అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: విద్యార్థుల కోసం ఇస్రో కార్యక్రమాలు

Posted On: 19 MAR 2025 4:02PM by PIB Hyderabad

అంతరిక్ష కార్యక్రమాల పట్ల క్రమేపీ దేశంలో ఆసక్తి పెరుగుతోంది.

అంతరిక్ష సాంకేతికతల పట్ల అవగాహనను పెంచడం, వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం సగటు పౌరుల జీవితాల్లో  సామాజిక, ఆర్థికపరమైన సానుకూల ప్రభావాన్ని చూపగలదు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ అంచనాలు, సమాచారం, నౌకాయానం, రిమోట్ సెన్సింగ్ వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతిక ఉపకరణాల వినియోగం మెరుగైన జీవనోపాధి అవకాశాలు, వనరుల నిర్వహణ,  మెరుగైన అనుసంధానాలకి దారితీసి, దేశ సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయి.

విద్యార్థులు, సామాన్య ప్రజల్లో అవగాహనని పెంచేందుకు, సంస్థ సాధించిన విజయాలను పంచుకునేందుకు ఇస్రో క్రమం తప్పకుండా వివిధ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తోంది.

“స్పేస్ ఆన్ వీల్స్”, “యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం(యువిక)” వంటి ప్రత్యేక కార్యక్రమాలు సహా ఎగ్జిబిషన్లు, ప్రసంగాలు, విద్యార్థుల వర్క్ షాపులు, ఆన్లైన్ కోర్సులు వంటి అనుసంధాన కార్యక్రమాలను ఇస్రో నిర్వహిస్తోంది. విద్యాసంస్థలతో కలిసి వెబినార్లు, సామాజిక మాధ్యమాల్లో, టెలివిజన్ ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ అంతరిక్షం, శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంపొందించేందుకు సంస్థ కృషి చేస్తోంది.  

చంద్రయాన్ మిషన్ల విజయం విద్యార్థి లోకాన్ని ఉత్తేజపరచింది.  చంద్ర మండల పరిశోధనల్లో దేశం సాధించిన ప్రగతి ఖగోళ శాస్త్రం, అంతరిక్ష విజ్ఞాన రంగాల పట్ల విద్యార్థుల్లో ఉత్సుకతను, ఆసక్తిని రేకెత్తించాయి.

ఖగోళ విజ్ఞానం, సాంకేతికతల పట్ల విద్యార్థుల్లో స్ఫూర్తిని రగిలించి, వారికి తగిన శిక్షణను అందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో, ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. 2024లో ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటైన యువిక కార్యక్రమం 700 మంది విద్యార్థులని, 2023లో ఏర్పాటైన కార్యక్రమం 800 మందిని ఆకర్షించింది. రాష్ట్రంలో నమోదు చేసుకున్న స్పేస్ ట్యూటర్ల (ఖగోళ శాస్త్ర శిక్షకులు) ద్వారా 5000 మంది విద్యార్థులకు ఇస్రో శిక్షణను అందించగలిగింది. అంతే కాక, స్పేస్ ఆన్ వీల్స్ బస్సు ద్వారా 10,000 మంది విద్యార్థులు, సామాన్య ప్రజలకు చేరువై వారిలో అవగాహనను పెంపొందించింది.  

ఇస్రో అందిస్తున్న వివిధ కోర్సులకు అర్హత, ఇతర వివరాలు:

a.      యువ విజ్ఞాని కార్యక్రమ్ (యువిక – యువ వైజ్ఞానికుల కార్యక్రమం)

               i.     వివరాలు: 9వ తరగతిలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల కోసం ప్రత్యేకం. గురుకుల పద్ధతిలో సాగే ఈ శిక్షణా కార్యక్రమం విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికత, అప్లికేషన్లను గురించి ప్రాథమిక అవగాహనను కలిగిస్తుంది. శిక్షణలో భాగంగా ప్రత్యక్ష సెషన్లు, నిపుణుల ప్రసంగాలు, ఉన్నత విద్యావేత్తలతో అనుసంధాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.

             ii.     అర్హత :

· ఎంపిక జరిగే సంవత్సరం జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

· చదువులో ఉత్తమ ప్రదర్శన, వైజ్ఞానిక ప్రదర్శనలు, ఒలింపియాడ్లు, పాఠ్యేతర కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

b.      స్పేస్ ట్యూటర్లు

               i.     వివరాలు: ఆసక్తిగల విద్యాసంస్థలు, ఎన్జీవోలు, స్టెమ్ బోధకులను గుర్తించి, ఎగ్జిబిషన్లు, ప్రసంగాలు, వర్క్ షాపుల ద్వారా విద్యార్థుల్లో అంతరిక్షం పట్ల అవగాహన పెంపు కోసం ఇస్రో ప్రయత్నిస్తుంది.

             ii.     అర్హత:

· ఇస్రో వద్ద స్పేస్ ట్యూటర్లుగా నమోదైన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయ బోధకులు అర్హులు

· అవగాహన సదస్సుల్లో పాల్గొనేందుకు అన్ని వయసుల విద్యార్థులూ అర్హులే.

c.       స్పేస్ ఆన్ వీల్స్:

               i.     వివరాలు : అంతరిక్షం ఇతివృత్తంగా గల వివిధ ప్రదర్శన వస్తువులను కలిగిన మొబైల్ బస్సు

             ii.     అర్హత :

· స్పేస్ ఆన్ వీల్స్ బస్సును విద్యాసంస్థల్లో నిలపడం వల్ల, విద్యార్థులకు, పరిసర ప్రాంతాలలోని ప్రజలకు బస్సుని సందర్శించే వీలు కలుగుతుంది.

లోక్ సభకు ఈరోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాలు, భూవిజ్ఞాన శాస్త్ర, అణుశక్తి, అంతరిక్ష శాఖ, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.  


 

***


(Release ID: 2113175) Visitor Counter : 28