కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముందస్తు ఉపసంహరణలకు ఆటో సెటిల్మెంట్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు.. సభ్యులకు వేగంగా నిధులు అందేలా ఈపీఎఫ్‌ఓ కీలక ముందడుగు

Posted On: 24 JUN 2025 6:22PM by PIB Hyderabad

ఈపీఎఫ్‌ఓ సభ్యుల సేవలను మెరుగుపరిచే దిశగా ఆ సంస్థ కీలక ముందడుగు వేసింది. ముందస్తు ఉపసంహరణ కోసం ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని ఇప్పుడున్న లక్ష రూపాయల నుంచి రూ. 5 లక్షలకు పెంచింది. దీంతో లక్షలాది ఈపీఎఫ్‌వో సభ్యులు, ముఖ్యంగా అత్యవసర సమయాల్లో వేగంగా నిధులను పొందే అవకాశం లభిస్తుంది.

సభ్యులకు త్వరితగతిన ఆర్థికసాయం అందించడం లక్ష్యంగా, కోవిడ్-19 విపత్తు సమయంలో ఈపీఎఫ్‌ఓ  తొలిసారిగా ఈ ముందస్తు ఉపసంహరణల ఆటో సెటిల్‌మెంట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అనారోగ్యం, విద్య, వివాహం, గృహనిర్మాణాల కోసం ముందస్తు ఉపసంహరణలను దీని పరిధిలో చేరుస్తూ ఈ సదుపాయాన్ని విస్తరించారు. సిబ్బంది ప్రమేయం లేకుండా కంప్యూటర్‌ వ్యవస్థే ఈ లావాదేవీలను పరిష్కరిస్తుంది. ఇది త్వరితగతిన సొమ్ములు లభించేలా భరోసానివ్వడంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేస్తుంది.

2024-25లో ఆటో సెటిల్మెంట్ ద్వారా 2.34 కోట్ల ముందస్తు ఉపసంహరణలను విజయవంతంగా పరిష్కరించి, ఈపీఎఫ్‌ఓ సంస్థ రికార్డు సృష్టించింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది గణనీయంగా 161 శాతం పెరగడం గమనార్హం. వీటిలో ఆటోమోడ్‌లో పరిష్కరించినవే 59% ఉన్నాయి.

ఈ పురోగతిని కొనసాగిస్తూ.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండున్నర నెలల్లో ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే 76.52 లక్షల ఉపసంహరణలను ఆటో సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించింది. ఇప్పటి వరకు దాఖలైన మొత్తం ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్‌లలో ఇది 70 శాతం. ఆటోమేషన్, అలాగే సభ్యులకు వేగవంతమైన, మరింత సమర్థమైన సేవలను అందించాలన్న ఈపీఎఫ్‌ఓ  సంకల్పానికి ఇది నిదర్శనం.

రూ. 5 లక్షల పరిమితిని పెంచడంతో, ఆ మేరకు అదనపు ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్‌లకు ఇకపై ఆటో సెటిల్‌మెంట్‌ వర్తిస్తుంది. దీంతో సమర్పించిన మూడు రోజుల్లోనే ప్రాసెసింగ్‌ పూర్తవుతుంది. పరిమితి పెంపు, నిధులు వేగంగా లభించడం వంటి అంశాలు అత్యవసర సమయాల్లో సకాలంలో ఆర్థిక సాయం పొందేలా సభ్యులకు ఎంతగానో ఉపయోగపడతాయి.

సాంకేతికతను ఉపయోగించి సేవలను మెరుగుపరిచే దిశగా ఈపీఎఫ్‌ఓ  చేస్తున్న విస్తృత కృషిలో ఈ చర్య భాగం. అంతరాయం లేకుండా, సమర్థంగా సేవలనందించేలా సాంకేతికతను వినియోగించుకోవడంతోపాటు ప్రక్రియల సరళీకరణను కొనసాగిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఈపీఎఫ్‌ఓ  సభ్యులకు మరింత సులభతరమైన సేవలను అందించడంపై ప్రభుత్వ నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తోంది. క్లెయింల పరిష్కారాన్ని వేగవంతం చేయడమే కాకుండా, ఈపీఎఫ్‌ఓ  సభ్యుల నుంచి ఫిర్యాదులను తగ్గించడంలో కూడా ఈ సంస్కరణలు దోహదపడ్డాయి. సభ్యులకు ఇది మరింత జీవన సౌలభ్యాన్ని అందిస్తోంది.  

 

***


(Release ID: 2139474)
Read this release in: English , Gujarati , Urdu , Hindi