు తగ్గింది. అనంతరం మూడో దశ (ఫేజ్-III) కింద 2019లో బలహీన ‘ఆర్‌ఆర్‌బీ’ని బలమైనదానితో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. దీంతో 2021 మార్చి ఆఖరుకల్లా ‘ఆర్‌ఆర్‌బీ’ల సంఖ్య 56 నుంచి 43కు తగ్గింది.
ఈ మూడు దశల విలీనం పూర్తయ్యాక వాటి ఆర్థిక సామర్థ్యంపై దీని ప్రభావం గురించి 2021లోనే నాబార్డ్ ఒక అధ్యయనం నిర్వహించింది. విలీనం ఫలితంగా ‘ఆర్‌ఆర్‌బీ’ల లాభదాయకత మెరుగుపడిందని, అది ఆర్థిక సామర్థ్యం పెరుగుదలకు తోడ్పడిందని పేర్కొంది. ఈ అధ్యయన ఫలితాలను “బ్యాంకింగ్ ధోరణులు-పురోగమనంపై నివేదిక (2020-2021)” రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారికంగా ప్రచురించింది.
విలీనంలోని వివిధ దశలలో లాభదాయక, సుస్థిర గిట్టుబాటుగల ‘ఆర్‌ఆర్‌బీ’ల వాటా మెరుగుదల కొనసాగిందని అధ్యయన నివేదిక పేర్కొంది. అలాగే మొత్తం ఆస్తుల నిష్పత్తి కోణంలో పేరుకున్న నష్టాల పరిమాణం కూడా తగ్గిందని వెల్లడించింది. విలీనం అనంతరం మెరుగుపడిన ‘ఆర్‌ఆర్‌బీ’ల లాభదాయకత, బలహీన బ్యాంకులకు మూలధన తోడ్పాటుతో కలిపి, వాటి పరపతి నిష్పత్తి సహా మూలధన నిష్పత్తి రీత్యా నగదు నిల్వలు పెరిగాయని వివరించింది.
‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ సూత్రం నిర్దేశంతో ప్రభుత్వం ‘ఆర్‌ఆర్‌బీ’ల నాలుగో దశ (ఫేజ్-IV) విలీనాన్ని కొనసాగించింది. తద్వారా భారీ పరిమాణ సామర్థ్యం, వ్యయ-హేతుబద్ధీకరణల ప్రయోజనాలను సాధించడానికి దేశంలోని 26 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 43 ‘ఆర్‌ఆర్‌బీ'ల సంఖ్యను 01.05.2025 నుంచి 28కి తగ్గిస్తున్నట్లు 05.04.2025న అధికార ప్రకటన జారీచేసింది.
ఈ విలీన ప్రక్రియ ఫలితంగా రాష్ట్రస్థాయి ‘ఆర్‌ఆర్‌బీ’కి ఒక నిర్దిష్ట స్వరూపం వచ్చింది. దీనివల్ల నిర్వహణ సరళం కావడంతోపాటు సేవా ప్రదాన సౌలభ్యం మెరుగుపడింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ మూలధన పునాదిని పటిష్ఠం చేసుకున్నాయి. విలీన సంస్థ ఆర్థిక స్థిరత్వం, పునరుత్థాన శక్తిని పెంచుకుంది. విలీనంవల్ల కార్యకలాపాల ఏకీకరణ, వేర్వేరు నిర్వహణ వ్యయం కలిసిరావడం ద్వారా ఖర్చు ఆదా అవుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా విలీన ‘ఆర్‌ఆర్‌బీ’లు అత్యాధునిక సాంకేతిక వేదికలలో పెట్టబడి పెట్టి, వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా నిర్వహణ సామర్థ్యం, వినియోగదారుల సేవలు మెరుగుపడే వీలుంటుంది.
‘ఒక రాష్ట్రం-ఒక ఆర్‌ఆర్‌బీ’ సూత్రం నిర్దేశిత ‘ఆర్‌ఆర్‌బీ’ల విలీనం ప్రక్రియను 30.04.2025 నాటికి తనిఖీ పూర్తయిన ఆర్థికాంశాల ప్రాతిపదికన చేపట్టారు. ఆ మేరకు విలీనం 01.05.2025 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ప్రక్రియ పరిశీలన, పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీ (ఎస్‌ఎల్‌ఎంసీ)తోపాటు జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పర్యవేక్షణ యూనిట్ (ఎన్‌ఎల్‌పీఎంయూ)ను ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో వివరణాత్మక మార్గదర్శాకాలతో నాబార్డ్ జాతీయ స్థాయి ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) జారీ చేసింది. ఇది ప్రతి ప్రధాన/విలీన ‘ఆర్‌ఆర్‌బీ’లో సమన్వయ విధానాలు, కార్యాచరణ మార్గదర్శకాల ఖరారుతోపాటు, రోజువారీ సమీకృత ప్రణాళిక అమలకు విలీన ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్ (ఏపీఎంయూ), సారథ్య సంఘం (స్టీరింగ్ కమిటీ), నిర్వాహక కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని నాబార్డ్ అందులో సూచించింది.
విలీనంపై కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ప్రకటన ఇతరత్రా అంశాలతోపాటు ప్రస్తుత ‘ఆర్‌ఆర్‌బీ’ ఉద్యోగుల వేతనం, ఉద్యోగ హోదాకు రక్షణనిస్తుంది. అధికారులు, ఉద్యోగుల సీనియారిటీని నాబార్డ్ జారీ చేసిన ‘ఎస్‌ఓపీ’ నిర్దేశిస్తుంది. గ్రామీణ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం శాఖల స్థాయిలో (ప్రసార-ప్రచురణ మీడియా, సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) అవగాహన సమావేశాలు వగైరా) వివిధ సమాచార ప్రదాన మార్గాల్లో విలీనంపై తగువిధంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ‘ఎన్‌ఎల్‌పీఎంయూ' అన్ని ‘ఆర్‌ఆర్‌బీ'కు సూచించింది. అంతేగాక వినియోగదారుల ఫిర్యాదు పరిష్కారం కోసం కాల్ సెంటర్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని ‘ఆర్‌ఆర్‌బీ’లకు సలహా ఇచ్చింది. నాబార్డ్ నిర్దేశాల మేరకు ప్రస్తుతం అన్ని శాఖలూ కొత్త సంస్థల కింద పనిచేస్తూ, బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా చూస్తున్నాయి. దీంతో వినియోగదారుల ఖాతాలు, డిపాజిట్లు, రుణాల బదిలీ వంటి వ్యవహారాలు పెద్దగా అంతరాయాలేవీ లేకుండా సాగిపోతోంది.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(Release ID: 2146644)
|