రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర జేఎన్పీఏ పోర్టు (పాగోటే) నుంచి చౌక్ వరకూ 29.219 కిలోమీటర్ల 6-లేన్ల కొత్త నియంత్రిత రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం : బీఓటీ (టోల్) పద్ధతిలో ప్రాజెక్టు నిర్మాణం
Posted On:
19 MAR 2025 4:13PM by PIB Hyderabad
మహారాష్ట్ర జేఎన్పీఏ పోర్టు (పాగోటే) నుంచి చౌక్ వరకు 29.219 కిలోమీటర్ల 6-లేన్ల కొత్త నియంత్రిత రహదారి నిర్మాణానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. రూ. 4500.62 కోట్లు ఖర్చు కాగల ఈ ప్రాజెక్టును ‘నిర్మాణం-నిర్వహణ-బదిలీ’ పద్ధతిలో నిర్మిస్తారు.
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ సూత్రాల కింద, సమీకృత మౌలిక సదుపాయాల ప్రణాళికల్లో భాగంగా నిర్మించే రహదారులను దేశంలోని చిన్న, పెద్ద ఓడ రేవులతో అనుసంధానించేందుకు ప్రాధాన్యమిస్తారు. జేఎన్పీఏ రేవులో పెరుగుతున్న రద్దీ, నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాల దృష్ట్యా ఈ ప్రాంతంలో జాతీయ రహదారులకు అనుసంధానాన్ని పెంచవలసిన అవసరాన్ని గుర్తించారు.
ప్రస్తుతం 48వ నెంబరు జాతీయ రహదారిలోని కీలక గోల్డెన్ క్వాడ్రీలేటరల్ ప్రాంతం నుంచీ జేఎన్పీఏ రేవు వరకూ.. ముంబయి, పూణే ఎక్స్ప్రెస్ వే లపై చేపట్టే ప్రయాణానికి 2-3 గంటల సమయం పడుతోంది. పలస్పే ఫటా, డీ-పాయింట్, కాలంబోలి జంక్షన్, పన్వెల్ వంటి నగర ప్రాంతాల్లో రోజుకి 1.8 లక్షల పీసీయూ (రోజుకి ఒక తోవలో తిరుగాడే కార్లు)కన్నా అధికమైన ట్రాఫిక్ నమోదవుతోంది. ఈ సంవత్సరం నవీ ముంబయి విమానాశ్రయ కార్యకలాపాలు ప్రారంభమైన అనంతరం ప్రత్యక్ష రహదారి అనుసంధాన అవసరాలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
దాంతో, ఈ ప్రాజెక్టు నిర్మాణం రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించడం సహా జేఎన్పీఏ రేవు, నవీ ముంబయిల మధ్య రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచగలదని ఆశిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు జేఎన్పీఏ రేవు (348వ నెంబరు జాతీయ రహదారి –పాగోటే గ్రామం) వద్ద మొదలై ఎన్ హెచ్-48 పైన గల ముంబయి-పూణే హైవే వద్ద ముగుస్తుంది. ఈ రహదారి ముంబయి-పూణే ఎక్స్ప్రెస్ వే , ముంబయి గోవా జాతీయ రహదార్లను (ఎన్ హెచ్-66) కూడా కలుపుతుంది.
వ్యాపారం నిమిత్తం తిరిగే భారీ కంటెయినర్ వాహనాలు సులభంగా ప్రయాణించేందుకు సహయాద్రి కొండల్లోని రెండు సొరంగ మార్గాలను అందుబాటులోకి తెస్తారు.. దాంతో కొండ ప్రాంతాల్లో ఎగుడుదిగుడు మార్గాల్లో ప్రయాణం వల్ల జరిగే జాప్యం తగ్గి, వాహనాలు త్వరితగతిన గమ్యాన్ని చేరుకోగలవు.
కొత్త 6-మార్గాల గ్రీన్ ఫీల్డ్ రహదారి ప్రాజెక్టు సురక్షితమైన, సమర్థవంతమైన సరుకుల రవాణాకు దోహదపడుతుంది. ముంబయి, పూణే పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి అవకాశాలను మెరుగుపరచి, ఆయా ప్రాంతాల పురోభివృద్ధికి దారితీస్తుంది.
కారిడార్ పటచిత్రం:

****
(Release ID: 2112915)
Visitor Counter : 20