పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ విమానాశ్రయ రన్‌వే అభివృద్ధి పనులను సమీక్షించిన పౌర విమానయాన మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు
* ఢిల్లీ విమానాశ్రయంలో కార్యకలాపాల నిర్వహణ సాఫీగా సాగేటట్లు చూడడానికి అధికారులతో సమావేశం
Posted On:
21 APR 2025 8:45PM by PIB Hyderabad
ఢిల్లీ విమానాశ్రయంలోని 10/28 రన్‌వేలో అభివృద్ధి పనులతోపాటు ఊహించని విధంగా పశ్చిమ దిక్కు నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల నిర్వహణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు ఈ రోజు సంబంధిత వర్గాలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్‌లున్‌మంగ్ వుల్‌నామ్, భారతీయ విమానాశ్రయాల ప్రాధికరణ సంస్థ (ఏఏఐ) ఛైర్మన్ శ్రీ విపిన్ కుమార్, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ ఫైజ్ అహ్మద్ కిద్వాయి, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డీఐఏఎల్) ప్రతినిధులు, అన్ని విమాన సంస్థలతోపాటు సీఐఎస్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుత స్థితిగతులను మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రయాణికులతోపాటు విమాన సంస్థల కార్యకలాపాల్లో అంతరాయాలు కనీస స్థాయికి పరిమితమయ్యేటట్లుగా జాగ్రత్త చర్యలను తీసుకోవడానికి ప్రాముఖ్యాన్నివ్వాలని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో నిర్వహణ సాఫీగా సాగడం అత్యంత ముఖ్యమని చెబుతూ, ఆసక్తిదారులంతా సవాళ్లను దీటుగా ఎదుర్కొని వాటిని పరిష్కరించడానికి కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. రన్‌వే స్థాయిని పెంచే పనులను, వాతావరణ సంబంధిత సమాచారం ఆధారంగా అననుకూల పరిస్థితులు ఎదురవుతాయని తెలిస్తే వాటిని దృష్టిలో పెట్టుకొని తగిన విస్తృత ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలని శ్రీ రామ్ మోహన్నాయుడు పునరుద్ఘాటించారు. వాతావరణానికి సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తదనుగుణంగా సకాలంలో ముందస్తు చర్యలను చేపట్టి, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఆసక్తిదారులకు ఆయన కచ్చితమైన ఆదేశాలిచ్చారు.
సిబ్బంది సన్నద్ధత అంశంపై మంత్రి మాట్లాడుతూ, సంబంధిత వర్గాల మధ్య మరింత సమన్వయాన్ని ఏర్పరుచుకోవాలని, అలా సన్నద్ధమైతే అనుకోని విధంగా తలెత్తే సవాళ్ల విషయంలో సైతం దీటుగా ప్రతిస్పందించవచ్చన్నారు. 4 రన్‌వేలలో ఒక రన్‌వే స్థాయిని పెంచే పనులు ప్రస్తుతం కొనసాగుతున్న కారణంగా, ఈ తరహా సమన్వయం వల్ల విమానాశ్రయ కార్యకలాపాలు సవ్యంగా సాగిపోగలవన్నారు. ఈ కీలక సమయంలో నిర్వహణ సామర్థ్యం ఎంతమాత్రం తగ్గకుండా చూడడానికి భారతీయ విమానాశ్రయాల ప్రాధికరణ సంస్థతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) బృందాలను వాటి నైపుణ్యభరిత సేవలను సమకూర్చాల్సిందిగా ఆ సంస్థల సాయాన్ని కోరాలన్నారు.
అన్ని విభాగాలు సమష్టిగా తమ సామర్థ్యాలను వినియోగిస్తాయన్న విశ్వాసాన్ని శ్రీ రామ్ మోహన్ నాయుడు వ్యక్తం చేశారు. ‘‘కలిసికట్టుగా ప్రనయత్నించడం, చక్కని సమన్వయాన్ని సాధించడం ద్వారా ఢిల్లీ విమానాశ్రయం ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతులను అందించగలదని నేను నమ్ముతున్నాన’’ని ఆయన అన్నారు.
అభివృద్ధి పనులు పురోగమిస్తున్నందున ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడానికి వారికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు వారికి తెలియజేయడానికి పెద్దపీట వేయాలని సమావేశంలో స్పష్టంచేశారు. ఇటు ప్రయాణికులకు, అటు విమానసంస్థల షెడ్యూలుకు పెద్దగా అవాంతరాలు తలెత్తకుండా చూసుకొంటూనే, రన్‌వే అభివృద్ధి పనులు నిర్దిష్ట కాలంలోపల పూర్తి అయ్యేటట్లు శ్రద్ధ తీసుకోవాలన్న సూచనతో చర్చను ముగించారు.
ప్రయాణికుల సౌకర్యానికి, నిర్వహణ సామర్థ్యానికి.. ఈ రెండిటికీ సమప్రాధాన్యాన్ని కట్టబెడుతూ, భారత్ విమానయాన రంగంలో శ్రేష్ఠత్వ ప్రమాణాలను పరిరక్షించడానికి విమానయాన మంత్రిత్వ శాఖ సదా కట్టుబడి ఉంటుంది.
***
(Release ID: 2123641)
Visitor Counter : 7