ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, యునెస్కో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 3వ ఏఐ సన్నద్ధత సమాలోచన
Posted On:
07 APR 2025 2:33PM by PIB Hyderabad
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ (ఎం.ఈ.ఐ.టి.వై ) సహకారంతో యునెస్కో దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయం భారతదేశంలో - ఏఐ సన్నద్ధత మదింపు పద్ధతులు- అన్న కోణంలో భాగస్వామ్య పక్షాల సమాలోచనను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ 8, మధ్యాహ్నం గం. 1.30 ని. లకు హైదరాబాద్ టీ-వర్క్స్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇకిగాయి లా సంస్థ పర్యవేక్షిస్తోంది.
కార్యక్రమంలో భాగంగా ఎం.ఈ.ఐ.టి.వై అదనపు కార్యదర్శి, ఇండియా ఏఐ మిషన్ సంస్థ సీఈఓ అభిషేక్ సింగ్ ల మధ్య ఇష్టాగోష్టి ఏర్పాటవుతోంది. “షేపింగ్ ఎథిక్స్ ఇన్ ఏఐ గవర్నెన్స్: గవర్నమెంట్ అండ్ మల్టీలేటరల్ పర్స్ పెక్టివ్స్” అనే అంశం పై జరిగే నిపుణుల చర్చలో మెయిటీ, భారత ప్రభుత్వ ముఖ్య వైజ్ఞానిక సలహాదారు కార్యాలయం, అమృత విశ్వవిద్యాలయం, తెలంగాణా ప్రభుత్వం, యునెస్కోలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొంటారు. పాలన, కార్యవర్గ సన్నద్ధత, మౌలిక వనరులు, యూజ్ కేసెస్ (ప్రత్యేక పద్ధతుల ద్వారా సంస్థల అవసరాలను గుర్తించే విధానం) అనే నాలుగు ముఖ్య ఇతివృత్తాలను, ప్రతినిధులు నాలుగు బృందాలుగా విడిపోయి చర్చిస్తారు. దరిమిలా భారత ఏఐ సన్నద్ధతలోని కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగే అవకాశం కలుగుతుంది.
ఏఐ రామ్ కార్యక్రమం నేపథ్యం
న్యూఢిల్లీ, బెంగళూరు బహుళపక్ష ఏఐ రామ్ సమావేశాల అనంతరం, హైదరాబాద్ సమాలోచన అయిదు సమావేశాల పరంపరలో మూడోది. నైతిక ఏఐ వాతావరణంలోని అవకాశాలు, భారత్ బలాలను దృష్టిలో ఉంచుకుని ఏఐ విధాన పత్రాన్ని తయారుచేయాలన్నది ఏఐ రామ్ సమాలోచనల లక్ష్యం. విధానకర్తలు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ నిపుణులు, ఈ రంగంలో పనిచేస్తున్న వారికి దేశానికి అవసరమైన సురక్షిత, భవిష్యదభిముఖ, బాధ్యతాయుత విధానాన్ని రూపొందించే అవకాశం దక్కుతుంది. ఆసక్తి గల వారు https://forms.gle/3emuaGpgZuvMghYq9 లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఇండియా ఏఐ మిషన్ పేరిట ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కీలక సమయంలో ఏర్పాటవుతున్న ఈ సమాలోచనల కోసం రూ. 10,000 కోట్లను కేటాయించారు. నైతిక, జవాబుదారీ, సురక్షిత ఏఐ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ పిల్లర్ తార్కాణంగా నిలుస్తోంది. స్థానిక వ్యవస్థలు, పాలనా పద్ధతులు, స్వీయ అంచనా మార్గదర్శకాలకు ప్రోత్సాహాన్నివ్వడం ద్వారా సృజనకారులకు సాధికారత కల్పన సహా వివిధ రంగాలకు కృత్రిమ మేధ ప్రయోజనాలను అందించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం.
******
(Release ID: 2119771)
Visitor Counter : 43