జాతీయ మానవ హక్కుల కమిషన్
తమిళనాడులోని కడలూరు జిల్లాలో రైలుగేటు వద్ద స్కూలు వ్యానును డీకొట్టిన రైలు.. ముగ్గురు బాలల మృతి... అనేక మందికి గాయాలు...
ఈ ఘటనను తనంతట తానుగా పరిశీలనకు స్వీకరించిన భారత ఎన్‌హెచ్‌ఆర్‌సీ
• లెవెల్ క్రాసింగ్ ఉన్న స్థలంలో అండర్‌పాస్ నిర్మాణానికి అనుమతినిచ్చిన రైల్వే..
గత ఏడాదిగా జిల్లా అధికారుల ఆమోదం లభించక మొదలవని పనులు
• రైల్వే బోర్డు చైర్మన్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు..
రెండు వారాల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు
Posted On:
17 JUL 2025 12:04PM by PIB Hyderabad
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఈ నెల 8న ఒక రైలుగేటు వద్ద స్కూల్ వ్యానుని ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటో పరిశీలనకు స్వీకరించింది. ఆనాటి దుర్ఘటనలో ముగ్గురు బాలలు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో లెవెల్ క్రాసింగ్ గేటు తెరిచి ఉందనీ, అదే సమయంలో ఒక రైలు ఆ మార్గంలో వెళుతున్నదని కూడా వార్తాకథనం పేర్కొంది.
ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనం ప్రకారం.. అందులోని వివరాలు నిజమని తేలితే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లే అవుతుందని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. ఈ కారణంగా, ఈ విషయంలో సమగ్ర నివేదికను రెండు వారాల్లోగా ఇవ్వాలని రైల్వే బోర్డు చైర్మను, రైల్వే మంత్రిత్వ శాఖ, తమిళనాడు రాఫ్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీకి కూడా నోటీసులు జారీ చేసింది. పైన ప్రస్తావించిన దుర్ఘటనలో గాయపడ్డ వ్యక్తుల ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో కూడా తెలియజేయాలంది.
ఈ లెవెల్ క్రాసింగ్ స్థానంలో ఒక అండర్‌పాస్‌ను ఏర్పాటు చేయడానికి సదరన్ రైల్వే అనుమతిని మంజూరు చేసినట్లు ఈ నెల 9న ప్రసార మాధ్యమాల్లో వచ్చినట్లు కూడా కథనం తెలిపింది. అయితే ఈ విషయంలో జిల్లా కలెక్టరు గత సంవత్సర కాలంగా అనుమతి ఇవ్వడంలేదని కూడా మీడియా కథనం పేర్కొంది.
***
(Release ID: 2145510)