వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతులపై గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల ప్రభావం
Posted On:
04 FEB 2025 7:04PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా దేశంలో పర్యావరణ సుస్థిరతను పెంపొందించడానికి వీలుగా విధానపరమైన మార్గనిర్దేశకాలను - వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీసీసీ) అందిస్తుంది. ఎన్ఏపీసీసీ నిర్వహించే జాతీయ కార్యక్రమాల్లో నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ (ఎన్ఎంఎస్ఏ) కూడా ఒకటి. ఇది వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే వ్యూహాలను అమలు చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎన్ఎంఎస్ఏ అనేక పథకాలను ప్రారంభించింది. పెర్ డ్రాప్ మోర్ క్రాప్ (పిడిఎంసి) పథకం - సూక్ష్మ నీటి పారుదల సాంకేతిక పరిజ్ఙానాలైన బిందు సేద్యం, స్ప్రింక్లర్ పరికరాల ద్వారా వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది. దిగుబడి పెంచడానికి, వాతావరణ మార్పులతో ముడి ఉన్న ఇబ్బందులను తగ్గించేలా సమగ్ర వ్యవసాయ విధానంపై వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం దృష్టి సారిస్తుంది. సేంద్రీయ, జీవ ఎరువులతో ద్వితీయ, సూక్ష్మపోషకాలతో సహా రసాయనిక ఎరువులను అవసరమైనంత మేరకే ఉపయోగించడం ద్వారా భూసారాన్ని, దిగుబడి పెంచేలా సమగ్ర భూసార నిర్వహణలో రాష్ట్రాలకు సాయిల్ హెల్త్ అండ్ ఫర్టిలిటీ పథకం తోడ్పడుతుంది. ఉద్యానవన, అటవీ వ్యవసాయం, జాతీయ వెదురు మిషన్‌కు సంబంధించిన సమగ్రాభివృద్ధి కార్యక్రమాలు సైతం వ్యవసాయంలో వాతావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయి. అదే విధంగా ఊహించని ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టానికి గురైన రైతులకు ఆర్థిక సాయం అందించే సమగ్ర బీమా రక్షణను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కల్పిస్తాయి.
వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్), నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ (ఎన్ఐసిఆర్ఎ) అనే ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న ప్రభావాలను తగ్గించేందుకు ఉపశమన కార్యకలాపాలు చేపడతారు. ఈ సాంకేతికతను అమలు చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాల్లో 3 నుంచి 4 గ్రామాలను ఒక క్లస్టర్‌గా పరిగణించి దత్తత తీసుకున్నారు. ఆ జిల్లాలు బాగ్‌పత్, బహ్రైచ్, బందా, బస్తీ, చిత్రకూట్, గోండా, గోరఖ్‌పూర్, హమీర్పూర్, జాలౌన్, ఝాన్సీ, కాన్పూర్ (దెహాత్), కౌశంబీ, ఖుషీ నగర్, మహారాజ్‌గంజ్, ప్రతాప్‌ఘర్, సంత్ రవిదాస్ నగర్, సోనాభద్ర. ఈ జిల్లాల్లో వరి దిగుబడిని పెంచడం, తక్కువ నీటితో వరి సాగు ,నారు అవసరం లేకుండా నేరుగా వరి విత్తనాలను నాటడం, దుక్కి దున్నకుండానే గోధుమ విత్తనాలు విత్తడం, కరువు, ఉష్ణోగ్రతలు లాంటి అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొనే రకాలను పండించడం, వరి సాగులో వ్యర్థాలను ఒకేచోట చేర్చడం లాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకొనేలా సాంకేతికతలను అభివృద్ధి చేసి ఈ జిల్లాల్లో వినియోగిస్తారు. ఈ జిల్లాల్లో వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా వ్యవసాయం చేయడంలో రైతులకు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు కూడా చేపడతారు.
లోక్‌సభలో ఒక ప్రశ్నకు బదులుగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్‌నాథ్ ఠాకూర్ ఈ సమాచారమిచ్చారు.
***
(Release ID: 2100144)
Visitor Counter : 42