గనుల మంత్రిత్వ శాఖ
కీలకమైన ఖనిజాల రంగంలో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా సౌదీ మంత్రితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ
Posted On:
03 FEB 2025 8:28PM by PIB Hyderabad
సౌదీ అరేబియా పరిశ్రమలు, ఖనిజ వనరుల మంత్రి బండర్ బిన్ ఇబ్రహీం అల్ఖోరాయేఫ్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి రేపు న్యూఢిల్లీలో వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించనున్నారు. కీలకమైన ఖనిజాల రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
తాజాగా జరగనున్న భేటీకి ముందు... రియాద్ లో ఇటీవలే జరిగిన ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ 2025లో భాగంగా జరిగిన మంత్రిత్వ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఇంధన మార్పిడికీ, హరిత ఇంధన వ్యవస్థలకు అవసరమైన కీలక ఖనిజాలను సంరక్షించడంలో భారత్ కనబరుస్తున్న నిబద్దతను కేంద్ర మంత్రి అప్పటి సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే భారత్ లో విస్తరిస్తున్న మైనింగ్ రంగం గురించి తెలుసుకోవాలని పెట్టుబడిదారులను ఆహ్వానించారు. అలాగే ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే దిశగా బ్రెజిల్, ఇటలీ, మొరాకో దేశాల మంత్రులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
ఇటీవలే జరిగిన క్యాబినెట్ సమావేశంలో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ (ఎన్‌సీఎంఎం)కు ఆమోదం లభించిన తర్వాత జరుగనుండటంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. స్థిరమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను ప్రోత్సహించడం, విలువ ఆధారిత వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టడం, సాంకేతిక సహకారాలతో గనుల రంగంలో భారత్–సౌదీ మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై కీలకమైన చర్చలు జరుగుతాయి.
ఖనిజ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాలను పెంచుకొనేందుకు భారత్ అనుసరిస్తున్న చురుకైన విధానాన్ని, సుస్థిర ఖనిజాభివృద్ధిలో దేశం పోషిస్తున్న పాత్రకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ప్రాధాన్యాన్నిఈ వ్యూహాత్మక సమావేశం తెలియజేస్తుంది.
(Release ID: 2099343)
Visitor Counter : 34