గనుల మంత్రిత్వ శాఖ
బరైటిస్, ఫెల్‌స్పార్, మైకా, ఇంకా క్వార్ట్‌జ్‌లను ప్రధాన ఖనిజాలుగా వర్గీకరించిన గనుల శాఖ
Posted On:
21 FEB 2025 1:14PM by PIB Hyderabad
బరైట్స్ (ముగ్గురాయి), ఫెల్‌స్పర్ (చంద్రకాంతం), మైకా (అభ్రకం), క్వార్ట్‌జ్ (పలుగురాయి లేదా స్పటికశిల)లను గనుల శాఖ అప్రధాన ఖనిజాల జాబితాలో నుంచి ప్రధాన ఖనిజాల కేటగిరీకి చేర్చింది. ఈమేరకు ఈ నెల 20నాటి రాజపత్రంలో గనుల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర మంత్రిమండలి జనవరి 29న జాతీయ కీలక ఖనిజ మిషన్ (నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్)కు ఆమోద ముద్ర వేసిన తరువాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశంలోని గనులలో కీలక ఖనిజాలను అన్వేషించి, వాటిని తవ్వి వెలికితీయాలని నిర్ణయించింది. గనుల తవ్వకాల్లో భాగంగా ఇతర ఖనిజాలకు చెందిన గనుల్లో నుంచి, ఓవర్‌బర్డెన్ (అంటే విలువైన ధాతుపదార్థానికి బొగ్గుపొర పైన గాని పేరుకొని ఉండే మట్టి, పలుగురాయి, తదితర వ్యర్థాలు అన్నమాట), టైలింగ్స్ (ముడిధాతువులో నుంచి విలువైన ఖనిజాలను తీసిన అనంతరం మిగిలే వ్యర్థాలు) నుంచి ఈ ఖనిజాలను తిరిగి పొందడం (రికవరీ)పై మిషన్ దృష్టిని కేంద్రీకరిస్తుంది.
క్వార్ట్‌జ్, ఫెల్‌స్పర్, మైకాలను పెగ్మటైట్ కొండల్లో కనుగొనవచ్చు. ఇవి బెరిల్, లిథియమ్, నియోబియమ్, టాంటలమ్, మోలిబ్డెనమ్, తగరం, టైటానియమ్, టంగ్‌స్టన్ వగైరా అనేక కీలక ఖనిజాలకు ముఖ్య ఉత్పత్తి స్థానాలు (సోర్స్) అని చెప్పుకోవాలి. ఈ ఖనిజాలకు వివిధ నూతన టెక్నాలజీలలో, ఇంధన మార్పులో, అంతరిక్ష నౌకలకు సంబంధించిన పరిశ్రమల్లో, ఆరోగ్యసంరక్షణ సేవ రంగం వంటి వాటిలో ముఖ్య పాత్ర ఉంది. క్వార్ట్‌జ్, ఫెల్‌స్పర్, మైకాలను అప్రధాన ఖనిజాల లాగా కౌలుకు ఇస్తారో, కౌలుహక్కులు పొందిన వర్గాలు కీలక ఖనిజాల ఉనికిని గురించిన సమాచారాన్ని అందించకపోవడమో, లేదా వీటితో సంబంధం ఉన్న కీలక ఖనిజాలు ఉదాహరణకు లిథియమ్, బెరిల్ వంటి వాటిని వెలికితీసుకొంటారు. ఎందుకంటే ఈ ఖనిజాలను నిర్మాణం, గాజు, పింగాణీ వస్తువుల తయారీ కోసం ఉపయోగించుకోవాలనేదే ఈ వర్గాల మౌలిక ఉద్దేశంగా ఉంటుంది. ఫలితంగా, ఈ ఖనిజాలతో ముడిపడ్డ కీలక ఖనిజాలు బయటకు రావు, లేదా వాటి ఉనికి గురించి తెలియనైనా తెలియదు.
