రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఐఎన్ఎస్ సునయనను హిందూమహాసముద్ర నౌక ‘సాగర్‘ గా కరువార్ నుంచి ప్రారంభించిన రక్షణ మంత్రి; నౌకలో తొమ్మిది హిందూ మహాసముద్ర ప్రాంత మిత్రదేశాలకు చెందిన 44 మంది సిబ్బంది

సముద్ర ప్రాంతంలో శాంతి, సౌభాగ్యం, సమష్టి భద్రత పట్ల భారత్ నిబద్ధతకు ఐఓఎస్ సాగర్ ప్రతిబింబం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్
“భారీ ఆర్థిక, సైనిక శక్తిని ఆధారంగా చేసుకుని ఐఓఆర్ లోని ఏ దేశం కూడా మరో దేశాన్ని అణచివేయకుండా చూడటం భారత నౌకాదళం బాధ్యతగా తీసుకుంటుంది”
“సోదరభావం, భాగస్వామ్య ప్రయోజనాలకు చిహ్నంగా ఐఓఆర్ ను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం”
ప్రాజెక్ట్ సీబర్డ్ కింద నిర్మించిన రూ.2,000 కోట్ల ఆధునిక ఆపరేషనల్, రిపేర్, లాజిస్టిక్ సౌకర్యాలను కూడా ప్రారంభించిన రక్షణ మంత్రి

Posted On: 05 APR 2025 4:07PM by PIB Hyderabad

భారత నౌకాదళం ఆఫ్‌షోర్ గస్తీ నౌక ఐఎన్ఎస్ సునయనను హిందూ మహాసముద్ర నౌక (ఐఓఎస్) సాగర్ (ప్రాంతంలోని అందరి భద్రత, అభివృద్ధి కోసం)ను రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 5, 2025న కర్ణాటకలోని కరువార్‌లో ప్రారంభించారు. ప్రాజెక్ట్ సీబర్డ్ కింద రూ.2,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఆధునిక నిర్వహణ, మరమ్మత్తు, రవాణా (ఆపరేషనల్, రిపేర్, లాజిస్టిక్) సౌకర్యాలను కూడా రక్షణ మంత్రి ప్రారంభించారు. సీడీఎస్‌ జనరల్ అనిల్ చౌహాన్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు రక్షణ మంత్రి వెంట ఉన్నారు. 

 

ఐఓఎస్ సాగర్

 

తొమ్మిది మిత్ర దేశాల (కొమొరోస్, కెన్యా, మడగాస్కర్, మాల్దీవులు, మారిషస్, మొజాంబిక్, సీషెల్స్, శ్రీలంక, టాంజానియా) నుండి 44 మంది నావికాదళ సిబ్బందితో ఈ నౌకను ప్రారంభించడం ప్రాంతీయ సముద్ర భద్రత, అంతర్జాతీయ సహకారం పట్ల భారతదేశ నిబద్ధతను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. 

 

హిందూ మహాసముద్ర ప్రాంత (ఐఓఆర్) భాగస్వామ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఐఓఎస్ సాగర్ ను ప్రారంభించడం సముద్ర రంగంలో శాంతి, సౌభాగ్యం, సామూహిక భద్రత పట్ల భారతదేశ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఐఓఆర్ లో పెరుగుతున్న భారత్ ఉనికిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. "ఇది మన భద్రత, జాతీయ ప్రయోజనాలకు సంబంధించినది మాత్రమే కాదు, ఈ ప్రాంతంలోని మా స్నేహపూర్వక దేశాల మధ్య హక్కులు, బాధ్యతల సమానత్వాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఐఓఆర్ లో ఏ దేశమైనా తన ఆర్థిక బలం, సైనిక బలం చూసుకుని మరో దేశాన్ని అణచి వేయాలని చూస్తే భారత నౌకాదళం తగిన చర్యలు తీసుకుంటుంది. దేశాల సార్వభౌమత్వానికి భంగం వాటిల్లకుండా వారి ప్రయోజనాలను రక్షించేందుకు మేం కట్టుబడి ఉన్నాం” అని స్పష్టం చేశారు.

