బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు దిగుమతుల తగ్గింపు, దేశీయ ఉత్పత్తి పెంపు మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యాలన్న కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి
Posted On:
07 FEB 2025 6:31PM by PIB Hyderabad
బొగ్గు దిగుమతులను తగ్గించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం బొగ్గు మంత్రిత్వశాఖ ప్రధాన లక్ష్యాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బొగ్గు రంగంలో ‘ఆత్మ నిర్భరత’ (స్వయం సమృద్ధి)ని సాధించే మార్గంలో మంత్రిత్వశాఖ ముందడుగులు వేస్తోందన్నారు. బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్, పత్రికా సమాచార కార్యాలయం-పీఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీ బి నారాయణన్, బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి విస్మితా తేజ్, సంయుక్త కార్యదర్శి శ్రీ సంజీవ్ కుమార్ కాస్సీ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
బొగ్గు రంగం దేశ ఇంధన భద్రతకు మూలస్తంభంగా ఉంటూ పారిశ్రామిక, ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదవ-అతిపెద్ద భౌగోళిక బొగ్గు నిల్వలు కలిగి, రెండో-అతిపెద్ద వినియోగదారు హోదా కలిగిన భారత్ లో బొగ్గు అతి కీలకమైన శక్తి వనరుగా ఉంది. జాతీయ ఇంధన అవసరాల్లో 55 శాతాన్ని ఈ రంగమే తీరుస్తోంది. దాదాపు 74 శాతం విద్యుదుత్పత్తి థర్మల్ పవర్ ప్లాంట్ల (టీపీపీల) పై ఆధారపడి ఉంది కనుక బలమైన, స్థిరమైన బొగ్గు రంగం కీలకమని మంత్రి చెప్పారు. మంత్రిత్వశాఖ సాధించిన ప్రగతిని శ్రీ కిషన్ రెడ్డి మీడియాకు వివరించారు.
దిగుమతుల తగ్గింపు, దేశీయ ఉత్పాదన పెంపు
మంత్రిత్వశాఖ చేపట్టిన అనేక ప్రయత్నాల వల్ల బొగ్గు దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. 2024 ఏప్రిల్, నవంబర్ మాసాల మధ్య బొగ్గు దిగుమతులు 5.35 శాతం తగ్గాయి. దాంతో సుమారు 3.91 బిలియన్ డాలర్ల (రూ. 30,007.26 కోట్లు) సొమ్ము ఆదా అయ్యింది. ముఖ్యంగా దేశీయ పవర్ ప్లాంట్ బ్లెండింగ్ కోసం వినియోగించే బొగ్గు దిగుమతులు 23.56 శాతం తగ్గాయి. 2029-30 ఆర్థిక సంవత్సరానికల్లా దేశీయ కోకింగ్ కోల్ ఉత్పత్తిని 140 మెట్రిక్ టన్నులకు పెంచడం, తద్వారా ఉక్కు రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మంత్రిత్వశాఖ చేపట్టిన ‘మిషన్ కోకింగ్ కోల్’ లక్ష్యాలు.
రికార్డు స్థాయి ఉత్పత్తి, విధాన సంస్కరణలు
దేశ బొగ్గు ఉత్పత్తి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 997.82 మిలియన్ టన్నుల ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరం లో 609.18 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, తదుపరి దశాబ్దంలో గణనీయమైన పెరుగుదల నమోదు చేయడంతో 5.64 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటును (సీఏజీఆర్) చూపింది. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే అంతకు మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఉత్పత్తి 11.71 శాతం మేర పెరిగింది.
2020లో వాణిజ్య బొగ్గు గనుల వేలంపాటను ప్రవేశపెట్టడంతో ఒక గొప్ప విధాన సంస్కరణకు ప్రారంభించినట్లయింది. ఈ చర్య ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని, ఆధునిక సాంకేతికతకు ప్రోత్సహాన్నిచ్చింది. జనవరి 2025 నాటికి, బొగ్గు మంత్రిత్వ శాఖ 184 గనుల కేటాయింపు సహా 65 బ్లాకుల్లో మైనింగ్ ప్రారంభ అనుమతులను ఇచ్చింది. ఈ బ్లాకుల నుండి మొత్తం ఉత్పత్తి 136.59 మిలియన్ టన్నులకి చేరుకుంది. అనగా సుమారు సంవత్సరానికి 34.20 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్పాదన 170 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించవచ్చని అంచనా.
బొగ్గు రంగ భాగస్వామ్యం, వృద్ధి
ఎనిమిది ప్రధాన పరిశ్రమలలో, బొగ్గు అత్యధిక వృద్ధి రేటును ప్రదర్శించింది. 2024 డిసెంబర్లో, అంతకు ముందు ఏడాది కన్నా 5.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాక, బొగ్గు రంగం భారతీయ రైల్వేల సరకు రవాణా ఆదాయంలో 50 శాతం వాటాను అందిస్తుంది. దాదాపు 4.78 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాయల్టీలు, జిల్లా ఖనిజాల సంస్థ (డీఎంఎఫ్) విరాళాలు, రాష్ట్ర జీఎస్టీ వసూళ్ల ద్వారా అందిన రూ. 31,281.7 కోట్ల మొత్తంతో, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు ఆదాయాల నుండి గణనీయమైన ప్రయోజనాన్ని పొందాయి.
