బొగ్గు మంత్రిత్వ శాఖ
విద్యుత్ రంగానికి బొగ్గు కేటాయింపు కోసం సవరించిన శక్తి (భారత్‌లో పారదర్శకంగా బొగ్గు వినియోగం, కేటాయింపు పథకం) విధానానికి మంత్రివర్గం ఆమోదం
Posted On:
07 MAY 2025 12:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ- కేంద్ర ప్రభుత్వ రంగ/ రాష్ట్ర ప్రభుత్వ రంగ/ స్వతంత్ర విద్యుదుత్పత్తిదారులకు చెందిన థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తాజాగా బొగ్గు కేటాయింపులకు (కోల్ లింకేజీలు) ఆమోదం తెలిపింది. సవరించిన శక్తి విధానం కింద ఈ రెండు విండోలను ప్రతిపాదించారు:
కేంద్ర జెన్‌కోలు/రాష్ట్రాలకు ప్రకటిత ధరలకే బొగ్గు సరఫరా ఏర్పాట్లు: విండో –I
నోటిఫైడ్ ధర కన్నా ఎక్కువ ప్రీమియంతో అన్ని జెన్‌కోలకు బొగ్గు సరఫరా ఏర్పాట్లు: విండో –II
విండో – I (ప్రకటించిన ధరకే బొగ్గు):
జాయింట్ వెంచర్లు, వాటి అనుబంధ సంస్థలు సహా కేంద్ర రంగంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయింపు (కోల్ లింకేజీ) కోసం ప్రస్తుతమున్న విధానం కొనసాగుతుంది.
విద్యుత్ మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు, రాష్ట్రాల బృందం ద్వారా ఏర్పడిన ఏజెన్సీకి ప్రస్తుత విధానం ప్రకారం బొగ్గు సరఫరాను కేటాయించాలి. రాష్ట్రాలకు కేటాయించిన బొగ్గు లింకేజీని రాష్ట్రాలు తమ సొంత జెన్ కోలో వినియోగించుకోవచ్చు. టారిఫ్ ఆధారిత పోటీ వేలం (టీబీసీబీ) ద్వారా స్వతంత్ర విద్యుదుత్పత్తిదారులను (ఐపీపీ) గుర్తించాలి. లేదా కొత్త విస్తరణ యూనిట్ ఏర్పాటు కోసం విద్యుత్ చట్టం- 2003లోని సెక్షన్ 62 కింద విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఉన్న ప్రస్తుత స్వతంత్ర విద్యుదుత్పత్తి దారులను గుర్తించాలి.
విండో -II (ప్రకటిత ధర కన్నా ఎక్కువ ప్రీమియం):
పీపీఏ ఉన్న ఏదైనా దేశీయ బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిదారు లేదా విడి, దిగుమతి చేసుకున్న (వాటికి అవసరమైతే) బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు నోటిఫై చేసిన ధర కన్నా ఎక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా 12 నెలల వరకు లేదా అంతకన్నా ఎక్కువ కాలం (25 సంవత్సరాల వరకు) వేలం ప్రాతిపదికన బొగ్గును పొందవచ్చు. ఇది విద్యుత్ ప్లాంట్లు తమకు నచ్చిన విధంగా విద్యుత్‌ను విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
అమలు వ్యూహం:
పై నిర్ణయాల అమలు కోసం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)/ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతేకాకుండా సంబంధిత విభాగాలు / ఆధీకృత సంస్థలు, నియంత్రణ కమిషన్లకు తెలియజేసేలా, సవరించిన శక్తి విధానంపై సంబంధిత మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాలకు కూడా సమాచారాన్ని అందించాలి.
ఉపాధి కల్పన సామర్థ్యం, ఇతర ముఖ్య ప్రభావాలు:
లింకేజీ ప్రక్రియ సరళీకరణ: శక్తి విధానానికి సవరణల ద్వారా, బొగ్గు కేటాయింపు కోసం ప్రస్తుతమున్న ఎనిమిది పేరాలను సులభతర వాణిజ్యం స్ఫూర్తితో కేవలం రెండు విండోలకు కుదించారు. విండో-I (ప్రకటించిన ధరలకు బొగ్గు కేటాయింపు), విండో-II (ప్రకటించిన ధర కన్నా ఎక్కువ ప్రీమియం ధరకు బొగ్గు కేటాయింపు).
విద్యుత్ రంగంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను తీర్చడం: విద్యుత్ ప్లాంట్లు తమ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక డిమాండును బట్టి బొగ్గు అవసరాలను తీర్చుకునేలా ప్రణాళికలు వేసుకోవడానికి సవరించిన శక్తి విధానం వీలు కల్పిస్తుంది.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ రంగ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు నామినేషన్ ప్రాతిపదికన బొగ్గు కేటాయింపు కొనసాగుతుంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ సిఫారసు మేరకు నామినేషన్ ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయించిన లింకేజీలను రాష్ట్రాలు తమ ఉత్పత్తి సంస్థల్లో ఉపయోగించుకోవచ్చు.
విండో-2లో పీపీఏ అవసరం లేదు: విండో-2 కింద సేకరించిన బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును విక్రయించేందుకు పీపీఏ అవసరాన్ని పూర్తిగా తొలగించారు. తద్వారా విద్యుత్ ప్లాంట్లు తమకు నచ్చిన విధంగా విద్యుత్‌ను విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు.
స్వతంత్ర విద్యుదుత్పత్తిదారులు/ ప్రైవేటు డెవలపర్లకు థర్మల్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని కల్పించడం: 12 నెలల నుంచి 25 సంవత్సరాల వరకు కాలపరిమితితో పీపీఏతో లేదా పీపీఏ లేకుండా.. సామర్థ్యాన్ని పెంచుకునేలా అనువైన లింకేజీకి అవకాశం కల్పించారు. కొత్తగా థర్మల్ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి స్వతంత్ర విద్యుదుత్పత్తి సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఇది భవిష్యత్తులో థర్మల్ సామర్థ్యాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది.
