గనుల మంత్రిత్వ శాఖ
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్- డీఎంఎఫ్ ను ప్రారంభించిన గనుల మంత్రిత్వశాఖ
సమగ్ర, క్షేత్రస్థాయి అభివృద్ధి దిశగా కొత్త అడుగు: గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి
ఢిల్లీలోని హ్యాండ్లూమ్ హాట్ వద్ద డీఎంఎఫ్ ప్రదర్శనను కూడా ప్రారంభించిన శ్రీ కిషన్ రెడ్డి
Posted On:
09 JUL 2025 6:20PM by PIB Hyderabad
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) కార్యక్రమాలను ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం (ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ -ఎడిపి), ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ (ఎబిపి) లతో సమన్వయం చేయడానికి రూపొందించిన 'ఆస్పిరేషనల్ డిఎంఎఫ్ ప్రోగ్రామ్ కార్యాచరణ మార్గదర్శకాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక సూచీలను మెరుగుపరిచేందుకు ఎడిపి, ఎబిపి కింద గుర్తించిన అభివృద్ధి ప్రాధాన్యాలతో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ప్రణాళిక, అమలు ప్రక్రియలను వ్యూహాత్మకంగా అనుసంధానం చేయడానికి ఈ మార్గదర్శకాలను రూపొందించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ డీఎంఎఫ్ వర్క్‌షాప్ లో కేంద్రమంత్రి వీటిని విడుదల చేశారు.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ప్రారంభించిన ఈ వర్క్‌షాప్ లో గనుల మంత్రిత్వ శాఖ, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, డీఎంఎఫ్ జిల్లాల ప్రతినిధులు, రాష్ట్ర డీఎంఎఫ్ నోడల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 152 జిల్లా ఖనిజ ఫౌండేషన్‌లు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయి. 62 జిల్లాల కలెక్టర్లు కూడా ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.
గత దశాబ్దంలో ఆరోగ్యం, విద్య, పోషకాహారం, మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడం ద్వారా గనుల ప్రభావిత ప్రాంతాలలో ప్రజల జీవితాలను మార్చడంలో డిఎంఎఫ్ లు కీలక పాత్ర పోషించాయని కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశిస్తున్న సహకార సమాఖ్య విధానానికి, ప్రభుత్వ సమగ్ర విధానానికి డీఎంఎఫ్ లు నిజమైన ఉదాహరణలని ఆయన అన్నారు. నిర్మాణాత్మక, సమాజ ప్రాధాన్యతా కార్యకలాపాలపైనా, అందుబాటులో ఉన్న నిధులను 100 శాతం వినియోగించడంపై దృష్టి సారించి గనుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మార్పును తీసుకురావడానికి డీఎంఎఫ్ ను ఒక పెద్ద కార్యక్రమంగా పరిగణించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా నోడల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రమంత్రి కోరారు. జాతీయ పురోగతిలో ఖనిజాల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, దేశంలోని ప్రతి మూలకు అభివృద్ధి ఫలాలను అందించాలన్న ప్రధానమంత్రి వికసిత, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా గనుల మంత్రిత్వశాఖ పూర్తి సమన్వయంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు.

బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే మాట్లాడుతూ... జిల్లా మినరల్ ఫౌండేషన్ కేవలం ఒక నిధి మాత్రమే కాదని, ఖనిజ సంపద ప్రయోజనాలు చివరి మైలు వరకు చేరేలా చూడటానికి ఒక శక్తిమంతమైన సాధనమని అన్నారు. ఆరోగ్య సంరక్షణ మొదలుకొని విద్య వరకు, జీవనోపాధి నుంచి నైపుణ్యం వరకు డీఎంఎఫ్ దేశంలో గనులు ఉన్న జిల్లాల్లో మార్పును వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. సమ్మిళిత, సాధికార, స్వావలంబన భారత్ నిర్మాణంలో డిఎంఎఫ్ ను కీలక సాధనంగా ఉపయోగించడానికి గనుల మంత్రిత్వశాఖ కట్టుబడి ఉందని శ్రీ దూబే స్పష్టం చేశారు.

