వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భూమిలేని రైతుల సంక్షేమం

Posted On: 04 FEB 2025 7:02PM by PIB Hyderabad

భూమిలేని రైతులకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట గణన/ సర్వేనూ మంత్రిత్వ శాఖ నిర్వహించలేదు. కాబట్టి దేశంలోని భూమి లేని రైతులు, యజమానులతో పంట భాగస్వామ్య ప్రాతిపదికన సాగు చేసుకుంటున్న రైతుల కచ్చితమైన సంఖ్య అందుబాటులో లేదు. అయితే, 2015-16 తాజా వ్యవసాయ గణన ప్రకారం దేశంలో పూర్తిగా లీజుకు తీసుకుని సాగుచేస్తున్న కమతాలు/ భూమిలేని రైతుల సంఖ్య 5,31,285.

 

వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం కాబట్టి.. భూమిలేని రైతులు సహా రైతు సంక్షేమానికి సంబంధించిన వ్యవసాయ పథకాలు/ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. కేంద్రప్రభుత్వ/ కేంద్ర ప్రాయోజిత పథకాలు/ కార్యక్రమాల ద్వారా కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సహాయపడుతుంది. వీటితోపాటు.. ముఖ్యంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్ బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (ఆర్ డబ్ల్యూబీసీఐఎస్), కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) పథకాల పరిధిలోకి భూమిలేని, కౌలు రైతులు, పంట భాగస్వామ్య ప్రాతిపదికన సాగు చేసుకుంటున్న రైతులు వస్తారు.

 

కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ) పథకం కింద రైతులకు 7% సబ్సిడీ వడ్డీ రేటుతో కేసీసీ రుణాలు లభిస్తాయి. దీనికోసం సవరించిన వడ్డీ రాయితీ పథకం (ఎంఐఎస్ఎస్) ద్వారా 1.5% ముందస్తు వడ్డీ రాయితీ (ఐఎస్)ని బ్యాంకులకు అందిస్తున్నారు. వెంటవెంటనే రుణాలను తిరిగి చెల్లించే రైతులకు అదనంగా 3% సత్వర చెల్లింపు ప్రోత్సాహకం (పీఆర్ఐ) లభిస్తుంది. తద్వారా వారికి ఏడాదికి నాలుగు శాతం మాత్రమే వడ్డీ రేటు ఉంటుంది. రూ. 3 లక్షల వరకు రుణాలపై ఐఎస్, పీఆర్ఐ పథకాల ప్రయోజనాలు లభిస్తాయి. అనుబంధ కార్యకలాపాల (పంట కోసం కాకుండా) కోసం స్వల్పకాలిక రుణం తీసుకుంటే రుణ మొత్తం రూ. 2 లక్షలకే పరిమితమవుతుంది.

 

2018 జూలై 4 నాటి ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం.. నోటిమాటతో కౌలు చేసుకుంటున్న వారు, పంట భాగస్వాములు, స్వయంసహాయక బృందాలు లేదా రైతుల ఉమ్మడి పూచీ బృందాలకు స్వల్పకాలిక రుణాలను పొందే అర్హత ఉంది. కౌలు రైతులు, పంట భాగస్వాములు ఈ బృందాల పరిధిలోకి వస్తారు.

 

అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఉపశమనం కలిగించేలా.. మొదటి సంవత్సరం బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రాయితీ అందుబాటులో ఉండే మొత్తాన్ని రైతుకు అనుకూలంగా తిరిగి నిర్ణయిస్తారు. రెండో ఏడాది నుంచి వాటికి సాధారణ వడ్డీ రేటు వర్తిస్తుందని ఆర్బీఐ విధానం నిర్దేశిస్తోంది.

 

ఎన్డీఆర్ఎఫ్ సహాయ మంజూరుపై వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన కేంద్ర బృందం (ఐఎంసీటీ), జాతీయ కార్యవర్గ ఉపసంఘం (ఎస్పీ-ఎన్ఈసీ) నివేదిక ఆధారంగా.. తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల బారిన పడిన రైతులకు పునర్వ్యవస్థీకరించిన పంటరుణాలపై కూడా గరిష్టంగా ఐదేళ్ల పాటు వడ్డీ రాయితీ, సత్వర చెల్లింపు ప్రోత్సాహకాన్ని అందిస్తారు.

 

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ లోకసభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 2099991) Visitor Counter : 55


Read this release in: English , Urdu , Hindi