రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ. 6.81 లక్షల కోట్లకు పైగా కేటాయింపు; ఇదొక రికార్డు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపు కన్నా 9.53 శాతం ఎక్కువ
సాయుధ దళాల కేపిటల్ బడ్జెట్లో భాగంగా రూ. 1.80 లక్షల కోట్లు కేటాయింపు..
ఆధునికీకరణపైనే ప్రధాన దృష్టి..
దేశీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్ల కోసం రూ. 1.12 లక్షల కోట్లు
రక్షణ శాఖ పింఛన్ల పద్దుకు 14 శాతం అధిక కేటాయింపు..
ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీము (ఈసీహెచ్ఎస్)కు రూ. 8,317 కోట్లు
రక్షణ శాఖ పరిశోధన-అభివృద్ధి బడ్జెట్లో 12 శాతం పెంపు
43 శాతం మేర ఎగసిన భారతీయ తీరరక్షకదళం కేపిటల్ బడ్జెటు..
సరిహద్దు రహదార్ల సంస్థ కు
కేపిటల్ పద్దు కింద రూ. 7,146 కోట్లు
‘2047కల్లా వికసిత్ భారత్ దిశగా పయనించాల’న్న ప్రధానమంత్రి సంకల్పాన్ని
సాధించడంలో కేంద్ర బడ్జెటు ఓ ముందడుగు: రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
Posted On:
01 FEB 2025 3:00PM by PIB Hyderabad
సాంకేతికంగాను, ఆధునికంగాను ఉండే ‘ఆత్మనిర్భర్’ (స్వయంసమృద్ధ) సాయుధ దళాలతో 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ (‘Viksit Bharat @ 2047’)ను సాకారం చేయాలని చెబుతున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా రక్షణ మంత్రిత్వ శాఖకుఆర్థిక సంవత్సరం 2025-26 లో కేంద్ర బడ్జెటులో నుంచి రూ. 6,81,210.27 కోట్లు ఇవ్వనున్నారు. ఈ కేటాయింపు 2024-25 బడ్జెట్ అంచనా కన్నా 9.53 శాతం ఎక్కువగా ఉంది. అంతేకాదు, ఇది కేంద్ర బడ్జెటులో 13.45 శాతం కూడా. ఇంత ఎక్కువ మొత్తంలో మరే మంత్రిత్వ శాఖకూ కేటాయింపులు ఇవ్వలేదు.
ఈ డబ్బులో నుంచి రూ. 1,80,000 కోట్లను, అంటే మొత్తం కేటాయింపుల్లో 26.43 శాతం భాగాన్ని డిఫెన్స్ సర్వీసెస్ మూలధన అవసరాల కోసమే ఖర్చుపెట్టబోతున్నారు. రాబడికి ప్రాధాన్యాన్నిస్తూ సాయుధ దళాల కోసం జరిపిన కేటాయింపులు రూ. 3,11,732.30 కోట్లుగా ఉన్నాయి. ఇది మొత్తం కేటాయింపులో 45.76 శాతం. డిఫెన్స్ పింఛన్లకు రూ. 1,60,795 కోట్లు ఇచ్చారు. ఇది కేటాయింపుల్లో 23.60 శాతం. మిగిలిన రూ. 28,682.97 కోట్లను (ఇది 4.21 శాతంగా లెక్కకు వస్తోంది) రక్షణ శాఖ ఆధీనంలోని సైన్యేతర సంస్థలకు ఉద్దేశించారు. 2025-26ను రక్షణ శాఖ ‘సంస్కరణల సంవత్సరం’గా నిర్వహించాలని నిర్ణయించినందువల్ల బడ్జెటులో పేర్కొన్న కేటాయింపు సాయుధ దళాలను ఆధునికీకరించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బలాన్నివ్వడంతోపాటు శాఖకు కేటాయించిన డబ్బును అత్యంత అనుకూల పద్ధతుల్లో ఉపయోగిస్తూ రక్షణ సంబంధ కొనుగోలు ప్రక్రియను సరళతరం చేయడానికి కూడా తోడ్పడనుంది.
రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ న్యూ ఢిల్లీలో ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ బడ్జెటును సమర్పించినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు. ‘‘ఈ బడ్జెటు యువత, పేదలు, రైతులు, మహిళలతోపాలు సమాజంలో అన్ని ఇతర వర్గాల పురోగమించడానికి దోహదం చేస్తుంది. మధ్యతరగతి ప్రజలందిస్తున్న తోడ్పాటును గుర్తిస్తూ, బడ్జెటు వారికి ఇదివరకు ఎన్నడూ ఎరుగని బహుమతిని ఇచ్చింది’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
మూలధన వ్యయం
ఆధునిక యుద్ధ స్వరూపంలో మార్పులు చోటుచేసుకొంటూ ఉండడాన్ని ప్రపంచదేశాలు గమనిస్తూ వస్తున్న వర్తమాన భౌగోళిక, రాజకీయ నేపథ్యంలో, భారతీయ సాయుధ బలగాలను అత్యంత ఆధునిక ఆయుధాలతో శక్తిమంతంగా మలచాల్సిన అవసరంతోపాటు, సాంకేతికంగా పురోగామిగా ఉంటూ యుద్ధం ఎదురైతే అందుకు సన్నద్ధంగా ఉండేటట్లుగా అన్ని విధాలైన మార్పుచేర్పుల్నీ తీసుకు రావలసిన అవసరం కూడా ఉంది. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, రూ. 1,80,000 కోట్లను రక్షణ బలగాల మూలధన వ్యయంగా కేటాయించారు. ఈ కేటాయింపు 2024-25 బడ్జెట్ అంచనా కన్నా 4.65 శాతం ఎక్కువగా ఉంది.
దీనిలో నుంచి, రూ. 1,48,722.80 కోట్లనున కేపిటల్ అక్విజిషన్ పై ఖర్చుపెట్టాలన్న ఆలోచనలున్నాయి. సాయుధ బలగాల ‘ఆధునికీకరణకు ఉద్దేశించిన బడ్జెటు’నే కేపిటల్ అక్విజిషన్ అని పిలుస్తున్నారు. మిగతా రూ. 31,277.20 కోట్లను పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ)కి, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల రూపేణా ఆస్తుల్ని సమకూర్చుకోవడానికి ఖర్చుపెడతారు.
రక్షణ శాఖ 2020-21లో దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయాలని, బలగాలను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్దాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి నుంచి ‘ఆధునికీకరణకు ఉద్దేశించిన బడ్జెటు’లో గణనీయ భాగాన్ని దేశీయ పరిశ్రమల నుంచి అవసరమైన వస్తూత్పత్తులను కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తూ వస్తున్నారు. రక్షణ శాఖకు కావలసిన పరికరాలను తయారు చేయడానికి, రక్షణ శాఖ సాంకేతిక పురోగతికి దోహదం చేసేలా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడానికి, దేశంలోని ప్రైవేటు రంగ పరిశ్రమల నుంచి మరిన్ని కొనుగోళ్లు చేయడానికి గణనీయ మొత్తాలను ప్రత్యేకించారు. దీనికి అనుగుణంగా, 2025-26కు రూ. 1,11,544.83 కోట్లను అంటే ఆధునికీకరణ బడ్జెటులో 75 శాతం భాగాన్ని దేశీయ సంస్థల నుంచి కొనుగోళ్లకు కేటాయించి, తక్కిన 25 శాతం అంటే రూ. 27,886.21 కోట్లను దేశంలోని ప్రైవేటు పరిశ్రమల నుంచి కొనుగోళ్ల కోసం సర్దుబాటు చేయనున్నారు.
