రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కేరళ తీరానికి దూరంగా మంటలు చెలరేగిన కంటెయినర్ నౌక: ఐసీజీ ప్రయత్నాలు ముమ్మరం

Posted On: 11 JUN 2025 8:56PM by PIB Hyderabad

మంటలు చెలరేగుతూ ఉన్న సింగపూర్ కంటెయినర్ నౌక ‘ఎమ్‌వీ వాన్ హయి 503’లోకి రక్షక దళానికి చెందిన అయదుగురు సభ్యులు, ఎయిర్‌క్రూ కు చెందిన లోతట్టు జలాల్లో ఈదడంలో నిపుణుడైన వ్యక్తిని భారతీయ కోస్తా తీర రక్షకదళం (ఐసీజీ) బుధవారం (జూన్ 11న) పంపించింది. ఈ నెల 9న కేరళ తీరంలో మంటలు అంటుకున్న సింగపూర్ కంటెయినర్ నౌక కేరళలోని బేపుర్‌కు సుమారు 42 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న భారత ప్రత్యేక ఆర్థిక మండలం (ఈఈజడ్) లోపలకు- ఆగ్నేయ దిశ నుంచి- చొచ్చుకువస్తోంది.  

నౌకలో 2,128 మెట్రిక్ టన్నుల ఇంధనంతో పాటు వందల కొద్దీ కంటెయినర్లు ఉన్నాయి. వాటిలో ప్రమాదకరమైన సరుకు కూడా ఉంది. దీంతో సముద్ర పర్యావరణానికే కాకుండా, ఆ ప్రాంతంలో నౌకారవాణా మార్గాలకు కూడా పెద్ద ముప్పు ఎదురుకావొచ్చు. మంటలను ఆర్పడానికి ఐసీజీ చేపట్టిన ప్రయత్నాలతో, ఇంతవరకు చెలరేగిన జ్వాలలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు కార్గో హోల్డులలోనూ, బేస్ (అఖాతాల)లోనూ పొగ మాత్రమే కనిపిస్తోంది. ఏమైనా, లోపలి భాగపు డెక్‌లలోనూ, ఇంధన ట్యాంకుల సమీపంలోనూ ఇప్పటికీ ఇంకా మంటలు రేగుతూ ఉన్నట్లే అగుపిస్తోంది.

మంటలను ఆర్పే కార్యకలాపాలలో అయిదు ఐసీజీ నౌకలు, రెండు డార్నియర్ విమానాలతో పాటు ఒక హెలికాప్టర్ సేవలను వినియోగించుకొంటున్నారు. షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్‌కు చెందిన రెండు నౌకలు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి. నౌక యజమానులు రంగంలోకి దించిన ఒక రక్షణ దళం కూడా ఐసీజీతో కలిసి పనిచేస్తోంది. అదనంగా వైమానిక సహాయాన్ని సమకూర్చాల్సిందిగా భారతీయ వైమానిక దళానికి కూడా విజ్ఞప్తి చేశారు.

మంటలు ఇంకా పూర్తి స్థాయిలో చల్లారలేదు.. ఇది పర్యావరణానికి ఏదైనా విపత్తును తెచ్చిపెట్టకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి టో లైనును ఏర్పాటు చేయడానికి, నౌకను తీరం నుంచి దూరంగా ఈడ్చుకుపోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు. స్థితి ఇప్పటికీ గంభీరంగానే ఉండడంతో, నిరంతర ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు.‌ ‌

 

***‌‌


(Release ID: 2135887) Visitor Counter : 3