వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఢిల్లీ-‘ఎన్‌సీఆర్‌’లో 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు మూడో వార్షిక ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో’ (బీఎంజీఈ)


రవాణా... సంబంధిత సదుపాయాల రంగంలో చర్చలు... సహకారం... ఆవిష్కరణలకు వేదికగా ‘బీఎంజీఈ’ కీలకపాత్ర

Posted On: 03 JUL 2025 5:19PM by PIB Hyderabad

ఢిల్లీలోని జాతీయ రాజధాని ప్రాంతంలో 2027 ఫిబ్రవరి 4 నుంచి 9 వరకూ ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో (బీఎంజీఈ) మూడో వార్షిక ప్రదర్శనను నిర్వహిస్తారు. రవాణా... సంబంధిత సదుపాయాల పరిశ్రమల ప్రతినిధులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక నిపుణులు సహా ఈ రంగంలోని వివిధ భాగస్వాములను ఒకే వేదికపైకి తేవడం ఈ కార్యక్రమ లక్ష్యం.
కేంద్ర వాణిజ్య-పరిశ్రమల, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖల మద్దతుతో ‘బీఎంజీఈ’ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆటోమోటివ్, రవాణా రంగ విలువ వ్యవస్థలన్నిటా నిరంతర ప్రగతిని ప్రదర్శించే ఒక సమగ్ర వేదికగా ఇది రూపొందింది. ఈ మేరకు 2024, 2025 సంవత్సరాల్లో నిర్వహించిన తొలి రెండు ‘ఎక్స్‌ పో’లలో ఆయా పరిశ్రమలలోని విస్తృత శ్రేణి ప్రతినిధులు పాల్గొన్నారు. కాలుష్య రహిత రవాణా, ఆవిష్కరణలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలతో ఏకీకరణ వంటి అంశాలపై ఈ రెండు కార్యక్రమాలూ దృష్టి సారించాయి.
నిరుటి (2025) ‘ఎక్స్‌ పో’ను మూడు వేదికలు- భారత్ మండపం, యశోభూమి, గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌ పో సెంటర్ అండ్‌ మార్ట్లలో 2 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించారు. ఇందులో 1500 మందికిపైగా ఎగ్జిబిటర్లు భాగస్వాములయ్యారు. వివిధ ఉత్పత్తుల ప్రారంభం, సాంకేతిక ప్రదర్శనలు, సమావేశాలు, కొనుగోలుదారు-అమ్మకందారుల మధ్య చర్చలు, అంతర్జాతీయ ప్రతినిధుల ప్రాతినిధ్యం తదితరాలతో కూడిన ఈ కార్యక్రమానికి 9.8 లక్షలమందికిపైగా సందర్శకులు హాజరయ్యారు.
మునుపటి కార్యక్రమాల నిర్వహణ విధానానికి అనుగుణంగా 2027 ‘బీఎంజీఈ’లోనూ ప్రదర్శనలు, సాంకేతిక గోష్ఠులు, భాగస్వాముల మధ్య సంప్రదింపులు ఉంటాయి. వీటికి అదనంగా ఎక్స్‌ పో పరిధిని విస్తృతం చేసేదిశగా కొత్త విభాగాలను జోడించే అవకాశాలను పరిశీలించారు. తదనుగుణంగా రైలు, రహదారి, గగన, జల మార్గాల్లో పట్టణ-గ్రామీణ రవాణా సంబంధిత “మల్టీ-మోడల్ మొబిలిటీ అండ్‌ లాజిస్టిక్స్” సహా ట్రాక్టర్లు-వ్యవసాయ రవాణా సదుపాయాలపై దృష్టి సారించే ప్రత్యేక ప్రదర్శనలుంటాయి.

‘బీఎంజీఈ’ అనేది పరిశ్రమల నేతృత్వాన సాగే కార్యక్రమం. దీన్ని ఈఈపీసీ- ఇంజనీరింగ్ ఎక్స్‌ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ సమన్వయం చేస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణకు “ఎస్‌ఐఏఎం, ఏసీఎంఏ, ఐసీఈఎంఏ, ఏటీఎంఏ, ఐఈఎస్‌ఏ, ఐఎస్‌ఏ, నాస్కామ్‌, ఎంఆర్‌ఏఐ, సీఐఐ, టీఎంఏ, ఇన్వెస్ట్ ఇండియా, ఐబీఈఎఫ్‌, ఏటీపీవో, యశోభూమి, ఐఈఎంఎల్‌” వంటి సంస్థలు మద్దతిస్తున్నాయి.

సుస్థిర, సార్వజనీన చలనశీలత సంబంధిత విస్తృత జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఆలోచనల ఆదానప్రదానం, భాగస్వామ్యాలు, రంగాల ప్రాతిపదికన సంబంధాలకు ఈ ఎక్స్‌ పో ఒక వేదికగా కొనసాగుతోంది.

 

***


(Release ID: 2141947)
Read this release in: Tamil , English , Urdu , Hindi