రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొత్తగా ‘రాజమార్గ యాత్ర’, ‘ఎన్ హెచ్ఏఐ వన్’ పథకాలు

Posted On: 06 FEB 2025 6:20PM by PIB Hyderabad

జాతీయ రహదారుల ప్రాజెక్టుల అమలు తీరును మెరుగుపరిచేందుకు, పౌరులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘రాజ్ మార్గ్ యాత్ర’, ‘ఎన్ హెచ్ ఏ ఐ వన్’ పథకాలను ప్రారంభించింది.  

హైవేలపై పౌరులకు మరిన్ని సౌలభ్యాలను అందించేందుకు ‘రాజ్ మార్గ్ యాత్ర’ మొబైల్ యాప్ ను  అభివృద్ధిపరచారు. తాజా సమాచారాన్నీ, ఫిర్యాదుల పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి ఈ యాప్ ను వెబ్ ఆధారిత అప్లికేషన్‌తో అనుసంధానించారు. ఇక ‘ఎన్ హెచ్ఏఐ వన్’ యాప్ హైవే ప్రాజెక్టుల సమర్థవంతమైన నిర్వహణ సహా సకాలంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా వాటి పురోగతిని పర్యవేక్షిస్తుంది. ఈ రెండు యాప్‌లు విభిన్న అవసరాలను తీరుస్తాయి -  ‘రాజమార్గ్  యాత్ర’ ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారిస్తే ‘ఎన్ హెచ్ఏఐ వన్’  హైవే ప్రాజెక్ట్‌ల నిర్వహణను క్రమబద్ధీకరిస్తుంది.  వెరసి ఈ రెండు యాప్ లూ పౌరుల ఫిర్యాదుల పరిష్కారం, ఆన్‌సైట్ ప్రాజెక్ట్ అవసరాలు అనే విభిన్న పద్ధతుల ద్వారా రహదారి రవాణా వ్యవస్థ సామర్థ్య పెంపునకు దోహదపడతాయి.

‘రాజ్ మార్గ్ యాత్ర’ యాప్ రహదారులపై ప్రయాణించేవారికి సమీపంలోని హైవే టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు, ఛార్జింగ్ స్టేషన్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు మొదలైన సౌకర్యాల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. దరిమిలా పౌరులు అనువైన నిర్ణయాలు తీసుకునేందుకు, తమ ప్రయాణాలను సమర్థంగా ప్లాన్ చేసుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతరాయాల ఊసు లేని టోల్ చెల్లింపుల కోసం ఈ యాప్ ను  ఫాస్ట్‌ట్యాగ్ సేవలతో అనుసంధానించారు, అంతేకాక ఈ సేవను అందరికీ అందుబాటులో ఉంచేందుకు సమాచారాన్ని బహుభాషాల్లో అందిస్తున్నారు. సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించేందుకు వేగ పరిమితి హెచ్చరికలు, వాయిస్ సేవల సహాయాన్ని పెంచే దిశగా యాప్ కార్యాచరణను అందిస్తుంది. హైవేల, టోల్ ప్లాజాల నిర్వహణ, గుంతలు, అనధికార ఆక్రమణలు, రాబోయే ముప్పులు మొదలైన వాటికి సంబంధించిన సమస్యలను జియో-ట్యాగింగ్, ఫోటోలు, వీడియోల సాక్ష్యంతో సులభంగా నివేదించేందుకు, ఫిర్యాదుల స్థితిని ట్రాక్ చేసేందుకు, రహదారులకు సంబంధించిన సమస్యల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకు ఈ వేదిక పౌరులకు సాధికారతను కల్పిస్తుంది.

 ‘ఎన్ హెచ్ ఏ ఐ వన్’ మొబైల్ యాప్ ను  ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ - ఎన్ హెచ్ ఏ ఐ’ ఐదు ప్రధాన అంతర్గత కార్యకలాపాల సమ్మేళనంగా భావించవచ్చు.. అవి – ఫీల్డ్ సిబ్బంది హాజరు సంఖ్య, రహదారుల నిర్వహణ , రహదారి భద్రత గణాంకాలు, మరుగుదొడ్ల పరిశుభ్రత, తనిఖీ అభ్యర్థనల (ఆర్ ఎఫ్ ఐ ) ద్వారా రోజువారీ నిర్మాణ ఆడిట్ లు. ‘ఎన్ హెచ్ ఏ ఐ వన్’ యాప్‌ను ఆర్వోలు/పీడీలు, రాయితీదారులు/కాంట్రాక్టర్‌లు, ఏఈలు /ఐఈలు, రోడ్డు భద్రత ఆడిటర్లు, టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్ సూపర్‌వైజర్లు వంటి అంతర్గత భాగస్వాములు ఉపయోగిస్తున్నారు.  ‘ఎన్ హెచ్ ఏ ఐ వన్’ యాప్ ఆన్‌సైట్ ద్వారా నేరుగా వాటాదారులచే హైవే ప్రాజెక్ట్ నిర్వహణను సులభతరం చేస్తుంది. రెండు యాప్‌ల నుంచీ రికార్డ్ చేయబడిన మొత్తం డేటా జియో-ట్యాగింగ్,  టైమ్ స్టాంప్ చేయబడతాయి .

రెండు యాప్‌లు హైవే ప్రయాణికులకు సౌకర్యాన్ని మెరుగుపరచడంలో, జాతీయ రహదారుల ప్రాజెక్టుల అమలు, పర్యవేక్షణలో..  కార్యాచరణ సామర్థ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

గూగుల్ ప్లే స్టోర్‌లో 3,48,632 డౌన్‌లోడ్లు, 12,000 కి పైగా సమీక్షల ఆధారంగా ‘రాజ్ మార్గ్ యాత్ర’ యాప్ 4.4-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్‌లు 74,471 సంఖ్యను చేరుకున్నాయి. ‘ఎన్ హెచ్ ఏ ఐ వన్’ యాప్ గురించి సగటు వ్యక్తుల అభిప్రాయం సానుకూలంగా ఉంది .

కొంతమంది వినియోగదారులు యాప్ లు క్రాష్‌ అవుతున్నట్లు,  లైవ్ డేటా అప్‌డేట్ చేయడంలో జాప్యం జరుగుతున్నట్లూ తమకు ఎదురైన సాంకేతిక సమస్యల గురించి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలను సంబంధిత డెవలప్‌మెంట్ టీమ్‌లు తాజా అప్‌డేట్‌లు, సిస్టమ్ ఆప్టిమైజేషన్ ప్రక్రియల ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాయి.

వినియోగదారుల నుంచీ అందిన స్పందన ఆధారంగా ఈ రెండు యాప్‌లను నిరంతరం మెరుగుపరుస్తున్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టుల అమలును మెరుగుపరిచేందుకు, పౌరులకు మెరుగైన సేవలందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌లను వీటికి జోడిస్తున్నారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈరోజు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 2100562) Visitor Counter : 26


Read this release in: English , Urdu , Hindi