శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… రాష్ట్రానికి సంబంధించిన శాస్త్ర, ఆవిష్కరణ విషయంలో కేంద్రం సహాయం చేయాలని వినతి


శాస్త్ర సాంకేతిక రంగంలో వివిధ కార్యక్రమాలకు మద్దతివ్వాలని కేంద్రాన్ని కోరుతున్న ఆంధ్రప్రదేశ్

Posted On: 23 MAY 2025 5:47PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వ శాఖ, భూవిజ్ఞాన శాఖ, ప్రధాని కార్యాలయ, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ డాక్టర్‌ జితేంద్ర సింగ్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆధునిక హై-టెక్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి సాంకేతికత విషయంలో సహాయం చేయాలని కోరారు. కొత్తగా వస్తోన్న సాంకేతికతలు, శాస్త్రీయ ఆవిష్కరణలకు కేంద్రంగా మార్చేందుకు పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రి ముందు పెట్టారు.

ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన డాక్టర్ జితేంద్ర సింగ్ సంబంధిత శాఖలు వీటిపై పనిచేస్తాయని హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వ పథకం “విజ్ఞాన్ ధార”ను రాష్ట్రం మరింత ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి అట్టడుగు స్థాయిలో ఆవిష్కరణలు, పరిశోధనలకు సాధికారత కల్పించేందుకు మరింత సహకారం కావాలని కోరారు.

తిరుపతిలో ఒక జాతీయ సుాపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం ప్రధాన ప్రతిపాదనలలో ఒకటి. ఇది ఈ ప్రాంతంలో విద్యా, పరిశోధనకు కావాల్సిన అత్యాధునిక కంప్యూటింగ్ అవసరాలను తీర్చనుంది. విశాఖపట్నంలో అంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్‌)ని శాస్త్ర సాంకేతిక ఆధారిత వ్యవస్థగా అభివృద్ధి చేసే అంశంపై కూడా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర శాస్త్ర సాంకేతిక సంస్థలతో మరింత సహకారం కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక సీఎస్ఐఆర్ ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. జీవ శాస్త్రాలలో పరిశోధన, పారిశ్రామిక అనుసంధానత విషయంలో ముందుకెళ్లేందుకు ప్రత్యేక బయోటెక్ పార్క్, బయెటెక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రస్తావనను మంత్రి ముందుంచారు.

జాతీయ క్వాంటమ్ మిషన్‌లో చేరేందుకు ముఖ్యమంత్రి ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. రైతులకు సంబంధించిన వ్యవసాయ-సాంకేతిక పరిష్కారాలను బలోపేతం చేయడానికి కేంద్ర సహాయాన్ని కోరారు. భవిష్యత్ సాంకేతికతలు, డీప్ టెక్‌, ఇంటిగ్రేటెడ్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రాధమిక గమ్యస్థానంగా బ్రాండింగ్ చేయడానికి కూడా మద్ధతునివ్వాలని విన్నవించారు.

క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ఆంధ్రప్రదేశ్ శైలిని గుర్తించిన మంత్రి.. అన్ని ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ చిత్తశుద్ధితో ఉన్నట్లు పునరుద్ఘాటించారు. శాస్త్ర సాంకేతిక విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో బలమైన వ్యవస్థ ఉందన్న మంత్రి.. అన్ని ప్రతిపాదనలను సీఎస్ఐఆర్, డీబీటీ, డీఎస్టీ, ఇతరులతో సహా సంబంధిత శాఖలతో కలిసి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన జాతీయ మిషన్‌లలో రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామి చేయటం ఎంతో ముఖ్యమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సానుకూల నిర్ణయాలు వచ్చేందుకు అన్ని ప్రతిపాదనలు తగిన విధాన ప్రక్రియను అనుగుణంగా ఉండాలని పేర్కొన్నారు.

శాస్త్ర సాంకేతికత విషయంలో కేంద్ర-రాష్ట్ర సహకారాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు సమన్వయం తీసుకొచ్చే విషయంలో ఉన్న బలమైన సంకల్పాన్ని ఈ సమావేశం తెలియజేస్తోంది. కేంద్రం మద్దతుతో, ఈ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో నూతన ఆవిష్కరణల ఆధారిత అభివృద్ధికి మార్గం సుగమం చేయగలవు.

 

***


(Release ID: 2130914)
Read this release in: English , Urdu , Hindi , Tamil