వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఈ కామర్స్ సంస్థలపై దాడులను ముమ్మరం చేసిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
నాణ్యతా ప్రమాణాల ఉత్తర్వులకు సరితూగని నాసిరకం ఉత్పత్తులను కనుగొన్న బీఐఎస్
Posted On:
27 MAR 2025 12:22PM by PIB Hyderabad
నేషనల్ స్టాండర్డ్స్ బాడీ ఆఫ్ ఇండియా విభాగమైన బీఐఎస్ శాఖ, మార్చి 19న ఢిల్లీ మోహన్ కోపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ సంస్థ గోదాముల్లో సోదాలను నిర్వహించి పలు నాసిరకం ఉత్పత్తులను జప్తు చేసింది. 15 గంటల పాటు కొనసాగిన సోదాల్లో ఐఎస్ఐ గుర్తు లేని, లేదా నకిలీ ముద్రణ కలిగిన 3,500 పైగా ఉత్పత్తులను బీఐఎస్ స్వాధీన పరచుకుంది. జప్తు చేసిన గీజర్లు, మిక్సీలు, ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాల విలువ సుమారు రూ.70 లక్షలుగా ఉండవచ్చని అంచనా.
ఢిల్లీ త్రినగర్ ప్రాంతంలోని ఫ్లిప్ కార్ట్ అనుబంధ సంస్థ ఇంస్టాకార్ట్ సర్వీసెస్ లో చేపట్టిన సోదాల్లో, పంపిణీకి సిద్ధంగా ఉన్న క్రీడా-సంబంధిత ప్రత్యేక పాదరక్షలను కనుగొన్నారు. వీటిపై ఎటువంటి ఐఎస్ఐ చిహ్నం లేదా ఉత్పత్తి చేసిన తేదీ లేదు. ఈ దాడిలో రూ. 6 లక్షల విలువైన 590 జతల క్రీడాకారుల పాదరక్షలను స్వాధీనం చేసుకున్నారు.
గత నెల రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీఐఎస్ బృందం సోదాలు నిర్వహిస్తుండగా, ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, లక్నో, శ్రీపెరంబుదూరుల్లో నాసిరకం ఉత్పత్తులను కనుగొన్నారు. వినియోగదారు ప్రయోజనాల సంరక్షణార్థం, తయారీ సంస్థలు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేందుకు బీఐస్ చేస్తున్న కృషిలో భాగంగా తనిఖీలు చేపడుతున్నారు. 769 ఉత్పత్తులకు సంబంధించి వివిధ నియంత్రణ సంస్థలు, లైన్ మంత్రిత్వశాఖలు (ప్రత్యేక రంగాలపై దృష్టి కేంద్రీకరించే మంత్రిత్వశాఖలు) కచ్చితమైన ధ్రువీకరణ కోరుతున్నాయి. సరైన లైసెన్సు, లేదా బీఐఎస్ సీఓసీ (కంప్లయన్స్ సర్టిఫికెట్) లేనిదే ఈ ఉత్పత్తుల తయారీ, దిగుమతి, విక్రయం, లీజు, భద్రపరచడం, లేదా అమ్మే ఉద్దేశంతో ప్రదర్శన చేపట్టే వీలులేదు.
ఈ ఉత్తర్వులను అతిక్రమంచే వారు బీఐఎస్ చట్టం- 2016 29వ విభాగం 3వ ఉపవిభాగంలోని సూత్రాలను అనుసరించి జైలుశిక్ష, అపరాధ రుసుము, లేదా రెండిటికీ శిక్షార్హులు.


***
(Release ID: 2116069)
Visitor Counter : 14