మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సావిత్రీబాయి ఫూలే జాతీయ మహిళా శిశు సంక్షేమ సంస్థగా ఎన్ఐపీసీసీడీ పేరు మార్పు


· గొప్ప సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే సేవలకు ఘనమైన నివాళిగా ఎన్ఐపీసీసీడీకి ఆమె పేరు పెట్టాం: శ్రీమతి అన్నపూర్ణాదేవి

· జులై 4న రాంచీలో కొత్త ప్రాంతీయ కేంద్రం ప్రారంభం

· కొత్త కేంద్రం ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు మెరుగైన శిక్షణ, మద్దతును అందించి వారిని సాధికారులని చేయడమే కాక, క్షేత్ర స్థాయిలో ప్రధాన కార్యక్రమాలను బలోపేతం చేస్తుంది: శ్రీమతి అన్నపూర్ణాదేవి

Posted On: 02 JUL 2025 10:45AM by PIB Hyderabad

ప్రజా సహకారం, శిశు సంక్షేమ జాతీయ సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ - ఎన్ఐపీసీసీడీ) పేరును అధికారికంగా ‘సావిత్రిబాయి ఫూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్’ గా మార్చారు. పెరుగుతున్న సంస్థ ప్రాముఖ్యాన్ని... దేశంలోని మహిళలు, పిల్లల సంక్షేమం లక్ష్యంగా ప్రాంతాలవారీగా, ప్రత్యేక ప్రణాళికలతో చేపట్టే కార్యక్రమాలనూ ఈ మార్పు ప్రతిబింబిస్తోంది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి దార్శనిక నాయకత్వంలో ఈ మార్పు జరిగింది.

సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రాంతీయ సామర్థ్య పెంపు లక్ష్యాలుగా జూలై 4న జార్ఖండ్‌ రాంచీలో కొత్త ప్రాంతీయ కేంద్రం ప్రారంభం కానుంది. మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాలైన మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, మిషన్ సక్షమ్ అంగన్‌వాడీ, పోషణ  2.0 వంటి కార్యక్రమాల అమలు కోసం అవసరమయ్యే  ప్రత్యేక శిక్షణ, పరిశోధన అవసరాలను ఈ కేంద్రం తీరుస్తుంది. జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలతో కూడిన తూర్పు ప్రాంతంపై ఈ కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. గతంలో ఈ రాష్ట్రాల శిక్షణ అవసరాలను గౌహతి, లక్నోల్లోని ప్రాంతీయ కేంద్రాలు పాక్షికంగా తీర్చినప్పటికీ, సుదూర ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల కార్యకర్తలు పలు సవాళ్ళను ఎదుర్కొనేవారు. కొత్త ప్రాంతీయ కేంద్రం చైల్డ్ గైడెన్స్, కౌన్సెలింగ్‌లో అడ్వాన్స్ డిప్లొమాను అందించడం సహా ఆయా రాష్ట్రాల్లోని ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు సులభంగా అందుబాటులోకి వస్తుంది. నాలుగు రాష్ట్రాలు, 115 జిల్లాల్లో మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న పథకాల్లో  ఏడు లక్షలకు పైగా కార్యకర్తలు పనిచేస్తున్నారని అంచనా.

గొప్ప సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే సేవలను సంస్మరిస్తూ ఎన్ఐపీసీసీడీ పేరును ‘సావిత్రీబాయి ఫూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్’ గా మార్చడం ఆమెకు ఇచ్చే ఘనమైన నివాళి అని శ్రీమతి అన్నపూర్ణాదేవి అన్నారు. మహిళలు, పిల్లల కేంద్రీకృత అభివృద్ధి పట్ల మంత్రిత్వశాఖ నిబద్ధతను ఈ చర్య తెలియజేస్తోందని మంత్రి అన్నారు. కొత్త ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, రాంచీలో కొత్త ప్రాంతీయ కేంద్రం ప్రారంభం, తూర్పు ప్రాంతంలో వికేంద్రీకృత, ప్రాంత-నిర్దిష్ట సామర్థ్య నిర్మాణం వైపు వేసే  ముఖ్యమైన అడుగు కాగలదని మంత్రి అన్నారు. ఈ కేంద్రం ఫ్రంట్‌లైన్ కార్యకర్తలకు శిక్షణ, మద్దతును అందించి సాధికారులను చేయడమే కాక, క్షేత్రస్థాయిలో ప్రధాన లక్ష్యాలను బలోపేతం చేస్తుందని అన్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో, వికసిత్ భారత్ @2047 లక్ష్యం వైపు చేసే ప్రయాణంలో ఏ స్త్రీ,  బిడ్డ వెనుకబడి పోకుండా నిర్ధారిస్తున్నామని ఆమె అన్నారు.

రాంచీలో ఏర్పాటు చేసిన కొత్త ప్రాంతీయ కేంద్రం శిక్షణ సేవలను క్షేత్రస్థాయి కార్యకర్తలకు చేరువ చేయడమే కాక, తూర్పు ప్రాంతంలో మహిళా సాధికారత, పిల్లల సంక్షేమ సాధనలో ఎదురయ్యే  స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అనువైన వ్యూహ రచన, మెరుగైన వనరుల వినియోగాన్ని సాధ్యం చేస్తుందని చెప్పారు.  పిల్లల అభివృద్ధి, మానసిక ఆరోగ్యం, కౌమారదశ శ్రేయస్సుకు సంబంధించిన పరిశోధన, కౌన్సెలింగ్, ఇతర  సంక్షేమ కార్యకలాపాలకు కూడా ఈ కేంద్రం దన్నుగా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి నాయకత్వంలో సమ్మిళిత, సాధికార, ఆరోగ్యవంతమైన భారతదేశ సృష్టి లక్ష్యంగా... క్షేత్రస్థాయిలో సేవలను అట్టడుగు లబ్ధిదారు వరకూ చేర్చడం, ప్రాంత-నిర్దిష్ట సామర్థ్య నిర్మాణాల పట్ల మంత్రిత్వశాఖ నిబద్ధతకు ఈ చర్యను నిదర్శనంగా భావించవచ్చు.

సావిత్రీబాయి ఫూలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గా పేరు మార్చుకున్న ఎన్ఐపీసీసీడీ  ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం బెంగళూరు, గౌహతి, లక్నో, ఇండోర్, మొహాలీల్లో ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థ మహిళా శిశు సంక్షేమ రంగంలో శిక్షణ, పరిశోధన, డాక్యుమెంటేషన్, సామర్థ్య నిర్మాణంలో అత్యున్నత సంస్థగా పనిచేస్తోంది. ఆన్‌లైన్, ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమాల ద్వారా వివిధ ప్రధాన పథకాల అమలు విధానాలను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది.


 

***


(Release ID: 2141625)