లోక్‌సభ సచివాలయం
నయా భారత్‌లో కొత్త రైల్వే స్టేషన్లు దేశ పురోగతికి ప్రతీకలు: లోక్‌సభ స్పీకర్ కొత్త హంగులతో తీర్చిదిద్దిన బుండి రైల్వే స్టేషన్‌ను బికనీర్ నుంచి ప్రారంభించిన ప్రధాని నియోజకవర్గ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన లోక్‌సభ స్పీకర్
Posted On:
22 MAY 2025 7:27PM by PIB Hyderabad
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొత్త హంగులతో తీర్చిదిద్దిన బుండి రైల్వే స్టేషన్‌ను రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా బుండిలో జరిగిన కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా హాజరయ్యారు. స్థానికుల తరఫున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త సొబగులద్దుకున్న బుండి రైల్వే స్టేషన్ ఆధునిక అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వాల విశిష్ట సమ్మేళనానికి చిహ్నమని వ్యాఖ్యానించారు.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్న కొత్త రైల్వే స్టేషన్లు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రయాణ కేంద్రాలు మాత్రమే కాదనీ.. ఇవి నవభారత సరికొత్త ఆలోచనలు, ఆధునిక దృక్పథం, పురోగతికి కూడా నిదర్శనమని శ్రీ బిర్లా వ్యాఖ్యానించారు. ఇప్పుడు బుండి సరికొత్త అస్తిత్వం దిశగా అడుగులేస్తోందని శ్రీ బిర్లా పేర్కొన్నారు. పర్యాటక రంగంలో బుండికి ప్రత్యేక గుర్తింపును తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ దిశలో అనేక ముఖ్యమైన కార్యక్రమాలు ఇప్పటికే పూర్తవగా, చాలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
శరవేగంగా విస్తరిస్తున్న రైల్వే వ్యవస్థ
ప్రధానమంత్రి శ్రీ మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ శరవేగంగా విస్తరిస్తోందని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాలను అందిస్తోందని శ్రీ బిర్లా తెలిపారు. గత 11 ఏళ్లలో కోటా-బుండి ప్రాంతంలోని ప్రధానమైన, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉండే రైల్వే స్టేషన్లను పునరుద్ధరించామని ఆయన పేర్కొన్నారు. కొత్త రైలు సర్వీసులు, ఎంఈఎంయూ రైళ్లను ప్రారంభించడంతో ప్రయాణం సులభతరమైందన్నారు. బుండి వద్ద గతంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేవారు కాదని, ఇప్పుడు ఆ సదుపాయం కల్పించడంతో పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. కోటా, రామ్‌గంజ్ మండి, కేషోరైపటాన్, బుండి, కప్రేన్, దిగోడ్, అర్నేతా వంటి స్టేషన్లలో 14 రైళ్లను ఆపడంతో ప్రయాణికులకు ఆ ప్రాంతాలకు చేరుకోవడంలో సౌలభ్యం కలిగిందని శ్రీ బిర్లా చెప్పారు.
ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు
రూ. 8.15 కోట్ల వ్యయంతో బుండి రైల్వే స్టేషన్‌ను ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇది సౌలభ్యం, సౌందర్యం, వారసత్వాల సమ్మేళనం. భారీ ప్రవేశ ద్వారం, ఆకర్షణీయమైన ముఖద్వారం, హైమాస్ట్ లైటింగ్, ఆధునిక వెయిటింగ్ రూమ్‌లు, కొత్త టికెట్ కౌంటర్, పరిశుభ్రమైన ఆధునిక టాయిలెట్లు, దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ర్యాంపుల వంటి సౌకర్యాలున్నాయి. ప్రయాణికులందరికీ సౌలభ్యాన్నీ, సురక్షితమైన, ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందించేలా స్టేషన్ పూర్తిగా సిద్ధమైంది.
***
(Release ID: 2130741)
Visitor Counter : 4