ఇదే ప్రకారంగా, బరైట్‌ను అనేక పారిశ్రామిక కార్యకలాపాల్లో ఉపయోగించవచ్చు. దీనిని చమురు, వాయు నిక్షేపాలను కనుగొనడానికి ఉద్దేశించిన తవ్వకం పనుల్లో, ఎలక్ట్రానిక్స్, టీవీ తెరలు, రబ్బరు, గాజు, పింగాణీ, రంగు వేయడం, రేడియో ధార్మిక శక్తి నుంచి రక్షణకవచాన్ని ఏర్పరచడం, చికిత్సల్లో వినియోగించవచ్చు. బరైట్‌ను ఆసుపత్రుల్లో. పవర్ ప్లాంటుల్లో, ప్రయోగశాలల్లో ఎక్స్-కిరణాల ఉద్గారాలను అడ్డుకోవడానికి అధిక సాంద్రత కలిగిన కాంక్రీటును తయారు చేయడానికి వాడతారు. బరైట్ తరచు సున్నపురాయి, డోలోస్టోన్ లో కాంక్రీటు, ఫిల్లింగుల రూపంలో లభ్యమవుతుంటుంది. ఇది ఏంటిమనీ, కోబాల్ట్, రాగి, సీసం, మాంగనీస్, వెండి ముడిలోహాలతో కలిసి ఉంటుంది. ఇనుప ధాతువుతోపాటు బరైట్ పాకెట్ ఆకారం కలిగిన నిక్షేపంలా అగుపిస్తుంది. దీనిని విడిగా తవ్వితీయడం వీలుపడదు. వీటిలో నుంచి ఏ ఖనిజాన్నైనా తవ్వితీసే సమయంలో, సంబంధిత ఖనిజంతో కలగలసిన ఖనిజం బయటపడక తప్పదన్నమాట.
ఈ ఖనిజాలకున్న ప్రాముఖ్యాన్ని లెక్కలోకి తీసుకొని, వీటిని అప్రధాన ఖనిజాల జాబితాలో నుంచి తొలగించి ప్రధాన ఖనిజాల జాబితాలోకి చేర్చాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గనులు, ఖనిజాల రంగ అంతర్ మంత్రిత్వ స్థాయి సంఘం సిఫారసు చేసింది. ఒకసారి ప్రధాన ఖనిజాలుగా వర్గీకరణ జరిగిన తరువాత, అనేక కీలక ఖనిజాలకు ముఖ్య ఉత్పత్తిస్థానంగా ఉన్న ఈ ఖనిజాల అన్వేషణతోపాటు శాస్త్రీయ పద్దతిలో గనుల తవ్వకాలను ముమ్మరం చేయడానికి అవకాశాలు ఏర్పడుతాయి.
బరైట్స్, ఫెల్‌స్పర్, మైకా, క్వార్ట్‌జ్ ఖనిజాల పునర్‌వర్గీకరణ ప్రస్తుత కౌలు ఒప్పందాల గడువుపై వ్యతిరేక ప్రభావాన్నేమీ చూపబోదు. ప్రధాన ఖనిజాలుగా ఉన్న ఈ ఖనిజాల కౌలు కాలాలు మంజూరు లభించిన తేదీ నాటి నుంచి లేదా పునరుద్ధరణ కాలమంటూ ఏదైనా ఉంటే అది ముగిసిన నాటి నుంచి.. ఈ రెండిటిలో ఏది తరువాత జరగనుందో ఆ వేళ నుంచి 50 సంవత్సరాలపాటు పొడిగింపునకు - 1957 ఎంఎండీఆర్ చట్టం లోని 8ఎ సెక్షన్ ప్రకారం - నోచుకొంటాయి. ఈ గనులు క్రమ క్రమంగా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ లో నమోదవుతాయి. ప్రధాన ఖనిజాల లాగానే ఇవి కూడా నియంత్రణ పరిధిలోకి చేరుతాయి. మార్పు చోటుచేసుకొనేందుకు మధ్యలో నాలుగు నెలల కాలంపాటు, ఈ ఏడాది జూన్ 30 వరకు, వెసులుబాటునిచ్చారు. ఈ ఖనిజాల గనుల నుంచి వచ్చే రాబడి ఇదివరకటి లాగానే రాష్ట్ర ప్రభుత్వానిదే అవుతుంది.
***
(Release ID: 2105335)
Visitor Counter : 23