బొగ్గు దిగుమతుల తగ్గింపు/ప్రత్యామ్నాయాలకు ప్రోత్సాహం: దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత ప్లాంట్లు వాటి సాంకేతిక పరిమితులకు లోబడి విండో-II కింద దేశీయంగా బొగ్గును సేకరించుకోగలవు. తద్వారా అవి దిగుమతిపై ఆధారపడడం తగ్గుతుంది. దిగుమతి బొగ్గు ప్రత్యామ్నాయం వల్ల కలిగే ప్రయోజనాలను తగిన నియంత్రణ కమిషన్ నిర్ణయించి, విద్యుత్ వినియోగదారులు/లబ్ధిదారులకు అందిస్తుంది.
'పిట్ హెడ్' విద్యుత్ ప్లాంట్లకు ప్రాధాన్యం: సవరించిన శక్తి విధానం ప్రస్తుత ప్లాంట్ల విస్తరణకు దోహదపడడంతోపాటు ప్రధానంగా పిట్ హెడ్ ప్రాంతాల్లో, అంటే బొగ్గు గనుల ప్రాంతాలకు సమీపంలో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది.
సరఫరా హేతుబద్ధీకరణ: థర్మల్ విద్యుత్ ప్లాంటుకు బొగ్గుకు సంబంధించిన ‘పూర్తి వ్యయాన్ని (ల్యాండెడ్ కాస్ట్)’ తగ్గించే లక్ష్యంతో.. బొగ్గు వనరుల హేతుబద్ధీకరణ చేపడతారు. ఇది రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, అంతిమంగా విద్యుత్ వినియోగదారులకు సుంకాలనూ తగ్గిస్తుంది.
అధికారిక ప్రాతినిధ్యం: విధానంలో సంబంధిత మంత్రిత్వ శాఖల (బొగ్గు, విద్యుత్ శాఖలు) స్థాయిలో స్వల్ప మార్పులకు వీలుగా అధికారాల బదలాయింపు కోసం సవరించిన శక్తి విధానం వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా నిర్వహణ/ అమలు అంశాలకు సంబంధించి విద్యుత్, బొగ్గు శాఖల కార్యదర్శులు, సీఈఏ చైర్‌పర్సన్లతో కూడిన ఓ ‘సాధికారిక కమిటీ’ని ఇది ప్రతిపాదించింది.
ప్రస్తుత ఇంధన సరఫరా ఒప్పందాలకు (ఎఫ్ఎస్ఏ) వెసులుబాటు: విండో-2 కింద బొగ్గు వార్షిక ఒప్పంద పరిమాణం (ఏసీక్యూ)లో 100 శాతానికి మించి ప్రస్తుత ఇంధన సరఫరా ఒప్పందాలున్న సంస్థలు భాగస్వామ్యం వహించడం ద్వారా విద్యుదుత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుంది. పాత విధానాల కింద పొందిన బొగ్గు కేటాయింపుల గడువు ముగిసిన తర్వాత.. విద్యుదుత్పత్తిదారులు (కేంద్ర జెన్ కోలు, రాష్ట్ర జెన్ కోలు, స్వతంత్ర విద్యుదుత్పత్తిదారులు) ప్రస్తుత ప్రతిపాదిత సవరించిన విధానం కింద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యుత్ మార్కెట్లలో మిగులుకు అవకాశం: కేటాయించిన బొగ్గు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తును విద్యుత్ మార్కెట్లలో విక్రయించడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇది విద్యుత్ ఎక్స్ఛేంజీలలో విద్యుత్ లభ్యతను పెంచడం ద్వారా మార్కెట్లను బలోపేతం చేయడం మాత్రమే కాకుండా, ఉత్పత్తి కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా చేస్తుంది.
వ్యయం:
సవరించిన ‘శక్తి’ విధానం వల్ల బొగ్గు కంపెనీలకు ఎలాంటి అదనపు వ్యయాలూ ఉండవు.
లబ్ధిదారులు:
థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, రైల్వేలు, కోల్ ఇండియా లిమిటెడ్ / సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, తుది వినియోగదారులు, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయోజనం కలుగుతుంది.
నేపథ్యం:
2017లో శక్తి విధానాన్ని ప్రవేశపెట్టడంతో.. నామినేషన్ ఆధారితంగా నడిచే వ్యవస్థ నుంచి వేలం/ టారిఫ్ ఆధారిత బిడ్డింగ్ ద్వారా మరింత పారదర్శక విధానం దిశగా బొగ్గు కేటాయింపులో సమూలమైన మార్పు వచ్చింది. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ ప్లాంట్లకు మాత్రమే నామినేషన్ ఆధారిత కేటాయింపులు కొనసాగాయి. మంత్రుల బృందం సిఫార్సుల మేరకు 2019లో శక్తి విధానాన్ని సవరించారు. 2023లో దీనిని మరింత సవరించారు. అర్హత ప్రమాణాలకు లోబడి వివిధ కేటగిరీల విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు లింకేజీని కేటాయించడానికి శక్తి విధానంలో అనేక పేరాలు ఉన్నాయి. శక్తి విధానానికి సవరణలతో.. బొగ్గు కేటాయింపు కోసం అందులో ఉన్న ఎనిమిది పేరాలను సులభతర వాణిజ్య స్ఫూర్తితో రెండు విండోలకే పరిమితం చేశారు.
***
(Release ID: 2127625)
Visitor Counter : 6