 

ఈ ప్రాంతంలో నౌకల దారి మళ్లింపు, సముద్రపు దొంగల కార్యకలాపాల వంటి సంఘటనల సమయంలో భారత నౌకాదళం మొదటి ప్రతిస్పందనగా అవతరించిందని రక్షణ మంత్రి ప్రశంసించారు. భారత నౌకలకే కాకుండా విదేశీ నౌకల భద్రతకు కూడా నావికాదళం భరోసా ఇస్తోందని అన్నారు. హిందూమహాసముద్ర ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, నిబంధనల ఆధారిత వ్యవస్థ, చౌర్య నిరోధం, శాంతి, సుస్థిరతలను కాపాడడం నౌకాదళం ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా ఆయన పేర్కొన్నారు. “ఇతర భాగస్వాములతో కలిసి, భారత నౌకాదళం ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలను సాధించేందుకు కృషి చేస్తోంది. ఆధునిక నౌకలు, ఆయుధాలు, పరికరాలతో పాటు, అత్యుత్తమంగా శిక్షణ పొందిన, ప్రేరణ కలిగిన నావికులతో హిందూమహాసముద్ర ప్రాంతాన్ని సౌభ్రాతృత్వం, పరస్పర ప్రయోజనాల ప్రతీకగా అభివృద్ధి చేయడం కోసం మిత్రదేశాల‌తో కలిసి ముందుకు సాగాలన్న ధృఢ సంకల్పంతో ఉంది” అని అన్నారు. 

ఈ నౌక ప్రారంభోత్సవం సాగర్ కార్యక్రమం 10వ వార్షికోత్సవం, జాతీయ సముద్ర దినోత్సవం సందర్బంగా జరగడం విశేషం. శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ప్రాంతాల వారీగా భద్రత, వృద్ధి కోసం పరస్పర, సమగ్ర పురోగతి - మహాసాగర్‘ (మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఎక్రాస్ రీజియన్స్) ను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ ‘మహాసాగర్‘ భావన సాగర్ దృక్కోణాన్ని మరింత అభివృద్ధి చెందిన, సహకారపూరిత మార్గంలో విస్తరించి, బలపరచనుందని ఆయన పేర్కొన్నారు. “భారతదేశం సాగర్ నుంచి మహాసాగర్ దిశగా ప్రయాణం ప్రారంభించిన ఈ సమయం కంటే ఐఓఎస్ సాగర్ నౌక యాత్రను ప్రారంభించేందుకు మంచి సమయం మరొకటి ఉండదు” అని ఆయన అన్నారు.

 

1919 లో భారతదేశపు మొదటి వాణిజ్య నౌక ఎస్ఎస్ లాయల్టీ ముంబయి నుంచి లండన్ కు బయలుదేరిన ఏప్రిల్ 05 చారిత్రక ప్రాముఖ్యతను రక్షణ మంత్రి ప్రస్తావించారు. ఐఓఎస్ సాగర్ మిషన్ ను ప్రారంభించడానికి ఇది సరైన సందర్భంగా అభివర్ణించారు. “మన సముద్ర వారసత్వాన్ని స్మరించుకునే రోజునే భారతదేశం ప్రాంతీయ సహకారాన్ని ముందుండి నడిపిస్తుండటాన్ని చూసి గర్వంగా ఉంది” అని ఆయన తెలిపారు.

 

ఐఓఎస్ సాగర్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యాత్ర సమిష్టి భద్రత, అభివృద్ధి, సముద్రోన్నతి లక్ష్యాలను సాధించడంలో తప్పకుండా విజయవంతమవుతుందని శ్రీ రాజ్ నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

ఐఓఎస్ సాగర్ అనేది నైరుతి హిందూమహాసముద్ర ప్రాంతంలోని నౌకాదళాలు, సముద్ర సంబంధిత సంస్థలను భారత నౌకాదళ వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టిన మార్గదర్శక ప్రయత్నం. ఈ మిషన్ ద్వారా మిత్రదేశాల సముద్ర యాత్రికులకు సమగ్ర శిక్షణను అందించడానికి, సముద్ర భద్రత లో ఇదివరకెన్నడూ లేని స్థాయిలో సహకారాన్ని సాధించడానికి దోహదపడుతుంది. 

