రక్షణ మంత్రిత్వ శాఖ
ఘనంగా 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించిన ఎన్‌సీసీ: యోగా చేసిన 9 లక్షల మంది కేడెట్లు
Posted On:
21 JUN 2025 1:35PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఏకకాలంలో జరిగిన యోగా సాధన కార్యక్రమాల్లో 11లక్షలకు పైగా ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొన్నారు. 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సీసీ) ఘనంగా నిర్వహించింది. ఆరోగ్యం, ఆరోగ్యకర జీవనం పట్ల దేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ఈ కార్యక్రమం తెలియజేస్తోంది.
ఉత్తరాన లే నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు… పశ్చిమాన ద్వారక నుంచి తూర్పున తేజు వరకు.. రిషికేశ్‌లోని త్రివేణి ఘాట్‌లు, చెన్నైలోని మెరీనా బీచ్, గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం, శాంతి స్థూపం, లే, బ్రహ్మపుత్ర నది తీరం, గౌహతి, దాల్ సరస్సు, జమ్మూ కాశ్మీర్ తదితర అత్యంత ప్రసిద్ధ, సుందరమైన ప్రదేశాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ పార్కులు, పాఠశాలలు, కళాశాలలలో యోగా కార్యక్రమాలను ఎన్‌సీసీ నిర్వహించింది.
ఢిల్లీలోని ప్రసిద్ధ కరియప్ప స్టేడియంలో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి ఇతర సైనికులూ, వారి కుటుంబాలతో కలిసి యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు. 25 దేశాల్లో పని చేస్తున్న రక్షణ శాఖ అనుబంధ రాయబారులు (డిఫెన్స్ అటాచీలు), ఎన్‌సీసీ కేడెట్లు, స్కూలు పిల్లలు, ఆర్మీ కుటుంబాలతో సహా 3,400 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా ఆరోగ్యం, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడంలో ఎన్‌సీసీకి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. కేడెట్ల విస్తృత భాగస్వామ్యం.. దేశంలోని యువతలో ఈ విషయాల పట్ల అవగాహన ఉందన్నది నిరూపణ అయింది. ఇది దేశ నిర్మాణంలో ఎన్‌సీసీ పోషిస్తోన్న కీలక పాత్రను తెలియజేస్తోంది. క్రమశిక్షణ, శారీరక ధృడత్వం, పూర్తి ఆరోగ్యానికి సంబంధించిన విలువలను పెంపొందించడం ద్వారా బలమైన, శక్తివంతమైన సమాజాన్ని ఎన్‌సీసీ రూపొందిస్తున్నది.
***
(Release ID: 2138400)