రక్షణ మంత్రిత్వ శాఖ
స్క్రామ్ జెట్ ఇంజిన్ అభివృద్ధిలో కీలక మైలురాయిని సాధించిన డీఆర్డీవో
1,000 సెకన్లకు పైగా యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ నిర్వహణ
Posted On:
25 APR 2025 8:30PM by PIB Hyderabad
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్డీఎల్) హైపర్సోనిక్ ఆయుధ సాంకేతిక రంగంలో కీలకమైన మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన అత్యాధునిక స్క్రామ్‌జెట్ కనెక్ట్ టెస్ట్ కేంద్రంలో డీఆర్డీఎల్ 1,000 సెకన్లకు పైగా దీర్ఘకాలిక యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ సబ్‌స్కేల్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ ను ఏప్రిల్ 25న నిర్వహించింది. ఈ ఏడాది జనవరిలో 120 సెకన్ల పాటు నిర్వహించిన పరీక్షకు కొనసాగింపుగా ఈ గ్రౌండ్ టెస్టును నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో, ఈ వ్యవస్థ.. పూర్తి స్థాయి వైమానిక వినియోగయోగ్యమైన దహన యంత్ర పరీక్షకు త్వరలోనే సిద్ధం కానుంది.
హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ధ్వని వేగం కన్నా అయిదు రెట్లు ఎక్కువ వేగంతో (> 6100 గంటకు కి.మీ.) ఎక్కువ సమయం ప్రయాణించగల ఆయుధాల కోవకు చెందినది. దహన ప్రక్రియ కోసం గాలిని వినియోగించుకునే ఇంజిన్లతో (ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్లు) ఇది పనిచేస్తుంది. సూపర్‌సోనిక్ దహన సామర్థ్యం కలిగిన ఎయిర్ బ్రీతింగ్ చోదక వ్యవస్థలు క్రూయిజ్ దీర్ఘకాలం సాగడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక స్క్రామ్‌జెట్ దహన యంత్రం రూపకల్పన, అలాగే పరీక్ష కేంద్ర సమర్థతను ఈ పరీక్ష ధ్రువీకరించింది. పరిశ్రమలు, విద్యాసంస్థలుతోపాటు డీఆర్డీవో ప్రయోగశాలల సమష్టి కృషికి ఫలితమిది. దేశ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమానికి బలమైన పునాదిగా ఇది నిలుస్తుంది.
విశేషమైన విజయాన్ని సాధించిన డీఆర్డీవో, పారిశ్రామిక భాగస్వాములు, విద్యాసంస్థలను రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. దేశం కోసం కీలకమైన హైపర్‌సోనిక్ ఆయుధ సాంకేతికతలను సాకారం చేయడంలో ప్రభుత్వ బలమైన నిబద్ధతకు నిదర్శనంగా ఈ విజయాన్ని ఆయన అభివర్ణించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 1,000 సెకన్లకు పైగా సూపర్‌సోనిక్ దహన ప్రక్రియను ప్రదర్శించినందుకుగాను డైరెక్టర్ జనరల్ (క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థలు) శ్రీ యు. రాజా బాబు, డీఆర్డీఎల్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎ. శ్రీనివాస మూర్తి, బృంద సభ్యులందరికీ రక్షణ పరిశోధన- అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 2124453)
Visitor Counter : 27