వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ... కిసాన్ క్రెడిట్ కార్డులతో రుణ లభ్యతకు వీలు: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
· పీఎం- కిసాన్ తో కోట్ల మంది రైతులకు లబ్ది...మార్కెట్ అందుబాటును బలోపేతం చేయడానికి 1400 మండీలు ‘ఇ-నామ్’ తో సంధానం
· ఆస్ట్రేలియా, యూఏఈ, ఈఎఫ్‌టీఏ దేశాలతో పాటు బ్రిటన్‌తో ఎఫ్‌టీఏలు..
వీటికి తోడు, మద్దతిచ్చే తరహా విధానాల అండతో వృద్ధి బాటలో వ్యవసాయ రంగం: శ్రీ గోయల్
· ఆత్మనిర్బర్ భారత్’కు, ‘‘లోకల్ గోస్ గ్లోబల్’’ విజన్‌కు రైతులే వెన్నుదన్ను: శ్రీ పీయూష్ గోయల్
Posted On:
10 JUL 2025 2:55PM by PIB Hyderabad
రైతులకు 25 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను అందజేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. వ్యవసాయ నాయకత్వం అంశంపై ఈ నెల 9న న్యూఢిల్లీలో నిర్వహించిన పదహారో కాన్‌క్లేవ్‌లో మంత్రి ప్రసంగించారు. ఎరువులను ఎంత మోతాదుల్లో అవసరమో అంతే మేరకు వినియోగించడాన్ని ప్రోత్సహించడంతో పాటు పంట రుణాలను అందించడానికి ఉద్దేశించిన కిసాన్ క్రెడిట్ కార్డుల కార్యక్రమంలో భాగంగా ఈ సాయిల్ హెల్త్ కార్డులను ఇచ్చామని ఆయన వివరించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి సాధన కోసం చేపట్టదలుచుకొన్న కార్యక్రమాల్లో వ్యవసాయ రంగానికే ఎప్పటికీ అగ్ర ప్రాధాన్యాన్ని ఇస్తూ వస్తోందని కూడా శ్రీ గోయల్ స్పష్టం చేశారు. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో చాలా పెద్ద సంఖ్యలో రైతు కుటుంబాలు లబ్ధిని పొందినట్లు మంత్రి వివరించారు. 1400 మండీలను ఇ-నామ్ (e-NAM)తో అనుసంధానించినట్లు గుర్తు చేశారు. దీనివల్ల పంటల ధరలకు సంబంధించి అత్యంత తాజా సమాచారం దేశవ్యాప్తంగా రైతులకు ఎప్పటికప్పుడు అందుతోందని, ఫలితంగా వారు మార్కెట్ అనుకూల స్థితిగతులను గురించి తెలుసుకోగలుగుతున్నారని మంత్రి అన్నారు.
ఎరువుల రంగంలో, రైతులు ఎరువులను తక్కువ ధరలకు అందుకొనేటట్లు చూసేందుకు కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ స్థాయిలో సబ్సిడీలను సమకూర్చింది. కోవిడ్-19 మహమ్మారి కాలంలోనూ రైతులకు ఎరువులను ఆయా కాలాలకు అనుగుణంగా సరఫరా చేసేందుకు తగిన జాగ్రత్త చర్యలను తీసుకొన్నామన్నారు.
ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు తలెత్తి, ఎగుమతులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మన దేశ వ్యవసాయ రంగం అసాధారణ దృఢత్వాన్ని కనబరచిందని మంత్రి అన్నారు. భారతీయ రైతులు చేసిన కృషి ఫలితంగా వ్యవసాయ రంగ ఎగుమతుల స్థాయిలు నిలకడగా కొనసాగుతూ వచ్చాయని, ఫలితంగా వ్యవసాయం, పశుసంవర్ధకాలతో పాటు మత్స్య పరిశ్రమ.. వీటి ఎగుమతులు రూ.4 లక్షల కోట్ల స్థాయికి పెరిగాయన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ను ఆవిష్కరించడంతో పాటు ‘‘లోకల్ గోస్ గ్లోబల్’’ (అంతర్జాతీయ మార్కెట్లకు స్థానిక ఉత్పత్తులు) దార్శనికతను సాకారం చేయడంలో రైతులు ఒక కీలక పాత్రను పోషించారని ఆయన చెప్పారు.
బాస్మతి, ఇంకా ఇతర రకాల బియ్యం, మసాలా దినుసులు, తాజా పండ్లు, కాయగూరలు, ఉద్యానపంటల ఉత్పత్తులు, పూల పంటల ఉత్పత్తులతో పాటు మత్స్య పరిశ్రమ, కోళ్ల పెంపకం రంగాల్లోనూ ప్రపంచ స్థాయిలో సాఫల్యాన్ని అందుకోవడంలో భారత్ రైతులు కీలక పాత్రను పోషిస్తున్నారని శ్రీ గోయల్ అన్నారు. మద్దతుగా నిలిచే విధానాల రూపకల్పన, ఆర్థిక ప్రోత్సాహకాలు, సుంకాలతో ఏర్పడుతున్న సమస్యలను క్రమంగా పరిష్కరిస్తూపోవడంతో పాటు అభివృద్ధిచెందిన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏస్) కుదుర్చుకొని కొత్త కొత్త మార్కెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చినందువల్ల వ్యవసాయ రంగం మంచి పురోగతిని సాధించిందని ఆయన చెప్పారు. ఎఫ్‌టీఏలు కుదుర్చుకున్న దేశాల్లో ఆస్ట్రేలియా, యూఏఈ, ఈఎఫ్‌టీఏ దేశాలతో పాటు బ్రిటన్ ఉన్నాయని మంత్రి తెలిపారు.
భవిష్యత్తుకేసి మంత్రి దృష్టిని సారిస్తూ విత్తనాల ఉత్పత్తి, నాణ్యత, ప్రాకృతిక వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, సేద్యపు నీటి పారుదల, బిందు సేద్యం.. వీటిలో ఇప్పటితో పోలిస్తే మరింత ప్రగతి చోటుచేసుకోగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ (ఏఐ), జియోస్పేషియల్ టెక్నాలజీ, వాతావరణ స్థితిని ముందుగా అంచనా వేసి చెప్పే వ్వవస్థలు, వర్టికల్ ఫార్మింగ్, ఏఐ ఆధారిత ఉపకరణాలను రంగంలోకి తీసుకువస్తూ డిజిటల్ పద్ధతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నవకల్పనలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓస్)తో పాటు సహకార సంఘాలకు దన్నుగా నిలుస్తాయని ఆయన అన్నారు.
డిజైను, బ్రాండింగు, ప్యాకేజింగులను మెరుగుపరచడంతో పాటు ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పద్ధతుల ద్వారా విలువ జోడింపు.. ఇవి ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అందిస్తున్న తోడ్పాటును పెంచుతాయని కూడా మంత్రి అన్నారు. వ్యవసాయానికి, పశుసంవర్ధకానికి, మత్స్య పరిశ్రమకు నిధుల కేటాయింపులకు తోడుగా, ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల ప్రధాన లక్ష్యం గిడ్డంగి వ్యవస్థతో పాటు నిల్వ సదుపాయాలను బలోపేతం చేయాలన్నదే అని ఆయన వివరించారు.
రైతులకు సురక్షిత, సమృద్ధ భవిష్యత్తును అందించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని శ్రీ గోయల్ అన్నారు. ‘వికసిత్ భారత్’ గమ్యం దిశగా పయనించడంలో వ్యవసాయం ఒక కీలక పాత్రను పోషిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
***
(Release ID: 2144001)