గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సముద్ర ప్రాంతంలో ఇసుక బ్లాక్ నిర్మాణం కోసం జెఎన్ పిఎకు గనుల మంత్రిత్వ శాఖ అనుమతి

Posted On: 28 FEB 2025 6:18PM by PIB Hyderabad

సముద్ర  ప్రాంతంలో ఇసుక బ్లాక్ ల నిర్మాణానికి సమగ్ర  లైసెన్స్ మంజూరుకు సంబంధించిన అనుమతి పత్రాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోజు ముంబైలో జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్స్ అథారిటీ (జెఎన్ పిఎ) చైర్మన్ కు అందజేశారు. మహారాష్ట్ర తీరంలో ఉన్న ఆఫ్ షోర్ మినరల్ బ్లాక్ నుంచి వచ్చే ఇసుకను మహారాష్ట్రలోని పాల్ఘర్ , వధావన్ లో గ్రీన్ ఫీల్డ్ పోర్టు పునరుద్ధరణ, అభివృద్ధికి జేఎన్ పీఏ వినియోగిస్తుంది. ఈ ఇసుక బ్లాక్ ప్రతిపాదిత వధావన్ ఓడరేవు ప్రదేశానికి 50 కిలోమీటర్ల దూరంలో డామన్ తీరంలో 20 మీటర్ల నుంచి 25 మీటర్ల లోతులో ఉంది.


ఈ  సముద్ర ప్రాంత ఇసుక  బ్లాక్, మహారాష్ట్ర లోని వధావన్ వద్ద అన్ని వాతావరణ పరిస్థితులలోనూ కార్యకలాపాలు సాగించే గ్రీన్‌ఫీల్డ్ మేజర్ పోర్ట్ అభివృద్ధికి అవసరమైన సుమారు 200 మిలియన్ ఘనపు మీటర్ల ఇసుకను సమకూరుస్తుంది. వధావన్ పోర్ట్ ను మొత్తం రూ. 76,220 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది సంవత్సరానికి 298 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇందులో 23.2 మిలియన్ టిఇయుల  (ఇరవై అడుగుల సమాన యూనిట్లు) కంటైనర్ నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. పోర్ట్‌లో ప్రతి ఒక్కటి 1000 మీటర్ల పొడవుతో 9 కంటైనర్ టెర్మినల్స్, 4 మల్టీపర్పస్ బెర్త్‌లు తదితర వసతులు ఉంటాయి. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్స్ అథారిటీ దేశంలోని ప్రముఖ రేవు సంస్థలలో ఒకటిగా దేశ వ్యాపార, రవాణా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

సముద్ర  ప్రాంత ఖనిజ (అభివృద్ధి-నియంత్రణ) చట్టం-2002 ను పార్లమెంటు 2023 ఆగస్టులో సవరించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు లేదా కార్పొరేషన్లకు ఖనిజ బ్లాక్‌ల కేటాయింపుకు సంబంధించిన నిబంధనను ప్రవేశపెట్టింది.

రేవులు, నౌకాయాన,  జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంఒపిఎస్డబ్ల్యూ) అభ్యర్థనపై, సవరించిన చట్టానికి అనుగుణంగా 21.12.2023 తేదీ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం సముద్ర  ప్రాంతాన్ని గనుల మంత్రిత్వ శాఖ కేటాయించింది. ఈరోజు మంజూరైన అనుమతి/ఉద్దేశ  పత్రం (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ద్వారా జె ఎన్ పి ఎ  కు సముద్ర తీర ఇసుక బ్లాక్ కోసం సమగ్ర లైసెన్స్ పొందేందుకు అవసరమైన అనుమతులను పొందే అవకాశం లభిస్తుంది.

సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సమగ్ర సంప్రదింపుల అనంతరం సముద్ర తీర బ్లాక్‌ను గుర్తించారు, ఇది సముద్ర ప్రాంత ఖనిజాభివృద్ధి పట్ల సమగ్ర, సమన్వయ దృక్పథానికి దోహదపడింది. ఈరోజు జెఎన్ పిఎకు అందచేసిన అనుమతి పత్రం  ఈ దిశగా చేపట్టిన సంస్కరణలకు, బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల సముద్ర తీర ఖనిజ అభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటుకు నిదర్శనం.

ఈ బ్లాక్ కేటాయింపుతో జేఎన్ పీఏ- అభివృద్ధి, పోర్టు కార్యకలాపాల కోసం నిర్మాణ సామగ్రిపై ఆధారపడడం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ఉపాధిని సృష్టిస్తుందని, స్థానిక పరిశ్రమలను పెంచుతుందని, 2047 నాటికి వికసిత భారత్ సాధన దిశగా ప్రభుత్వ సంకల్పానికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.

సముద్ర జీవ వైవిధ్యానికి ఎక్కువ హాని జరక్కుండా అత్యున్నత పర్యావరణ ప్రమాణాలను పాటించేందుకు ఆధునిక డ్రెడ్జింగ్ సాంకేతికతను జె ఎన్ పి ఎ అవలంబించనుంది.  భవిష్యత్ కు సిద్ధమైన, సుస్థిర పోర్ట్ ద్వారా బాధ్యతాయుతంగా ఖనిజాల వెలికితీత, భూ పునరుద్ధరణ,  దీర్ఘకాలిక పర్యావరణ సమతుల్యతతో హరిత సాగర్ మార్గదర్శకాలకు, మారిటైమ్ ఇండియా విజన్ 2030 కు జె ఎన్ పి ఎ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు,

ఈ కార్యక్రమం సమగ్రమైన,  పర్యావరణపరంగా స్థిరమైన ఆర్థిక వృద్ధి పట్ల ప్రభుత్వ అచంచలమైన కట్టుబాటును ఈ చొరవ ప్రతిబింబిస్తుంది. ఈ కీలక ఘట్టం దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థ, విస్తృత సముద్ర తీర వనరుల అపార సామర్థ్యాన్ని ఉపయోగించడంలో ప్రభుత్వ క్రియాశీల విధానాన్ని సూచిస్తుంది. 

 

***


(Release ID: 2107283)
Read this release in: English , Urdu , Marathi , Hindi