గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనుల తవ్వకం కోసం అనుమతుల వ్యవస్థ

Posted On: 02 APR 2025 2:24PM by PIB Hyderabad

     గనులు-ఖనిజాల నిర్వహణలో వివిధ రాష్ట్రాల ఉత్తమ పద్ధతులపై ఒక సమగ్ర నివేదిక రూపొందింది. ఈ రంగంలో రాష్ట్రాల మధ్య పరస్పర అనుభవ సంగ్రహణతో సంయుక్త కృషిని ప్రోత్సహించడమే కాకుండా గనుల రంగం సర్వతోముఖాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఈ మేరకు అన్వేషణ సామర్థ్యం మెరుగుదల, నిలకడకు ప్రోత్సాహం, నిబంధనల సరళీకరణ, సామాజిక ప్రయోజనాల పెంపుపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఇందులో సిఫారసులు చేసింది. అంతేకాకుండా గనుల తవ్వకపు అనుమతులు-ఆమోదాల క్రమబద్ధీకరణ, జాతీయ భౌగోళికశాస్త్ర సమాచార నిధితో ఖనిజాన్వేషణ సమాచారం ఏకీకరణ, సాధారణ ఖనిజాల (మైనర్ మినరల్స్‌)కు స్టార్ రేటింగ్, సాంకేతిక సామర్థ్యం పెంపు దిశగా రాష్ట్ర మైనింగ్-జియాలజీ డైరెక్టరేట్ల బలోపేతం, వేలం వేసిన ఖనిజ గనుల నిర్వహణ, అక్రమ మైనింగ్‌ నిరోధక నిఘా వ్యవస్థ, సాధారణ ఖనిజాల తవ్వకానికి అనుమతుల వ్యవస్థ ఏర్పాటు, నష్టపూరక అటవీకరణ సౌలభ్యం కోసం భూ నిధి (ల్యాండ్ బ్యాంక్‌) సృష్టి తదితరాలనూ సిఫారసు చేసింది.

   దీనికి అనుగుణంగా కొన్ని ప్రధాన లక్ష్యాలతో సరికొత్త గనుల తవ్వకపు అనుమతుల వ్యవస్థ (ఎంటిఎస్‌) ఏర్పాటైంది. ఇందులో భాగంగా మైనింగ్ సంబంధిత ప్రక్రియల డిజిటలీకరణ-క్రమబద్ధీకరణ, పారదర్శకత పెంపు, సమాచార నిర్వహణ సౌలభ్యం మెరుగుదల, భాగస్వాముల మధ్య సహకారం పెంపు, భవిష్యత్ సాంకేతిక ప్రగతికి తగిన వ్యవస్థల రూపకల్పన, ఖనిజ వనరుల నిర్వహణ సామర్థ్యం మెరుగుదల వంటి బాధ్యతలను ఇది నిర్వర్తిస్తుంది.

   దేశంలోని చిన్న-మధ్య తరహా మైనింగ్ కార్యకలాపాలలో ఉత్తమ పద్ధతుల అనుసరణ వల్ల పోటీతత్వం, కార్యాచరణ సామర్థ్యం ఇనుమడిస్తాయి. అటువంటి విధానాలు నిలకడకు భరోసా ఇవ్వడమే కాకుండా మైనింగ్ రంగం సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తాయి.

   ఈ సంవత్సరం జనవరిలో 3వ జాతీయ మైనింగ్ మంత్రుల సమావేశం నిర్వహించగా, వివిధ ఖనిజ సమృద్ధ రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ అగ్రగాములు, ఇతర కీలక భాగస్వాములు పాల్గొన్నారు. కీలక ఖనిజాల దీర్ఘకాలిక సరఫరాలో నిలకడకు భరోసా, ఖనిజాన్వేషణ, మైనింగ్, శుద్ధి, రీసైక్లింగ్ సహా అన్ని దశలతో కూడిన జాతీయ కీలక ఖనిజ విలువ వ్యవస్థ  బలోపేతం లక్ష్యంగాగల జాతీయ కీలక ఖనిజ కార్యక్రమంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ మేరకు కీలక ఖనిజాన్వేషణ, మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన-అభివృద్ధి ప్రక్రియలకు ప్రోత్సాహం, వేలం వేసిన గనుల కార్యకలాపాలపై నిశిత పర్యవేక్షణ, జాతీయ భౌగోళికశాస్త్ర సమాచార నిధితో అన్వేషణ సమాచారం ఏకీకరణ, దేశీయ సరఫరా బలోపేతం కోసం విదేశాల నుంచి కీలక ఖనిజాల కొనుగోలు-దిగుమతి వగైరాల దిశగా పరిశ్రమలను ప్రోత్సహించాలని ఈ సదస్సు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల పరిధిలోని గ్రాఫైట్, టంగ్‌స్టన్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, నికెల్ వంటి కీలక ఖనిజాలు సహా వివిధ ఖనిజాల తవ్వకం కోసం 15 ప్రధాన గనుల ఐదో విడత వేలానికి శ్రీకారం చుట్టారు. దేశీయ సరఫరా వ్యవస్థ రూపకల్పన-బలోపేతం సహా కీలక ఖనిజాల రంగంలో స్వయం సమృద్ధిపై భారత్‌ దీర్ఘకాలిక లక్ష్యసాధనకు దోహదపడటమే ఈ కార్యక్రమాల ధ్యేయం.

   కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి ఇవాళ లోక్‌సభలో ఒక ప్రశ్నపై ఇచ్చిన   లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(Release ID: 2117914) Visitor Counter : 9


Read this release in: English , Urdu , Hindi