గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాన్ ఫెర్రస్ మెటల్ పునర్వినియోగ వ్యవస్థను బలోపేతం చేయడానికి వెబ్ సైట్, వాటాదారుల పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

Posted On: 07 MAY 2025 5:56PM by PIB Hyderabad

నాన్ ఫెర్రస్ లోహాల పునర్వినియోగ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక వెబ్ సైట్ ను,  వాటాదారుల పోర్టల్ - https://nfmrecycling.jnarddc.gov.in ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ  మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.  బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే,  గనుల మంత్రిత్వ శాఖకు, జెఎన్ఎఆర్డిడిసికి చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు. భారతదేశంలో నిర్మాణాత్మక, పారదర్శక, స్థిరమైన రీసైక్లింగ్ వ్యవస్థను ప్రోత్సహించడం ఈ చొరవ లక్ష్యం.

జాతీయ నాన్ ఫెర్రస్ లోహాల స్క్రాప్ పునర్వినియోగ మార్గదర్శకాల్లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్ ను ముఖ్యమైన భాగస్వాములను ఒకేచోటకు తెచ్చేందుకు, డేటా పారదర్శకతను మెరుగుపరచేందుకు, అల్యూమినియం, రాగి, సీసం, జింక్ తదితర కీలక మూలకాల పునర్వినియోగంలో ఆధారాలతో కూడిన విధానాలు రూపొందించేందుకు మద్దతుగా రూపొందించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “భారతదేశం తన వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే ఆర్ధిక వ్యవస్థ (సర్క్యులర్ ఎకానమీ) ను నిర్మించేందుకు కట్టుబడి ఉంది. ఈ పోర్టల్‌ వల్ల పునర్వినియోగ రంగంపై తక్షణ సమాచారాన్ని అందించడమే కాకుండా, భాగస్వాములు అందరూ అవగాహనతో నిర్ణయాలు తీసుకునేందుకు, లోపాలను అధిగమించేందుకు, నాన్ ఫెర్రస్ లోహాల రంగంలోని పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు శక్తినిస్తుంది” అన్నారు.

సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబే ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ,  “ఈ పోర్టల్ పునర్వినియోగ విలువ వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ, పారదర్శకత, డేటాపరమైన విధాన మద్దతు ద్వారా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలోనూ అత్యంత అవసరమైన ముందడుగు” అన్నారు.

ఈ వెబ్‌సైట్ పునర్వినియోగదారులు, తొలగించేవారు, సేకరణదారులు, పారిశ్రామిక సంఘాలు, పరిశోధనా సంస్థలతో సమాచారం పంపిణీ, అవగాహన పెంపు, భాగస్వామ్యాన్ని కల్పించే జాతీయ వేదికగా పని చేస్తుంది. ఇది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రదర్శించడమే కాకుండా, స్టేక్‌హోల్డర్ల సమావేశాలు, విధాన పరిణామాలపై నవీకరణలను అందిస్తుంది. అలాగే జాతీయ గణాంకాలు, ప్రమాణాలు మౌలిక సదుపాయాల సంబంధిత విజయాలను అందుబాటులోకి తీసుకువస్తుంది.

ఈ సమగ్ర పోర్టల్ ద్వారా పరిశ్రమల భాగస్వాముల నమోదుతో పాటు, మౌలిక పదార్థాల వినియోగం, పునర్వినియోగ సామర్థ్యం, సాంకేతిక వినియోగం, కార్మికుల ధోరణులపై కీలక డేటా సేకరణ కూడా సాధ్యమవుతుంది. ఇవి పరిశోధన, అభివృద్ధి,  మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి వంటి భవిష్యత్ చర్యలకు మద్దతు ఇస్తాయి.

ప్రధానాంశాలు

విడగొట్టే కేంద్రాలు, పునర్వినియోగదారులు, వ్యాపారులు,  సేకరణ కేంద్రాల కోసం జాతీయ రిజిస్ట్రీ

మౌలిక పదార్థాల సరఫరా, ఉత్పత్తి రకాలూ, సాంకేతిక స్వీకరణ,కార్మిక సంబంధిత డేటాను ట్రాక్ చేయడానికి సాధనాలు

పనితీరు పరంగా సరిపోల్చే (బెంచ్‌మార్కింగ్) యంత్రాంగాలు

ప్రాంతీయ, రంగాలవారీగా మౌలిక సదుపాయాలు,  నైపుణ్య అంతరాల గుర్తింపు

ప్రమాణాలు, ధ్రువీకరణ వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాల అభివృద్ధికి మద్దతు

ఈ కార్యక్రమం భారతదేశ నాన్ ఫెర్రస్ లోహాల పునర్వినియోగ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. దీనిని వనరులను తిరిగి వినియోగించే ఆర్ధిక వ్యవస్థ, సుస్థిరత, వనరుల సమర్థ వినియోగం అనే జాతీయ దృష్టికోణానికి అనుగుణంగా రూపొందించారు. 

 

***


(Release ID: 2127619)
Read this release in: Tamil , English , Urdu , Hindi