ఈ వర్క్ షాప్ లో డీఎంఎఫ్ కార్యకలాపాలను బలోపేతం చేయడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను చాటిచెప్పేఅనేక ప్రభావవంతమైన సెషన్లు, ప్రజంటేషన్ లు నిర్వహించారు. డీఎంఎఫ్ కార్యక్రమాల అమలులో పారదర్శకత, సృజనాత్మకత, సమన్వయం ఆవశ్యకతపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు. డీఎంఎఫ్ లకు నాయకత్వం వహిస్తున్న జిల్లా మేజిస్ట్రేట్ లు/ కలెక్టర్లతో కూడిన నాలుగు బృందాలు ఈ వర్క్‌షాప్‌లో సంబంధిత అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. డీఎంఎఫ్ పారదర్శకత, వినూత్న పద్ధతులు, అమలులో సవాళ్లు, సామర్థ్య పెంపు వంటి కీలక అంశాలపై వారు విలువైన ఆలోచనలు,సూచనలు అందించారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రతినిధులు ఆడిట్ పద్ధతులు, జవాబుదారీ యంత్రాంగాలపై ఆలోచనలను పంచుకున్నారు. పటిష్టమైన పర్యవేక్షణ అవసరాన్ని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాఫీ టేబుల్ బుక్ 2.0 ఆవిష్కరణ మరో ప్రత్యేకాంశంగా నిలిచింది. దేశమంతటా డీఎంఎఫ్ ల నిధులతో అమలు చేస్తున్న ప్రాజెక్టులను గురించి ఇందులో వివరించారు. గనుల ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఈ ప్రాజెక్టుల ద్వారా లభిస్తున్న స్పష్టమైన ప్రయోజనాలను ఇది ప్రతిబింబిస్తుంది.

సవరించిన పీఎంకేకేవై 2024 మార్గదర్శకాలను డీఎంఎఫ్ నిబంధనల్లో చేర్చినందుకు జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గోవా రాష్ట్రాలను ఈసందర్భంగా సన్మానించారు. అలాగే, వార్షిక ఆడిట్ నివేదికలను మరింత పారదర్శకత, జవాబుదారీతనంతో సకాలంలో పూర్తిచేయడంలో మంచి పనితీరు కనబరచినందుకు తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్, గుజరాత్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలను ప్రశంసించారు.
పీఎంకేకేవై 2024 మార్గదర్శకాలను డీఎంఎఫ్ లలో కేంద్రీకృతంగా అమలు చేసేలా అన్ని జిల్లాలు, రాష్ట్రాలకు కార్యాచరణ ప్రణాళికను అందిస్తూ వర్క్ షాప్ ముగిసింది.
అంతకుముందు శ్రీ కిషన్ రెడ్డి హ్యాండ్లూమ్ హాట్ (జన్‌పథ్) వద్ద డీఎంఎఫ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విఎల్ కాంతారావుతో కలిసి శ్రీ కిషన్ రెడ్డి ఎగ్జిబిషన్ లోని స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల సభ్యులతో మాట్లాడారు. డీఎంఎఫ్ నిధులతో తయారైన ఉత్పత్తులు, ఉపాధి కార్యకలాపాలను ప్రదర్శించే ఈ ఎగ్జిబిషన్ ఈనెల 15 వరకు కొనసాగుతుంది. గనుల ప్రభావిత ప్రాంతాలకు చెందిన స్వయంసహాయ బృందాలకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, ప్రజలతో మమేకం కావడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది.

మైనింగ్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సమగ్రమైన, స్థిరమైన, ప్రభావవంతమైన అభివృద్ధి లభించేలా డీఎంఎఫ్ చర్యలను జాతీయ అభివృద్ధి ప్రాధాన్యాలతో సమన్వయం చేయాలన్న ఖనిజ మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ వర్క్ షాప్, ఎగ్జిబిషన్ పునరుద్ఘాటించాయి.
***
(Release ID: 2143591)