బొగ్గు సరఫరా వ్యవస్థల బలోపేతం
అంతరాయం లేని బొగ్గు సరఫరా కోసం అంతర్-మంత్రిత్వశాఖల కమిటీ ఏర్పాటు, రైల్వేలు, విద్యుత్ రంగ వాటాదారులతో సమన్వయ సమావేశాలతో సహా పటిష్టమైన సంస్థాగత యంత్రాంగాలు ఏర్పాటయ్యాయి. ఫలితంగా, థర్మల్ పవర్ ప్లాంట్ల వద్ద ఇప్పుడు బొగ్గు నిల్వలు 49 మిలియన్ టన్నులుగా ఉంది—మహాకుంభ్ రవాణా పరిమితుల నేపథ్యంలో కూడా దాదాపు 21 రోజులకు ఈ నిల్వ సరిపోతుంది.
సరఫరా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు మంత్రిత్వశాఖ ఫస్ట్ మైల్ కనెక్టివిటీ (ఎఫ్ఎంసీ) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకు గానూ మొత్తం 386 ఎంటీపీఏ సామర్థ్యంతో 39 ప్రాజెక్ట్‌లను ప్రారంభించింది. అదనంగా, రైలు-సముద్రం-రైలు (ఆర్ఎస్ఆర్) విధానంలో చేపట్టిన యత్నం, 2022 లో 28 మిలియన్ టన్నులుగా ఉన్న బొగ్గు రవాణాను 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 54 మిలియన్ టన్నులకి పెంచగలిగింది.
అనుకూల పద్ధతులు, విస్తరణ దిశగా కృషి
2024లో 2,372 హెక్టార్లలో 54.06 లక్షల మొక్కలు నాటడం సహా బొగ్గు రంగం పెద్ద ఎత్తున అడవుల పెంపకాన్ని చేపట్టింది. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారోద్యమం ద్వారా 11 రాష్ట్రాల్లోని 332 ప్రాంతాల్లో 10 లక్షల మొక్కలను నాటింది.
అదనంగా, గుర్తింపు పొందిన పరిహార అడవుల పెంపకం కోసం 4,695 హెక్టార్ల భూమిని గుర్తించింది. గత ఐదేళ్లలో 1,055 గ్రామాల్లోని 18.63 లక్షల మందికి 18,513 లక్షల కిలో లీటర్ల శుద్ధి చేసిన గని నీటిని అందించింది.
సాంకేతిక పురోగతి, భవిష్యత్తు సంసిద్ధత
2030 నాటికి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో, ‘బొగ్గు గ్యాసిఫికేషన్’, ఇంధన భద్రత కోసం కీలక వ్యూహంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు మద్దతుగా రూ. 8,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ బొగ్గు గనుల భద్రత నివేదిక పోర్టల్, మైన్ క్లోజర్ పోర్టల్ ల ప్రారంభం బాధ్యతాయుతమైన, పారదర్శకమైన మైనింగ్ పద్ధతులకు దోహదపడుతుంది.
ఈ రంగాన్ని మరింత ఆధునీకరించే దిశగా పోటీతత్వంతో కూడిన పారదర్శక మార్కెట్‌ను సృష్టించేందుకు కోల్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటును కూడా మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది.
బాధ్యతాయుతమైన వృద్ధి లక్ష్యం
బొగ్గు రంగ పరివర్తన విధాన-ఆధారిత సంస్కరణలు, సుస్థిర పథకాలు, సాంకేతిక ప్రగతి సోపానాల ద్వారా సాధ్యపడింది. ఇది పర్యావరణం పట్ల బాధ్యతకు ప్రాధాన్యతనిస్తూనే ఇంధన భద్రతకు ప్రాముఖ్యాన్యాన్నిస్తుంది. ఈ ప్రయత్నాల ద్వారా, బొగ్గు ఉత్పత్తి, ఇంధన సరఫరాల్లో దృఢమైన, స్వయం సమృద్ధ, సుస్థిర భవిష్యత్తుకు దేశం బాటలు వేస్తోంది.
బొగ్గు మంత్రిత్వ శాఖ భారతదేశ ఆర్థిక వృద్ధికి, ఇంధన భద్రతకు తోడ్పడే బలమైన, సమర్థవంతమైన, స్థిరమైన బొగ్గు రంగాన్ని తయారు చేసేందుకు కట్టుబడి ఉంది. విధాన సంస్కరణలు, ఉత్పత్తి మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల ద్వారా, మంత్రిత్వ శాఖ స్వావలంబన ఆధారిత పురోగతి దిశగా బొగ్గు పరిశ్రమను నిర్వహిస్తోంది.
***
(Release ID: 2100944)
Visitor Counter : 32