జాతీయ మానవ హక్కుల కమిషన్
‘మానవ హక్కులపై చిన్న చిత్రాల 11వ వార్షిక పోటీ’కి ఎంట్రీలను ఆహ్వానించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
* భారతీయ పౌరుల కోసం ఆన్‌లైన్ ఎంట్రీలు తెరుచుకున్నాయి: ఆఖరు తేదీ 2025 ఆగస్టు 31
* సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ హక్కులపై ఆధారపడి ఉండనున్న ఇతివృత్తాలు
* చిత్రాలు ఆంగ్లంలో గాని, లేదా భారతీయ భాషలు వేటిలోనైనా గాని రూపొందించినవై ఉండాలి... ఆ చిత్రాలకు ఇంగ్లిషు సబ్‌టైటిల్స్‌ను ఉంచాలి
* ఎంట్రీలను గూగల్ డ్రైవ్‌ను ఉపయోగించి nhrcshortfilm@gmail.com కు పంపాలి
Posted On:
14 MAY 2025 4:56PM by PIB Hyderabad
మానవ హక్కులపై చిన్న చిత్రాల (షార్ట్ ఫిలింస్) 11వ వార్షిక పోటీకి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తెలిపింది. ఎంట్రీలను అందుకోవడానికి ఆఖరి తేదీ 2025 ఆగస్టు 31. గెలుపొందిన ఎంట్రీలకు పురస్కారాలను ఇస్తారు.
షార్ట్ ఫిలిం అవార్డుల పథకాన్ని జాతీయ మానవ హక్కుల సంఘం 2015లో మొదలుపెట్టింది. మానవ హక్కులను ప్రోత్సహించడంతోపాటు వాటి సంరక్షణ కోసం భారతీయ పౌరులు సినిమా మాధ్యమం ద్వారా చేసే ప్రయత్నాలతోపాటు వారే ఇతరత్రా చేసే సృజనాత్మక ప్రయత్నాలనూ ప్రోత్సహించి, ఆ ప్రయత్నాలకు గుర్తింపును ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం. ఈ క్రమంలో వారి వయస్సు ఎంత ఉందనే దానితో పనిలేదు. వెనుకటి పోటీలలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బ్రహ్మాండమైన స్పందన వ్యక్తమైంది.
చిన్న చిత్రాలను ఇంగ్లిషులో గాని, లేదా భారతీయ భాష దేనిలోనైనా గాని రూపొందించవచ్చు... అయితే వాటికి ఇంగ్లిషులో సబ్‌టైటిల్స్‌ను ఉంచాలి. చిన్న చిత్రం కనీసం 3 నిమిషాల వ్యవధితోనూ, గరిష్ఠంగా 10 నిమిషాల వరకు ఉండాలి.
చిత్రాలు డాక్యుమెంటరీ, నాటకీయతను జోడించిన వాస్తవిక కథలు, లేదా కదిలే బొమ్మల కళ (యానిమేషన్)సహా ఏదైనా టెక్నికల్ ఫార్మేట్‌లో రూపొందించిన కల్పిత కథ కావచ్చు... అయితే ఆ చిత్రాలు కింద ప్రస్తావించిన ఇతివృత్తాలపై ఆధారపడిన వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ హక్కులకు చెందినవై ఉండాలి...:
• జీవించేందుకు, స్వతంత్రంగా ఉండేందుకు, ఆత్మగౌరవంతో మనగలిగేందుకు ఉన్న హక్కు
• వెట్టి చాకిరీ, బాల కార్మికులు, మహిళలు, బాలల హక్కులతో ముడిపడ్డ ప్రత్యేక అంశాలు
• వయోవృద్ధులకు ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో వారికున్న హక్కులు
• దివ్యాంగజనుల హక్కులు
• మాన్యువల్ స్కావెంజింగు, ఆరోగ్యసంరక్షణ హక్కు
• మౌలిక స్వేచ్ఛలకు సంబంధించిన అంశాలు
• చట్ట విరుద్ధంగా మనుషుల తరలింపు
• గృహ సంబంధ హింస
• పోలీసు దురాగతాల కారణంగా మానవ హక్కుల అతిక్రమణలు చోటుచేసుకోవడం
• కస్టడీలో హింస, చిత్రహింసలు
• సామాజిక, ఆర్థిక అసమానతలు
• సంచార జాతుల, డినోటిఫైడ్ తెగల హక్కులు
• జైలు సంస్కరణలు
• చదువుకొనేందుకు హక్కు
• భూ గ్రహం మీద జీవనాన్ని ప్రభావితం చేసే పర్యావరణ సంబంధిత ముప్పులు సహా స్వచ్ఛ పర్యావరణాన్ని పొందేందుకు ఉన్న హక్కు
• పని చేయడానికి సంబంధించిన హక్కు
• చట్టం దృష్టిలో అందరి సమానత్వానికీ సంబంధించిన హక్కు
• ఆహారం, పోషణ భద్రతలకు సంబంధించిన హక్కు
• ఎల్‌జీబీటీక్యూఐప్లస్ వర్గానికి చెందిన వారి హక్కులు
• మనుషులతో లేదా ప్రకృతి వైపరీత్యం కారణంగా నిరాశ్రయానికి లోనైనందువల్ల మానవ హక్కుల ఉల్లంఘన సంభవించడం
• భారతదేశ భిన్నత్వంలో మానవ హక్కులనూ, విలువలనూ పండుగ చేసుకోవడం
• జీవనాన్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అభివృద్ధి సంబంధిత కార్యక్రమాలు మొదలైనవి.
పోటీలో పాలుపంచుకోవడానికి ఏ వ్యక్తి అయినా పంపగల ఎంట్రీల సంఖ్యకు ఒక పరిమితి గాని లేదా ఎలాంటి అడ్డంకి గాని లేదు. ఏమైనా, పోటీలో పాల్గొనేవారు ప్రతి ఒక్క ఫిలింను అన్ని వివరాలను పేర్కొన్న ఎంట్రీ ఫారంతో విడిగా పంపించాల్సి ఉంటుంది. ఎంట్రీ ఫారంతోపాటు నియమ నిబంధనలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెబ్‌సైట్ www.nhrc.nic.in నుంచి గాని లేదా Click here లింకులో నుంచి గాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫిలింను, అన్ని వివరాలను పేర్కొన్న ఎంట్రీఫారంను, అవసరపడే ఇతర దస్తావేజులను గూగల్ డ్రైవ్‌ను ఉపయోగించి nhrcshortfilm[at]gmail[dot]com కు పంపించవచ్చు. ఏవైనా ప్రశ్నలుంటే ఇదే ఈమెయిల్ చిరునామాకు పంపవచ్చు.
NHRC's Short Film Competition-2025-Terms & Conditions and Application Form (ఎన్‌హెచ్‌ఆర్‌సీ చిన్న చిత్రాల పోటీ-2025 నియమ నిబంధనలు, దరఖాస్తు ఫారం)
***
(Release ID: 2128831)