వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
నిర్ధిష్ట కార్యక్రమాలు, పెట్టుబడి సాయంతో అంకుర సంస్థల వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం
స్టార్టప్ ఇండియా పథకానికి ఎంపికైన 217 ఇంక్యుబేటర్లకు రూ. 916.91 కోట్ల నిధులు
Posted On:
25 MAR 2025 4:33PM by PIB Hyderabad
ఆవిష్కరణలను, అంకుర సంస్థలను, అంకుర సంస్థల్లో పెట్టబడులను ప్రోత్సహించడానికి అనువైన వ్యవస్థను నిర్మించే ఉద్దేశంతో 2016, జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా ప్రైవేటు రంగం, విద్యా సంస్థలకు చెందిన ఇంక్యుబేటర్లకు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం (ఎస్‌ఐఎస్ఎఫ్ఎస్) ద్వారా సహాయం లభిస్తోంది. ఆలోచన, నమూనా అభివృద్ధి, ఉత్పత్తి పరీక్షలు, మార్కెట్లో ప్రవేశం, వ్యాపారానికి సంబంధించి అర్హత కలిగిన అంకుర సంస్థలకు ఇంక్యుబేటర్ల ద్వారా ఈ పథకం ఆర్థికసాయం అందిస్తుంది. నిధులను కేటాయించేందుకు ఎస్ఐఎస్ఎఫ్ఎస్ కు చెందిన నిపుణుల సలహా సంఘం (ఈఏసీ) ఇంక్యుబేటర్లను పరీక్షించి, ఎంపిక చేస్తుంది. 2021, ఏప్రిల్ 1 నుంచి ఎస్ఐఎస్ఎఫ్ఎస్ అమలవుతోంది. 2025, జనవరి 31 నాటికి, ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు 217 ఇంక్యుబేటర్లు ఎంపికయ్యాయి. వీటికి రూ. 916.91 కోట్ల నిధులు అందించారు.
స్టార్టప్ ఇండియా పథకం ద్వారా అంకుర సంస్థలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోంది. ఈ పథకం ద్వారా చేపట్టిన చర్యలన్నీ సమ్మిళతత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. అలాగే వెనకబడిన నేపథ్యం ఉన్నవారు, గ్రామీణ, గిరిజన నేపథ్యాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు అందిస్తాయి.
అంకుర సంస్థలకు నిధులు (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం (ఎస్ఐఎస్ఎఫ్ఎస్), అంకుర సంస్థలకు క్రెడిట్ గ్యారంటీ పథకం (సీజీఎస్ఎస్) లాంటి ప్రధాన కార్యక్రమాలు వివిధ దశల్లో వ్యాపార నిర్వహణకు స్టార్టప్‌లకు తోడ్పాటు అందిస్తాయి. రాష్ట్రాల అంకుర సంస్థల ర్యాంకింగ్, జాతీయ స్టార్టప్ పురస్కారాలు, ఆవిష్కరణల వారోత్సవం తదితర కార్యక్రమాలను కాలానుగుణంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంకుర సంస్థల వ్యవస్థకు సహకారం అందించేందుకు స్టార్టప్ మహా కుంభ్ లాంటి కార్యక్రమాల నిర్వహణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తమ నెట్వర్క్‌ను విస్తరించుకోవడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వీలు కల్పించే వేదికగా పనిచేస్తుంది. మార్కెట్ అవకాశాలను మెరుగుపరచడానికి, అంకుర సంస్థల వృద్ధికి, వాటి వ్యాపారాలు మెరుగుపడేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. వనరులను సులభంగా చేరుకోవడానికి, అంకుర సంస్థల వ్యవస్థలో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి స్టార్టప్ ఇండియా పోర్టల్, భాస్కర్ తరహా డిజిటల్ వేదికలు వీలు కల్పిస్తాయి. మార్గదర్శకత్వం, మౌలిక వసతులు ఉపయోగించుకోవడానికి వీలు కల్పించడం, వనరులు, జ్ఞానాన్ని పంచుకోవడం, మార్కెట్ అవకాశాలు, పెట్టుబడిదారులతో అనుసంధానమవడం తదితర అంశాల్లో అంకుర సంస్థలకు అవసరమైన మద్ధతు అందించాలని కార్పొరేట్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ చర్యలను నియంత్రణా సంస్కరణలు, అంకుర సంస్థల వ్యవస్థకు సంబంధించిన ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అదనంగా చేపడుతున్నారు.
లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2115097)
Visitor Counter : 20