గనుల మంత్రిత్వ శాఖ
స్వచ్ఛ ఇంధన మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా
కాపర్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి
Posted On:
04 JUL 2025 3:56PM by PIB Hyderabad
ది వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ కి చెందిన ఇండియన్ నేషనల్ కమిటీ ఈ రోజు హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి కాపర్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఉత్తమమైన గనుల మూసివేత పద్ధతుల ద్వారా సుస్థిరమైన, బాధ్యతాయుతమైన మైనింగ్ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.
భారత ఇంధన రంగంలో వస్తున్న మార్పులు, మౌలిక వసతుల వృద్ధి, విద్యుత్ వాహనాలు, సోలార్ విద్యుత్ లాంటి హరిత సాంకేతికతల్లో రాగి అందిస్తున్న సహకారాన్ని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. ముడి వనరుల భద్రతకు హామీ ఇస్తూనే దేశీయంగా పెరుగుతున్న గిరాకీని తీర్చేందుకు అవసరమైన దీర్ఘాకాలిక వ్యూహాన్ని ఈ విజన్ డాక్యుమెంట్ అందిస్తుందని ఆయన అన్నారు. హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్), హిందాల్కో ఇండస్ట్రీస్, కచ్ కాపర్, వేదాంత, ఇండో-ఆసియా కాపర్, లోహమ్ తదితర సంస్థలతో పాటుగా, ఇండియన్ ప్రైమరీ కాపర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐపీసీపీఏ), ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ (ఐసీఏ) లాంటి పరిశ్రమ సంఘాలతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ డాక్యుమెంట్‌ను తయారు చేశారు.
2047 నాటికి ఆరు రెట్లు డిమాండ్ పెరుగుతుందని కాపర్ విజన్ డాక్యుమెంట్ అంచనా వేస్తోంది. అలాగే 2030 నాటికి ద్రవీకరణ, శుద్ది చేసే సామర్థ్యం ఏడాదికి 5 మిలియన్ టన్నుల మేర పెంచే ప్రణాళికను అందిస్తుంది. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో విదేశాల్లోని ఖనిజ వనరులను పొందడం ద్వారా రెండో దశ శుద్ధిని పెంపొందించడం, దేశీయంగా పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం, బహిరంగ మార్కెట్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా దేశం కోసం సుస్థిరమైన, చురుకైన, భవిష్యత్తు అవసరాలకు తగిన రాగి వ్యవస్థను తయారుచేసే దిశగా వేసిన ముందడుగే ఈ కాపర్ విజన్ డాక్యుమెంట్.
***
(Release ID: 2142281)
Visitor Counter : 2