 

ఐఎన్ఎస్ సునయన తన యాత్రలో దార్-ఎస్-సలాం, నకాలా, పోర్ట్ లూయి, పోర్ట్ విక్టోరియాలను సందర్శించనుంది. నౌకపై ఉన్న అంతర్జాతీయ సిబ్బంది కొచ్చిలోని వివిధ వృత్తి శిక్షణ కేంద్రాలలో పొందిన విజ్ఞానాన్ని అన్వయిస్తూ శిక్షణ విన్యాసాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమాలలో అగ్నిప్రమాదాల నివారణ, నష్ట నియంత్రణ, విజిట్, బోర్డ్, సెర్చ్ అండ్ సీజ్ (విబిఎస్ఎస్), బ్రిడ్జ్ ఆపరేషన్లు, సీమన్‌షిప్, ఇంజిన్ రూమ్ నిర్వహణ, స్విచ్‌బోర్డ్ ఆపరేషన్లు, బోట్ హ్యాండ్లింగ్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ శిక్షణలు భారత నౌకాదళం, దాని అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

 

ఐఓఎస్ సాగర్ హిందూమహాసముద్ర ప్రాంత (ఐఓఆర్) భవిష్యత్తు ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించనుంది. ఈ మిషన్ ద్వారా, సముద్రపరంగా తన పొరుగుదేశాలతో సంబంధాలను పటిష్టం చేసుకోవడానికి, ఈ ప్రాంతాన్ని మరింత సురక్షితమైన, సమ్మిళితమైన, భద్రమైన, సముద్రపరమైన వాతావరణంగా తీర్చిదిద్దేందుకు భారతదేశం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.

ప్రాజెక్ట్ సీబర్డ్ సౌకర్యాలు

 

ఈ సౌకర్యాలలో నౌకలు, జలాంతర్గాములు, హార్బర్ క్రాఫ్ట్‌లు నిలపడానికి రూపొందించిన మెరైన్ మౌలిక సదుపాయాలు, ఆర్మమెంట్ విఫ్, పునరుద్ధరణల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు పియర్స్, మెరైన్ యుటిలిటీ కాంప్లెక్సులు, సైనికులు, రక్షణ రంగ పౌరుల కోసం 480 నివాస యూనిట్లతో కూడిన నివాస సదుపాయాలు ఉన్నాయి. అలాగే, ఈ ప్రాజెక్టులో 25 కిలోమీటర్ల రోడ్ నెట్‌వర్క్, 12 కిలోమీటర్ల వర్షపు నీటి నిక్షేప నాళాలు, నీటి నిల్వ చెరువులు, వేగవంతమైన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, భద్రతా గస్తీ టవర్లు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

 

ఈ సౌకర్యాలు పశ్చిమ తీరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నౌకాదళ ఆస్తుల సుస్థిరతకు గణనీయంగా దోహదపడతాయి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సైనిక బలగాన్ని సిద్ధం చేయడంలో భారత నౌకాదళం కృషికి ఇవి పెద్ద ఊతమివ్వనున్నాయి. ఈ మౌలిక సదుపాయాల నిర్మాణం ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా చేపట్టారు. ఇందులో 90 శాతానికి పైగా సామగ్రి, పరికరాలను దేశీయంగానే సేకరించారు. కరువార్ నౌకా స్థావరం ప్రగతిశీలంగా పని చేస్తున్నందున ఇది ఉత్తర కన్నడ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు విశేషమైన మద్దతును అందించనుంది.

 

*******


(Release ID: 2119736) Visitor Counter : 28