సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఆకాష్టీర్: భారత వినూత్న యుద్ధ సామర్థ్యం వెనుక అదృశ్య శక్తి
శత్రువు తనను పసిగట్టే లోపే లక్ష్యం ఛేదించగల ఆయుధం
Posted On:
16 MAY 2025 5:54PM by PIB Hyderabad
ఓ సరికొత్త ఆయుధం... చీకటి కమ్మిన ఆకాశంలో నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. అది ఫైటర్ జెట్ తరహాలో దిక్కులు పిక్కటిల్లే శబ్దం చేయదు లేదా క్షిపణిలా విరుచుకుపడదు. అది చిరుశబ్దాన్ని కూడా పసిగట్టగలదు.. కచ్చితమైన అంచనాతో... మెరుపుదాడి చేయగలదు. ఈ అదృశ్య ఛత్రం పేరే “ఆకాష్టీర్”... ఇదిప్పుడు రక్షణరంగ పత్రికల సమాచారానికి పరిమితమైన భావన కాదు. భారత గగనతల రక్షణ అమ్ములపొదిలో ఇప్పుడు పదునైన ఆయుధం. ఇదొక దుర్భేద్య అదృశ్య దుర్గం... ఈ నెల 9, 10 తేదీల్లో పాకిస్థాన్ నిశిరాత్రి భారత సైనిక, పౌర ఆవాసాలపై అత్యంత పాశవికంగా క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడినప్పుడు వాటన్నిటినీ తుత్తునియలు చేసిన శక్తి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన స్వయంచలిత గగనతల రక్షణ నియంత్రణ-నివేదన వ్యవస్థ ‘ఆకాష్టీర్.’ మన భూభాగంలో ప్రవేశించిన ప్రతి గగనతల ఆయుధాన్ని మార్గమధ్యంలోనే బదాబదలు చేసింది.
పొరుగు దేశానికి, అది నిర్దేశించుకున్న లక్ష్యాలకు అడ్డుగోడగా నిలిచింది మన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యం ఒక్కటే కాదు... స్వయంసమృద్ధ భారత్ సంకల్ప సాకారంపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిబద్ధత కూడా. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న హెచ్క్యు-9, హెచ్క్యు-16 వ్యవస్థలపై పాకిస్థాన్ ఆధారపడింది. కానీ, భారత్ నుంచి నిశిత దాడులను గుర్తించడంలో అవి చతికిలపడ్డాయి. అదే సమయంలో తక్షణ, స్వయంచలిత గగనతల రక్షణ యుద్ధరీతిలో భారత్ ఆధిపత్యాన్ని ‘ఆకాష్టీర్’ నిరూపించింది.
ప్రపంచం ప్రయోగించే దేన్నయినా- పసిగట్టి... కచ్చితమైన నిర్ణయంతో... నిర్వీర్యం చేయగల సామర్థ్యాన్ని ‘ఆకాష్టీర్’ నిరూపించుకుంది.
బహుళ శక్తుల ఏకీకరణతో రూపొందిన ఈ వ్యవస్థ పొరపాటున పరస్పర కాల్పుల ముప్పును తగ్గిస్తుంది. వివాదాస్పద గగనతలంలో విమానాల రక్షణకు భరోసా ఇస్తూ శత్రు లక్ష్యాలను వేగంగా ఛేదించే వీలు కల్పిస్తుంది. ఈ మేరకు వ్యూహాత్మక నియంత్రణ రాడార్ నివేదన వ్యవస్థ, 3డి వ్యూహాత్మక నియంత్రణ రాడార్లు, దిగువస్థాయి తేలికపాటి రాడార్, ఆకాష్ ఆయుధ వ్యవస్థ రాడార్ వంటివి సెన్సర్లలో ఏకీకృతం చేయబడ్డాయి.
ఆకాష్టీర్: సాత్విక రాడార్ నుంచి చురుగ్గా తిప్పికొట్టగల శక్తి దాకా...
