యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

20245 జూలై 19 నుంచి వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో

‘వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువత’ ఇతివృత్తంతో జరగనున్న ‘యువజన ఆధ్యాత్మిక సదస్సు’

జాతీయ స్థాయిలో మాదకద్రవ్య రహిత వికసిత్‌ భారత్ కోసం

యువత సారథ్యంలో రోడ్ మ్యాప్ తయారీ.. జూలై 20న కాశీ డిక్లరేషన్ ప్రకటన

Posted On: 18 JUL 2025 1:21PM by PIB Hyderabad

యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ 2025 జూలై 19 నుంచి 20 వరకు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 'వికసిత్ భారత్ కోసం నషా ముక్త యువత' అనే ఇతివృత్తంతో 'యువజన ఆధ్యాత్మిక సదస్సును' నిర్వహించనుంది. ఈ చారిత్రాత్మక సదస్సు దేశవ్యాప్తంగా 100 ఆధ్యాత్మిక, సాంస్కృతిక-సామాజిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 500 మందికి పైగా యువ ప్రతినిధులను ఒకవేదికపైకి తీసుకురానుంది. పవిత్రమైన గంగా నది ఒడ్డున జరగనున్న ఈ సమావేశం మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా భారతదేశ ఆధ్యాత్మికత, యువశక్తిలో ఉన్న సంకల్పాన్ని జాతీయ స్థాయిలో సమష్టిగా పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

 

ఈ సదస్సులో హిమాచల్ ప్రదేశ్ గౌరవ గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్.. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా నిఖిల్ ఖడ్సే వంటి ప్రముఖులు పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి శ్రీ గిరీష్ యాదవ్.. ఉత్తరప్రదేశ్ సామాజిక సంక్షేమం, ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర) శ్రీ అసిమ్ అరుణ్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అబ్కారీ శాఖ(స్వతంత్ర) మంత్రి శ్రీ నితిన్ అగర్వాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 

 

మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యువత నేతృత్వంలో విలువలతో కూడిన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలనే విస్తృత లక్ష్యంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఈ యువజన సదస్సును నిర్వహిస్తోంది. ఒక మంచి అనుభవం ఇచ్చే విధంగా ఈ సదస్సును రూపొందించారు. ఆత్మపరిశీలన వైపు నడిపించే అంశాలను సాంస్కృతిక, ఆధ్యాత్మిక పద్ధతులతో మిళితం చేయనుంది. నాలుగు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో వ్యసనం వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాన్ని అర్థం చేసుకోవడం.. మాదకద్రవ్యాల సరఫరా, క్రయవిక్రయాల వ్యవస్థలను నిర్వీర్యం చేయడం.. క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా ప్రచారం చేయటం, కమ్యూనికేషన్ వ్యూహాలు.. నషా ముక్త భారత్‌ను సాధించేందుకు ఒక రోడ్ మ్యాప్‌ను రూపొందించటంపై చర్చించనున్నారు. వైట్‌బోర్డ్ ఫోరమ్‌లు, నిపుణుల కీలక ప్రసంగాలు.. యువత నాయకత్వంలో ఆలోచనలు, ఆవిష్కరణలు జరిగే వేదికను అందించే కార్యశాలలు ఇందులో ఉండనున్నాయి. 

 

రెండు రోజుల పాటు జరగనున్న ఈ చర్చలు సమష్టిగా శక్తివంతమైన ఫలితాన్ని ఇవ్వనున్నాయి. జూలై 20న 'కాశీ డిక్లరేషన్' విడుదలతో సదస్సు ముగియనుంది. ఇది మాదకద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అందిస్తూ.. యువత, ఆధ్యాత్మిక నాయకుల సమష్టి దార్శనికత, నిబద్ధతను తెలియజేయనుంది. ఇది మాదకద్రవ్యాల వ్యసనాన్ని తగ్గించటం, వ్యసనపరుల పునరావాసంపై పనిచేస్తోన్న యువజన సంఘాలు, పౌర సంస్థలతో పాటు విధాన రూపకర్తలకు ఒక మార్గదర్శక పత్రంగా ఉపయోగపడుతుంది. 

 

మై భారత్ వేదికతో కలిసి ఈ సదస్సు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ ప్రజా ఉద్యమాన్ని కూడా ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞతో కూడిన ప్రచారాలు, క్షేత్రస్థాయి ప్రచార కార్యకలాపాలకు మై భారత్ స్వచ్ఛంద సేవకులు, అనుబంధ యువజన సంఘాలు నాయకత్వం వహించనున్నాయి. ఇవన్నీ నైతికంగా దృఢ నిశ్చయంతో కూడిన అందరి భాగస్వామ్య నాయకత్వంతో నడిచే సుస్థిర జాతీయ ఉద్యమాన్ని తయారుచేయాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 

 

యువజన ఆధ్యాత్మిక సదస్సు, దాని ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన అన్ని రకాల తాజా సమాచారంతో పాటు ఇతర వివరాల కోసం మై భారత్ వేదిక https://mybharat.gov.in చిరునామాను సంప్రదించవచ్చు.

***

 


(Release ID: 2145989)