వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
భారత్ దాల్ పథకంలో భాగంగా వినియోగదారులకు రాయితీ ధరకు పెసర పప్పు
Posted On:
19 MAR 2025 5:53PM by PIB Hyderabad
వినియోగదారులకు వారు భరించగలిగినంత చౌక ధరలలో పప్పులను అందుబాటులో ఉంచేటట్లు చూడడానికి 2023 జులై నెలలో పీఎస్ఎఫ్ లోని చనా (సెనగల) నిల్వను చిల్లర విక్రయాల నిర్వహణ నిమిత్తం సెనగ పప్పుగా మార్చివేసి, భారత్ దాల్‌ను ప్రారంభించారు. భారత్ చనా దాల్ ను ఒక కిలో ప్యాక్‌ను రూ.60, 30 కేజీల ప్యాక్ రూపంలో అయితే ఒక కిలో రూ.55 ధర చొప్పున సబ్సిడీ ధరలలో రిటైల్ కస్టమర్లకు అమ్మారు. భారత్ చనా దాల్ ఒకటో దశలో రిటైల్ కస్టమర్లకు 12.32 లక్షల మెట్రిక్ టన్నుల భారత్ సెనగపప్పును విక్రయించారు. భారత్ దాల్ అమలులో సహకరిస్తున్న ఏజెన్సీలు దేశవ్యాప్తంగా 172 నగరాల్లో 25023 విక్రయకేంద్రాలు, సంచార వ్యాన్ల ద్వారా భారత్ సెనగపప్పును పంపిణీ చేశారు.
దీనికి అదనంగా, భారత్ (చనా) దాల్ రెండో దశలో భాగంగా, రిటైల్ పంపిణీ కోసం 3 లక్షల ఎంటీ సెనగ పప్పును కూడా కేటాయించారు. ఈ తరహాలో కేటాయించిన సెనగ పప్పును పప్పు రూపంలోనూ, పూర్తి రూపంలోనూ.. ఒక కిలో ప్యాక్‌కయితే సెనగపప్పును ఒక కిలో రూ.70 గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ), పూర్తి రూపంలో (చనా హోల్) అయితే ఒక కిలో రూ.58 ఎంఆర్‌పీ పై అమ్ముతున్నారు. ఈ సంవత్సరంలో ఈ నెల 12 వరకు 1.18 లక్షల మెట్రిక్ టన్ను (ఎల్ఎంటీ)ల సెనగ పప్పు, 13.495 మెట్రిక్ టన్నుల పూర్తి రూపంలో చనా విక్రయాలు నమోదయ్యాయి. భారత్ దాల్ ఒకటో దశలో భాగంగా, 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 3051 స్థిర దుకాణాలలో, 8939 మొబైల్ వ్యాన్లు, 9 ప్రధాన ఈ-కామర్స్ వేదికల ద్వారానూ భారత్ పప్పుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
భారత్ దాల్‌ను విస్తరించారు. పీఎస్ఎఫ్ ఆపద్ధర్మ నిల్వలో అట్టిపెట్టిన పెసర్లను పెసర పప్పుగా మార్చి భారత్ మూంగ్ దాల్ (భారత్ పెసర పప్పు)గా పేరు పెట్టారు. రాయితీ ధరలలో వినియోగదారులకు చిల్లర విక్రయాలు జరపాలనేది ముఖ్యోద్దేశం. ఇంతేకాకుండా భారత్ దాల్‌ను మరింతగా విస్తరించి, మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు లేదా మైసూర్ పప్పు అని కూడా అంటారు)ను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చారు. పీఎస్ఎఫ్ బఫర్‌లో ఉంచిన మసూర్ నిల్వను మసూర్ దాల్‌గా మార్చి కిలో రూ.89 చిల్లర విక్రయ ధరకు వినియోగదారులకు ఇవ్వాలనేదే ఉద్దేశం.
భారత్ సెనగ పప్పు ఒకటో దశ అసెస్‌మెంటును క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్తి చేసింది. భారత్ దాల్ పంపిణీలో సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడానికి, ఏజెన్సీలను క్రమం తప్పక భారత్ దాల్ పంపిణీ స్థితిగతులను ఎప్పటికప్పుడు ఫోటోల రూపంలో నమోదు చేస్తూ ఉండాల్సిందిగాను, రోజువారీ అమ్మకాల్లో ప్రగతిని విభాగానికి తెలియజేయాల్సిందిగాను ఆదేశాలిచ్చారు. నిలవల కదలిక, అమ్మకాల్లో పురోగతి, నిర్వహణ సంబంధిత సవాళ్ల పరిష్కారం కోసం నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), కేంద్రీయ భండార్‌లతో నిర్దిష్ట కాలాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు.
రెండో దశలో భాగంగా భారత్ బ్రాండ్ పప్పుల పంపిణీని నాఫెడ్, కేంద్రీయ భండార్, ఎన్‌సీసీఎఫ్.. ఈ మూడు కేంద్రీయ సహకార సంస్థలూ వాటి సొంత దుకాణాలు, మొబైల్ వ్యాన్లు, ఈ-కామర్స్ వేదికలతోపాటు పెద్ద స్థాయి చిల్లరవిక్రయ దుకాణ శాఖల ద్వారా కూడా చేపడుతున్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర వినియోగదారు వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీ బి.ఎల్. వర్మ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలియజేశారు.
***
(Release ID: 2113179)
Visitor Counter : 26