ఆకాష్టీర్ గుడ్డిగా తనపని చేసుకుపోయే శక్తి కాదు... ఇది బుద్ధి కుశలతతో పనిచేసే వ్యవస్థ. ఇందులోని (కంట్రోల్ రూమ్, రాడార్లు, డిఫెన్స్ గన్ వంటి) భాగస్వాములకు ఎప్పటికప్పుడు సార్వత్రిక గగనతల దృశ్యాన్ని ముందుంచుతుంది. తద్వారా గగనతల రక్షణ కార్యకలాపాల మధ్య కచ్చితమైన సమన్వయానికి తోడ్పడుతుంది. శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించి, వాటి జాడను అనుసరిస్తూ, నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించిన వ్యవస్థ ఇది. వివిధ రాడార్ వ్యవస్థలు, సెన్సర్లు, కమ్యూనికేషన్ సాంకేతికతలను ఇది ఒకే కార్యనిర్వహణ చట్రంలో ఇముడుస్తుంది. అనేక వనరుల ద్వారా సమాచారం సేకరించి, విశ్లేషించి స్వయంచలిత, తక్షణ దాడి నిర్ణయాలకు ‘ఆకాష్టీర్’ వెసులుబాటు కల్పిస్తుంది. ఇది విస్తృత “సి4ఐఎస్ఆర్” (కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ అండ్ రికనైసెన్స్) చట్రంలో భాగం. అంతేకాదు... ఇతర వ్యవస్థలతో సమన్వయం చేసుకోవడమేగాక ఇది వాహనాధారిత సంచార వ్యవస్థ కాబట్టి, ప్రతికూల వాతావరణంలోనూ పరిస్థితులను నిభాయించగలదు.
క్షేత్రస్థాయి రాడార్లు, మానవ నిర్ణయాధారిత సంప్రదాయ గగనతల రక్షణ ఉపకరణాల తరహాలో కాకుండా యుద్ధ క్షేత్రంలో దిగువ స్థాయి గగనతల ప్రదేశంలో స్వయంచలిత పర్యవేక్షణ, క్షేత్రస్థాయి గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థల సమర్థ నియంత్రణకు ఆకాష్టీర్ వీలు కల్పిస్తుంది. సాత్విక రక్షణ నుంచి చురుగ్గా తిప్పికొట్టగల శక్తివైపు భారత వ్యూహాత్మక సూత్రంలో విస్పష్ట పరిణామానికి ఇది సూచిక. దీన్ని విస్తృత “సి4ఐఎస్ఆర్” వ్యవస్థతో కచ్చితంగా ఏకీకృతం చేయడం వల్ల సైన్యం, నావికాదళం, వైమానిక దళాలు అద్భుత సమన్వయంతో వ్యవహరించగలవు.
భారత ఏకీకృత గగనతల రక్షణ నెట్వర్క్: అత్యంత ప్రభావశీల నిశ్శబ్ద శక్తి
ఆకాష్టీర్ భారత సైనిక గగనతల (ఎఎడి) వ్యవస్థలో కీలక భాగం. ఇది ‘ఐఎసిసిఎస్’ (వైమానిక దళం), ‘త్రిగుణ్’ (నావికాదళం) వ్యవస్థలతో కచ్చితంగా అనుసంధానితమైంది. యుద్ధక్షేత్రం సుస్పష్ట, తక్షణ దృశ్యాన్ని ఇది ఆవిష్కరిస్తుంది. తద్వారా ఎదురుదాడికే కాకుండా స్వీయ రక్షణ దిశగా ఆయుధాల సత్వర, సమర్థ ప్రయోగానికి వీలు కల్పిస్తుంది.
త్రివిధ దళాలు ‘ఆకాష్టీర్’ను సంయుక్తంగా వినియోగిస్తున్న కారణంగా అవాంఛిత పరస్పర కాల్పుల ప్రమాదం కనిష్ఠ స్థాయికి పరిమితం. పరిస్థితులపై మెరుగైన అవగాహన కల్పిస్తుంది కాబట్టి, నిర్దిష్ట-శక్తిమంతమైన కార్యాచరణకు వీలుంటుంది. వాహనంపై అమర్చిన, సంచార వ్యవస్థగనుక ప్రత్యక్ష యుద్ధ, ప్రమాదకర ప్రాంతాల్లో మోహరించడానికి అనువైనది.
