మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పఢ్ ఏఐ: విద్యలో కృత్రిమ మేధ’ సమాలోచన ముగింపు సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగం

కృత్రిమ మేధకు దేశంలోని మానవ మేధ నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది – శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 28 MAY 2025 8:43PM by PIB Hyderabad

విధాన పరిశోధన, నిర్వహణ కేంద్రం (సీపీఆర్జీ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నేడు నిర్వహించిన ‘పఢ్ ఏఐ: విద్యలో కృత్రిమ మేధ’ సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ భాషా సమితి చైర్మన్ శ్రీ చాము కృష్ణ శాస్త్రి, సీపీఆర్జీ డైరెక్టర్ డాక్టర్ రామానంద్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ కేవలం ఓ సాంకేతికత మాత్రమే కాదనీ.. అది పరిమిత వనరులతోనే పనితీరులో ప్రభావాన్ని గణనీయంగా పెంచుతుందని, ఆవిష్కరణలకు ప్రేరణనిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది సహానుభూతికి, సాంకేతికతకు మధ్య వారధి అన్నారు. ప్రస్తుతం విస్తరిస్తున్న ఏఐ విప్లవానికి దేశంలోని మానవ మేధ నేతృత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ ప్రధాన్ పేర్కొన్నారు.

 

ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను నెలకొల్పడం, భారతీయ భాషల్లో కృత్రిమ మేధను వినియోగించుకునేందుకు ప్రకటన, తరగతి గదుల్లో విశ్లేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం... ఏఐపై ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను కూడా శ్రీ ప్రధాన్ ప్రస్తావించారు. చాక్‌బోర్డుల నుంచి చిప్ సెట్ల దిశగా సమూల మార్పునకు దోహదపడే కార్యక్రమాలే ఇవన్నీ. పాఠశాల విద్యలో కృత్రిమ మేధను అనుసంధానం చేయడం ఇకపై ఐచ్ఛికం కాదని, ఇది అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు. విద్యావేత్తలు, టెక్ నిపుణులు మేధోమథనం చేసి కృత్రిమ మేధపై విధానపరమైన సిఫార్సులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 

రెండు రోజుల పాటు జరిగిన పఢ్ ఏఐ సదస్సులో భారతీయ విద్యావ్యవస్థ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కృత్రిమ మేధ పాత్రపై విభిన్న అభిప్రాయాలు చర్చకు వచ్చాయి. తరగతి గదులకు అతీతంగా అభ్యసన విధానాన్ని కృత్రిమ మేధ ఎలా విస్తరిస్తున్నదో, ఉన్నత విద్యలో విప్లవాత్మకమైన మార్పులను ఎలా తెస్తున్నదో వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంస్థల్లో అవరోధాలనూ చర్చించారు.

 

కేంద్ర వాణిజ్యం - పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ - ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద; ఢిల్లీ హోం, విద్యుత్, పట్టణాభివృద్ధి, విద్య, ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక విద్యా శాఖల మంత్రి శ్రీ ఆశిష్ సూద్; కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినీత్ జోషి; ఇండియా ఏఐ మిషన్ సీఈవో శ్రీ అభిషేక్ సింగ్, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్‌పర్సన్ ప్రొఫెసర్ పంకజ్ అరోరా, జాతీయ విద్యా సాంకేతికతా వేదిక చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధే, ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేశ్ సింగ్, ఇన్ఫో ఎడ్జ్ సహ వ్యవస్థాపకులు శ్రీ సంజీవ్ బిఖ్‌చాందినీ, ఢిల్లీలోని హిగాషి ఆటిజం స్కూల్ చైర్‌పర్సన్ డాక్టర్ రష్మీ దాస్ సహా ప్రముఖ వక్తలు ప్రసంగించారు.  

 

****


(Release ID: 2132289)
Read this release in: English , Urdu , Hindi , Tamil