రక్షణ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ‘టైగర్ ట్రయంఫ్-2025’ కసరత్తు విశిష్ట సందర్శక దినోత్సవం నిర్వహణతో సమాప్తం
Posted On:
12 APR 2025 9:30AM by PIB Hyderabad
‘మానవతా సాయం-విపత్తు ఉపశమన చర్యల’ (హెచ్‌ఏడీఆర్)పై భారత్-అమెరికా ద్వైపాక్షిక త్రివిధ దళాల నాలుగో దఫా భూ-జల సైనిక కసరత్తు “టైగర్ ట్రయంఫ్-2025” ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఈ నెల 11న విశిష్ట సందర్శకుల దినోత్సవం (డీవీ డే) నిర్వహణతో సమాప్తమైంది.
తమిళనాడు-పుదుచ్చేరి నేవల్ ఏరియా కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్, అమెరికా కాన్సుల్ జనరల్, అమెరికా నేవీ స్ట్రైక్ గ్రూప్-5 కమాండర్, 54వ ఇన్ఫాంట్రీ డివిజన్ డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్, ఇతర సీనియర్ ప్రముఖులు డీవీ దినోత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ తీరంలో, సముద్ర జలాల్లో సంక్లిష్ట సైనిక కార్యకలాపాల కసరత్తును సమగ్రంగా నిర్వహించారు. ఈ మేరకు “స్టాండ్‌ఆఫ్-హార్డ్ బీచింగ్, ఎస్‌సీ -ఎంఐ-17, వి5 హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక ఆపరేషన్ దళాల స్లిదరింగ్ వంటి కార్యకలాపాలు నిర్వహించారు. అలాగే సి-130 విమానాల భాగస్వామ్యంతో భారత నావికాదళం, సైన్యం, వైమానిక దళం సహా అమెరికా నేవీ, ఆర్మీ, మెరైన్ కోర్ సిబ్బంది సంయుక్తంగా సమగ్ర వైమానిక కసరత్తులు కూడా ప్రదర్శించారు.
భారత-అమెరికా సాయుధ దళాల మిశ్రమ పోరాట కసరత్తులు, సంయుక్త విన్యాస సమన్వయం, పరస్పర తోడ్పాటు స్థాయి మెరుగుదలను ఈ కార్యకలాపాలు ప్రతిబింబించాయి.
ఈ నెల ఏప్రిల్ 1 నుంచి 11 వరకు సాగిన ఈ కసరత్తు ‘హెచ్‌ఏడీఆర్’ కార్యకలాపాలకు సంబంధించి సిబ్బందికి అమూల్య శిక్షణనివ్వడంలో దోహదం చేసింది. అంతేగాక ఇందులో పాలు పంచుకున్న వారికి పరస్పర సామర్థ్యాలు, పద్ధతులు, విధానాలపై సంపూర్ణ అవగాహన కలిగింది. కాగా, లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ (లెమోవా-ఎల్‌ఇఎంఒఎ) కింద ‘టైగర్ ట్రయంఫ్’ తొలి కసరత్తును 2019లో నిర్వహించారు. లాజిస్టిక్స్ ఆదానప్రదానం ద్వారా కార్యాచరణ సమన్వయ సౌలభ్యం బలోపేతం, రెండు దేశాల సాయుధ దళాల మధ్య ఆధునిక సాంకేతికతల ఏకీకరణ ఈ సంయుక్త విన్యాసాల లక్ష్యం.
ప్రస్తుత విన్యాసాల్లో రేవు దశ (హార్బర్ ఫేజ్) కసరత్తును ఏప్రిల్ 1 నుంచి 7 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో అమెరికా రాయబార కార్యాలయం ‘ఛార్జ్ డి అఫైర్స్’ శ్రీ జోర్గాన్ కె.ఆండ్రూస్తోపాటు భారత తూర్పు నావికాదళ కమాండ్ ప్రధాన కార్యాలయం ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ వైస్-అడ్మిరల్ సమీర్ సక్సేనా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ-సెయిల్ సదస్సులతోపాటు వైద్య, డ్రోన్, అంతరిక్షం సహా కీలక సాంకేతిక పరిజ్ఞానాలపై ఆయా అంశాల్లో నిపుణుల మధ్య ఆదానప్రదానాలు వంటి కార్యకలాపాలు నిర్వహించారు. అలాగే పరస్పర డెక్ సందర్శనలు, షిప్ బోర్డింగ్ డ్రిల్స్ వంటి కసరత్తుల ప్రదర్శనతోపాటు రెండు దేశాల సాయుధ సిబ్బంది మధ్య స్నేహపూర్వక క్రీడా పోటీలు కూడా ఏర్పాటు చేశారు.
(Release ID: 2121699)
Visitor Counter : 17