స్వదేశీ సానుకూలత
ఆకాష్టీర్ ఒంటరి శక్తి కాదు.... భారత యుద్ధ విధాన సామర్థ్యాలను పునర్నిర్మిస్తున్న స్వదేశీ రక్షణ వేదికల రూపకల్పనావరణంలో ఇదొక భాగం. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం రక్షణ రంగ వృద్ధికి దోహదం చేసింది. ఆ మేరకు “ధనుష్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, మెయిన్ బాటిల్ ట్యాంక్ అర్జున్, లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్, హై మొబిలిటీ వెహికల్స్, లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్, వెపన్ లొకేటింగ్ రాడార్, 3డి టాక్టికల్ కంట్రోల్ రాడార్, సాఫ్ట్ వేర్ డిఫైన్డ్ రేడియో, డిస్ట్రాయర్లు, స్వదేశీ విమాన వాహకాలు, జలాంతర్గాములు, యుద్ధనౌకలు, కార్వెట్లు, ఫాస్ట్ పట్రోల్ వెసెల్స్, ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, ఆఫ్షోర్ పట్రోల్ వెసెల్స్ వంటి నావికాదళ ఆయుధ సంపత్తి సహా అధునాతన సైనిక వేదికల రూపకల్పన సాధ్యమైంది.
· రక్షణ రంగ ఉత్పత్తి సామర్థ్యం 2029కల్లా రూ.3 లక్షల కోట్లకు చేరాలన్నది భారత్ లక్ష్యం. తద్వారా ప్రపంచ రక్షణ తయారీ కూడలిగా తన స్థానం పటిష్ఠం చేసుకోనుంది.
· ఈ లక్ష్యసాధనలో ప్రైవేట్ రంగానిదే కీలక పాత్ర. ఈ మేరకు మొత్తం రక్షణ ఉత్పత్తిలో 21 శాతం వాటాతో ఆవిష్కరణలు సహా సామర్థ్యాన్ని పెంచుతుంది.
· స్వదేశీ ఉత్పాదక సామర్థ్యం పెంపులో 16 ‘డిపిఎస్యు’లు, 430కిపైగా లైసెన్స్ పొందిన కంపెనీలు, సుమారు 16,000 ‘ఎంఎస్ఎంఇ”లు వంటి బలమైన రక్షణ పారిశ్రామిక కూడలిగా రూపొందుతుంది.
· ఇప్పుడు రక్షణ పరికరాల్లో 65 శాతం దేశీయంగా తయారవుతున్నాయి. లోగడ 65 నుంచి 70 శాతం దిగుమతులపై ఆధారపడే పరిస్థితి ఉండగా, నేడు గణనీయ మార్పుతో భారత రక్షణ రంగం స్వయంసమృద్ధిని ప్రతిబింబిస్తోంది.
ఆకాష్టీర్: ఓ వ్యవస్థకు అతీతం... ప్రపంచానికి ఒక సందేశం
ఆకాష్టీర్ను “యుద్ధ వ్యూహంలో వినూత్న మలుపు”గా ప్రపంచవ్యాప్త నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ వ్యవస్థను రూపొందించడం ద్వారా పూర్తి సమీకృత, స్వయంచలిత, గగనతల నియంత్రణ-నిర్వహణ సామర్థ్యంగల దేశాల విశిష్ట జాబితాకెక్కింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది... రెప్పపాటులో ముప్పును పసిగట్టడమే కాదు... తక్షణ నిర్ణయంతో మెరుపుదాడి చేయగల సామర్థ్యం దీని సొంతం.
‘ఆకాష్టీర్’ కేవలం ఒక సాంకేతిక అద్భుతం మాత్రమే కాదు... పొంతనలేని యుద్ధరీతి, మిశ్రమ ముప్పులు, సరిహద్దు ఉగ్రవాదం తదితరాలకు తిరుగులేని జవాబు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ దాడులను నిర్వీర్యం చేయడంలో భారత్ దీన్ని విజయవంతంగా వినియోగించింది. దిగుమతి చేసుకున్న వేదికలపై కాకుండా, స్వయంసమృద్ధి సంకల్ప సాకారానికి దోహదపడే స్వీయ ఆవిష్కరణలపైనే భారత రక్షణ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఇది రుజువు చేసింది.
***
(Release ID: 2129301)
|