రక్షణ మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలోని నావికా దళ నౌకా కేంద్రంలో త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో భారత నావికా దళంలో చేరిన ఐఎన్ఎస్ అర్నాలా
ఆరు స్వదేశీ జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌకలలో మొదటిది..
అత్యాధునిక ఏఎస్‌డబ్ల్యూ ఆయుధాలు, సెన్సార్ వ్యవస్థలు దీని సొంతం
Posted On:
18 JUN 2025 4:13PM by PIB Hyderabad
జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌకలలో మొదటిదైన ఐఎన్ఎస్ అర్నాలా భారత నావికాదళంలోకి చేరింది. 2025 జూన్ 18న విశాఖపట్నంలోని నావికా దళ నౌకా కేంద్రంలో త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో తూర్పు నావికా దళ విభాగంలో కార్యకలాపాలు ప్రారంభించింది.
ఈ కార్యక్రమం తూర్పు నావికాదళ కమాండ్‌లోని ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. నావికాదళ సీనియర్ అధికారులు, ప్రముఖులు, పూర్వపు అర్నాలా మాజీ కమాండింగ్ అధికారులు, అతిథులు.. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ), లార్సెన్ అండ్ టూబ్రో షిప్ బిల్డింగ్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
విస్తృత శ్రేణి జలాంతర్గామి నిరోధక కార్యకలాపాల కోసం తయారుచేసిన ఐఎన్ఎస్ అర్నాలాలో సముద్ర జలాల లోపల నిఘా, లక్ష్యాలపై దాడి చేయటం… గాలింపు, సహాయక చర్యలు.. సముద్రాల్లో చిన్న స్థాయి ఆపరేషన్లు (ఎల్ఐఎంఓ) నిర్వహించేందుకు కావాల్సిన అన్ని పరికరాలు, సౌకర్యాలు ఉన్నాయి. 77 మీటర్ల పొడవున్న ఈ యుద్ధనౌక 1490 టన్నులకు పైగా ఉంది. డీజిల్ ఇంజిన్-వాటర్‌జెట్ కలయికతో నడిచే అతిపెద్ద భారతీయ నావికాదళ యుద్ధనౌక ఇది.
ఐఎన్ఎస్ అర్నాలా నావికా దళంలో చేరటమనేది దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా స్వదేశీ పరిజ్ఞానం, ఇంజనీరింగ్, తయారీకి సంబంధించిన విజయాన్ని ప్రధానంగా తెలియజేస్తోంది.
సముద్రాల విషయంలో భారత్ మరింత స్వావలంబన వైపు ప్రయాణం సాగిస్తోంది. ఈ విషయంలో ఏఎన్ఎస్ అర్నాలా దేశ సామర్థ్యం, పారిశ్రామిక భాగస్వామ్యం, నావికా నైపుణ్యానికి గర్వకారణంగా నిలుస్తోంది.
ముఖ్య అతిధిగా హాజరైన త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.."కొనుగోలుదారుల నావికాదళం" నుంచి "తయారీ నావికాదళానికి" భారత నావికాదళం సాధించిన అద్భుతమైన ప్రగతిని ప్రధానంగా ప్రస్తావించారు. దీనిని దేశానికి సముద్రాల విషయంలో (బ్లూ వాటర్) ఉన్న ఆకాంక్షలకు ప్రతీకగా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో నౌకలు.. ప్రధాన నౌకలు, వాటికి సహయకరంగా ఉండే చిన్న నౌకలు నిర్మాణమవుతుండటంతో భారత్ నౌకా నిర్మాణంలో ఒక బలీయమైన శక్తిగా తయారైంది.
స్వదేశీ యుద్ధనౌకలు ఇప్పుడు స్టెల్త్ సాంకేతికత నుంచి ఎలక్ట్రానిక్ యుద్ధక్షేత్ర వ్యవస్థలు(వార్‌ఫేర్ సూట్లు), అధునాతన సెన్సార్‌ల వరకు అత్యాధునిక స్వదేశీ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఇవి యుద్ధ సంసిద్ధతను మరింత పెంచుతాయి. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేస్తాయి. స్వదేశీ పద్ధతిలో వ్యూహాత్మక దృక్పథాన్ని స్పష్టమైన ఫలితాల రూపంలోకి మార్చటంలో నావికాదళం ప్రదర్శిస్తోన్న దృఢ నిబద్ధతను సీడీఎస్ ప్రశంసించారు.
మహారాష్ట్రలో సముద్ర తీరంలో ఉన్న చారిత్రక కోట పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు. భవిష్యత్తులో రానున్న సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన స్థాయిలో నౌకాదళ సామర్థ్యాన్ని ఏర్పాటుచేసుకునే దిశలో ఐఎన్ఎస్ అర్నాలా ఒక ముందడుగు.
***
(Release ID: 2137636)