వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రాజెక్ట్ విస్తార్

Posted On: 04 FEB 2025 6:57PM by PIB Hyderabad

అన్ని చోట్లా విశ్వసనీయమైన, చెల్లుబాటయ్యే, అధునాతన వనరులను సమన్వయం చేసుకుంటూ వ్యవసాయం కోసం ఏకీకృతమైన, బహుకేంద్రక డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ విస్తార్ (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సిస్ రిసోర్సెస్) పనిచేస్తుంది. ఇది రైతుల స్పందనను నమోదు చేసి, పరస్పరం సంభాషించుకునే అవకాశం కల్పించేలా డిజిటల్ పరిష్కారాల సామర్థ్యాన్ని, సౌలభ్యాన్ని, సమగ్రతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఐసీఏఆర్ సంస్థలు, రాష్ట్రాల వ్యవసాయ విద్యాలయాల విస్తృత ప్రయత్నాలను సమన్వయం చేయడం ద్వారా కేంద్ర-రాష్ట్రాల భాగస్వామ్యాన్ని ముందుకు నడిపిస్తూ రైతులతో బంధాన్ని బలోపేతం చేస్తుంది. వ్యవసాయ విస్తరణ కోసం బలమైన డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను అభివృద్ధి చేయడానికి విస్తార్ తోడ్పాటు అందిస్తుంది. ఆచరణాత్మకమైన సమాచారాన్ని రైతులకు అందించడం, సహకారాన్ని క్రమబద్ధీకరించడం, డిజిటల్ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు దీర్ఘకాలం కొనసాగేలా చూడడమే దీని లక్ష్యం.

పంటల దిగుబడి, మార్కెటింగ్, ధరలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చరల్ (సీఎస్ఏ) పద్ధతులు, వాతావరణ సూచనలతో సహా అవసరమైన ఇతర సమాచారాన్ని రైతులకు అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విస్తరణ వ్యవస్థ సేవలను డిజిటలైజ్ చేయనున్నారు. అలాగే వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రైతులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం అందిస్తున్న పథకాల సమాచారాన్నిఈ సేవలు అందిస్తాయి.

ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం రాష్ట్రాల సాంకేతిక, అంశం ఆధారిత సమీక్షా సంఘాలను వ్యవస్థలో చేరుస్తారు. అలాగే చిన్నస్థాయిలో నిర్వహించే పైలట్ కార్యక్రమాల ద్వారా పని ప్రారంభిస్తారు.

ప్రస్తుతం విస్తార్ ప్రాజెక్టు అమలుకు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మద్దతు ఇస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి  నిధులు కేటాయించలేదు.

రైతులకు తాజా సమాచారాన్ని అందించేందుకు అన్ని కార్యక్రమాలు, బహుకేంద్రక పరిష్కారాలను ఏకీకృతం చేయడమే విస్తార్ లక్ష్యం. దీనిలో ఏఐ ఆధారిత చాట్‌బాట్లను క్షేత్రస్థాయిలో వినియోగించి అగ్రిస్టాక్‌తో అనుసంధానం చేయడం కూడా భాగంగా ఉన్నాయి.

విస్తార్లో భాగంగా డిజిటల్ బాట్ల వినియోగంపై సమగ్ర శిక్షణ అందిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న భాగస్వామ్యాలు, నెట్వర్క్ వాలంటీర్ల ద్వారా ఫ్రంట్ లైన్ ఎక్స్‌టెన్షన్ వర్కర్ (ఎఫ్ఎల్ఈడబ్ల్యూ)లకు శిక్షణ ఇస్తారు. ఫలితంగా వారిలో వీడియో రూపకల్పన నైపుణ్యాలు మెరుగుపడతాయి. అలాగే అధునాతన ఐటీ సాధనాలను వినియోగించడం ద్వారా క్షేత్రస్థాయిలో అవసరమైన సమాచారం పొందగలుగుతారు. తద్వారా రైతులకు దశలవారీగా శిక్షణ ఇవ్వడానికి వీలవుతుంది.

ప్రజా సంక్షేమార్థం విస్తార్ డీపీఐ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి లాభాపేక్ష లేని ఏక్ స్టెప్ ఫౌండేషన్‌తో అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఇదే ప్రాతిపదికన సమాచార అభివృద్దికి డిజిటల్ గ్రీన్ లాంటి లాభాపేక్ష లేని సంస్థలు విస్తార్‌కు తోడ్పాటు అందిస్తున్నాయి. వ్యవసాయం, రైతు సంక్షేమ విభాగంతో ఐఐటీ మద్రాస్ సైతం ఓ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రైతులకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవసాయ అంకుర సంస్థలతో సమాచారాన్ని పంచుకుంటుంది.

లోక్‌సభలో ఈ రోజు అడిగిన ప్రశ్నకు బదులుగా కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.

***


(Release ID: 2100489) Visitor Counter : 36


Read this release in: English , Urdu , Hindi