ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విషయంలో ఎన్‌టీపీసీకి వెసులుబాటు కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం..
ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, దాని ఇతర జాయింట్ వెంచర్లు, అనుబంధ సంస్థలలో పెట్టుబడులకు సంబంధించి అధికారాల పెంపు
Posted On:
16 JUL 2025 2:46PM by PIB Hyderabad
హరిత ఇంధనోత్పత్తిలో మహారత్న హోదా కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీకి మరింత ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఎన్‌టీపీసీ దాని అనుబంధ సంస్థ అయిన ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌జీఈఎల్), అదే తరహాలో ఎన్‌జీఈఎల్ దాని అనుబంధ సంస్థ అయిన ఎన్‌టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌ఈఎల్), దాని ఇతర జాయింట్ వెంచర్లు లేదా అనుబంధ సంస్థల్లో హరిత ఇంధనోత్పత్తికి సంబంధించి పెట్టుబడి పెట్టేందుకు ఉన్న రూ. 7000 కోట్ల పరిమితిని రూ. రూ. 20 వేల కోట్లకు పెంచింది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎన్‌టీపీసీ, ఎన్‌జీఈఎల్‌లకు ఇచ్చిన ఈ వెసులుబాటు దేశంలో పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును వేగవంతం చేసేందుకు ఉపయోగపడనుంది. విద్యుత్ మౌలిక సదుపాయాలను పెంచటంతో పాటు దేశవ్యాప్తంగా 24 గంటలూ విశ్వసనీయంగా విద్యుత్ ను అందించేందుకు పెట్టుబడులు అందివచ్చేలా చూడటంలో ఈ నిర్ణయం కీలకపాత్ర పోషించనుంది.
పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నిర్మాణ దశతో పాటు ఉత్పత్తి, నిర్వహణ సమయంలో స్థానిక ప్రజలకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. దేశంలో ఆర్థిక సామాజికాభివృద్ధి, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అవకాశాలను ప్రోత్సహించటంతో పాటు స్థానిక సరఫరాదారులు, స్థానికంగా ఉన్న సంస్థలు లేదా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తుంది.
స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధనాల నుంచి రావాలన్న లక్ష్యాన్ని పారిస్ ఒప్పందంలో భాగంగా భారత్ నిర్దేశించుకుంది. దీనిని ఐదు సంవత్సరాల ముందుగానే సాధించింది. ఇది దేశ ఇంధన పరివర్తనలో ముఖ్యమైన ఘట్టం. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యానికి చేరుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా, దేశంలోని ప్రముఖ విద్యుత్ సంస్థగా ఎన్‌టీపీసీ.. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అదనంగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ముందు పేర్కొన్న లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడటమే కాకుండా 2070 నాటికి 'నికర సున్నా' ఉద్గారాలను సాధించాలనే విశాల లక్ష్యాన్ని సాధించటంలో ఉపయోగపడుతుంది.
సంస్థాగత, లేదా ఇతర పద్ధతుల ద్వారా పెట్టుబడులు పెట్టడం లేదా కొనుగోలు చేయటం ద్వారా పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని అదనంగా సాధించేందుకు ఉద్దేశించిన ఎన్‌టీపీసీ ప్రతిష్ఠాత్మక అనుబంధ సంస్థ... ఎన్‌జీఈఎల్. ఎన్‌జీఈఎల్ అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఆర్‌ఈఎల్ యాజమాన్యం పూర్తిగా దీని ఆధీనంలోనే ఉంది. దీని ద్వారా సహజ వృద్ధి సాధించాలనేది వ్యూహం కాగా.. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టేందుకు ఎన్‌జీఈఎల్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, సీపీఎస్‌యూలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకుంది. దాదాపు 32 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని ఎన్‌జీఈఎల్ కలిగి ఉంది. ఇందులో దాదాపు 6 గిగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. దాదాపు 17 గిగావాట్ల ఉత్పత్తి కాంట్రాక్టు పద్ధతిలో లేదా వివిధ సంస్థల ద్వారా జరుగుతోంది. దాదాపు 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధంగా ఉంద.
***
(Release ID: 2145351)
Visitor Counter : 2
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam