బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘గనుల మూసివేతకు ఉత్తమ పద్ధతులను అనుసరించడం ద్వారా సుస్థిర, బాధ్యతాయుత మైనింగ్’ అంశంపై ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు విజయవంతం

Posted On: 04 JUL 2025 5:32PM by PIB Hyderabad

‘గనుల మూసివేతకు ఉత్తమ పద్ధతులను అనుసరించడం ద్వారా సుస్థిర, బాధ్యతాయుత మైనింగ్’ అనే అంశంపై ఇండియన్ నేషనల్ కమిటీ ఆఫ్ ది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ) నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ఈ రోజు విజయవంతంగా పూర్తయింది. ఈ సదస్సు హైదరాబాద్‌లో జరిగింది.

భారత్‌తో పాటు విదేశాలకు చెందిన విధాన రూపకర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, పర్యావరణ నిపుణులు, విద్యార్థులు, ఇతరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సురక్షితంగా గనుల మూసివేతకు సంబంధించిన పరిష్కారాలు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను ఇక్కడ చర్చించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, ఐఎన్‌సీ-డబ్యూఎంసీ నిర్వాహకుడు శ్రీ జీ కిషన్ రెడ్డి హాజరయ్యారు. భారతీయ మైనింగ్ రంగానికి పర్యావరణ హిత, సురక్షితమైన భవిష్యత్తును అందించడంపై తన ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో స్ఫూర్తిని నింపారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. బాధ్యతాయుతమైన, సురక్షితమైన మైనింగ్ పద్దతులను అనుసరించడంలో ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని తెలియజేశారు.

గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ కో-ఛైర్‌పర్సన్ శ్రీ వీఎల్ కాంతారావు, కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ సభ్య కార్యదర్శి శ్రీ పీఎం ప్రసాద్ సహా ఇతర ఉన్నతాధికారులు తమ విలువైన ఆలోచనలు పంచుకొని అర్థవంతమైన చర్చలకు బలమైన పునాది వేశారు. సదస్సు ఇతివృత్తాన్ని ఆలోచనాత్మకంగా పరిచయం చేయడంతో పాటు, చర్చల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్‌పర్సన్ రూపిందర్ బ్రార్ సదస్సు స్థాయిని పెంచారు.

ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ వక్తలు తమ వినూత్నమైన ఆలోచనలను, సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్, గనుల మూసివేత ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచుకున్న సమష్టి దృక్పథాలు భారతీయ మైనింగ్ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తోడ్పతాయి.

మిషన్ గ్రీన్ బుక్‌లెక్, కాపర్, అల్యూమినియం విజన్ డాక్యుమెంట్లు, రిక్లెయిమ్ నియమావళి, ఎక్స్‌ప్లోరేషన్ మాడ్యూల్ ఆఫ్ ది సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ (ఎస్‌డబ్ల్యూసీఎస్), 24 వ నెవేలీ పుస్తక ప్రదర్శన తదితరమైన వాటిని విడుదల చేశారు. ఈ రంగంలో సుస్థిరత, భద్రత, ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో కీలకమైన విజయాలుగా ఇవి నిలిచిపోతాయి.

ఈ సదస్సులో భారత్ కు చెందిన అగ్రశ్రేణి మైనింగ్, పారిశ్రామిక సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో కోల్ ఇండియా, ఎన్ఎల్‌సీ ఇండియా, ఎస్‌సీసీఎల్, ఎంసీఎల్, ఎన్‌సీఎల్, ఎస్‌ఈసీఎల్, హిందాల్కో, ఎన్ఎండీసీ, ఎన్‌టీపీసీ మైనింగ్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ, జీఎండీసీ, ఏపీఎండీసీ, జిందాల్ పవర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, బీసీసీఎల్, సీఎంపీడీఐ, నాల్కో, సీసీఎల్, డబ్ల్యూసీఎల్, ఈసీఎల్, డీవీసీ, హిందూస్థాన్ కాపర్, తదితర సంస్థలు ఉన్నాయి. ఇవి బాధ్యతాయుతమైన వృద్ధిని సాధించడంతో పరిశ్రమల ఉమ్మడి అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, విద్యార్థులు, విలేకరులు, ప్రతినిధులు, పరిశ్రమల భాగస్వాములు, ఈ కార్యక్రమాన్ని విజయవంతమయ్యేందుకు కృషి చేసిన కార్యక్రమ నిర్వహణ బృందానికి ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ ధన్యవాదాలు తెలియజేసింది.



పర్యావరణ హిత, సురక్షితమైన, సమ్మిళితమైన భవిష్యత్తు దిశగా భారతీయ మైనింగ్ రంగాన్ని నడిపించేందుకు చేపట్టాల్సిన చర్చలు, విధానాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఐఎన్‌సీ-డబ్ల్యూఎంసీ లక్ష్యాన్ని ఈ సదస్సు తెలియజేస్తుంది.


 

****


(Release ID: 2142484) Visitor Counter : 3