ఈ కేటాయింపు రాబోయే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలనుకుంటున్న ప్రధాన కొనుగోళ్లకు ఉపయోగపడడంతోపాటు సంయుక్తీకరణ, ఏకీకరణ కార్యక్రమానికి తోడ్పడనుంది. ఈ నిధుల కేటాయింపు సైబర్, అంతరిక్షాలతోపాటు కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి కొత్తగా ఉనికిలోకి వచ్చిన రంగాలలోకి అడుగు పెట్టాలన్న రక్షణ మంత్రిత్వ శాఖప్రణాళికలు సఫలమయ్యేందుకు మార్గాన్ని సుగమం చేయనుంది. ఎక్కువ ఎత్తయిన, మధ్య స్థాయి ఎత్తయిన దీర్ఘకాలం పాటు రిమోట్ మాధ్యమం ద్వారా నడిపే విమానం, దశలవారీగా చెల్లింపు పద్ధతిలో డెక్ ఆధారిత విమానం, తదుపరి తరానికి చెందిన జలాంతర్గాములు, నౌకలు, ప్లాట్‌ఫారాల వంటి వచ్చే సంవత్సరం పూర్తిచేయాలనుకుంటున్న కొన్ని ప్రధాన కొనుగోళ్లకు నిధులను ఈ కేటాయింపులో నుంచే అందించనున్నారు. రక్షణ రంగానికి కావలసిన వస్తువుల తయారీ రంగానికి మూలధన రూపేణా పెట్టే పెట్టుబడులతో దేశ ఆర్థిక వ్యవస్థపై విస్తృత స్థాయిలో, అనేక రెట్ల ప్రభావం ప్రసరించి, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి ఊతాన్ని ఇవ్వడమే కాకుండా దేశ యువతీయువకులకు అనేక ఉద్యోగావకాశాలు సైతం అందుబాటులోకి రానున్నాయి.
సాయుధ బలగాలకు నిర్వహణపరమైన సాయాన్ని అందించి, దన్నుగా నిలచే బడ్జెటు
రాబడి వ్యయాన్నిసాయుధ దళాల్లో సేవలందించే వారికి వేతనాన్ని, భత్యాలను చెల్లించడానికి, ఇతరత్రా ఖర్చుల్ని భరించడానికి, నిర్వహణపరమైన సన్నద్ధతకు వినియోగిస్తారు. దీని కోసం రూ. 3,11,732.30 కోట్లను కేటాయించారు. ఇది 2024-25 కు బడ్జెట్ లో కేటాయించిన సొమ్ము కన్నా 10.24 శాతం ఎక్కువ. దీనిలో నుంచి రూ. 1,14,415.50 కోట్లను నాన్-శాలరీ వ్యయం పద్దుకు కేటాయించారు. అంటే ఈ డబ్బును ఆహారపదార్థాలు, ఇంధనం, ఆర్డ్‌నెన్స్ స్టోర్స్ సంబంధిత ఖర్చులు, సామగ్రి నిర్వహణ, మరమ్మతుల కయ్యే ఖర్చులకు ఉపయోగిస్తారన్నమాట.
2022-23లో మధ్య సంవత్సర సమీక్షను చేపట్టినప్పటి నుంచి, సాయుధ దళాల పోషణ, నిర్వహణపరమైన సన్నద్ధతలకు ప్రభుత్వం అధిక మొత్తాన్ని అదే పనిగా కేటాయిస్తూ వస్తోంది. దీనికి తగ్గట్టుగానే, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాతో పోలిస్తే 24.25 శాతం మేర అధిక కేటాయింపులు జరిపారు. ఈ కేటాయింపులు సరిహద్దు ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించడానికి, నౌకలను అద్దెకు తీసుకోవడానికి, నౌకలను సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోహరించడానికి అయ్యే ఖర్చుతోపాటు విమానాలు విన్యాసాల్లో పాల్గొనే సమయం పెరిగే కారణంగా ఎదురయ్యే అవసరాల్ని తీర్చడానికి తోడ్పడనున్నాయి. త్రివిధ దళాల వేతన, భత్యాలతోపాటు సంవత్సరం మధ్యలో నిర్వహించే సమీక్ష సందర్భంగా తలెత్తే ఏ ఇతర అవసరాలకైనా వినియోగించడానికి రూ. 1,97,317.30 కోట్లను రాబడి వ్యయంలోని ‘జీతం పద్దు’ కింద కేటాయించారు.
డీఆర్‌డీఓకు కేటాయింపు పెంపు
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తాన్ని 2024-25 లోని రూ. 23,855.61 కోట్లతో పోలిస్తే పెంచి, 2025-26 కు రూ. 26,816.82 కోట్లుగా పేర్కొన్నారు. ఇది 2024-25 కన్నా 12.41 శాతం ఎక్కువగా ఉంది. దీనిలో నుంచి, రూ. 14,923.82 కోట్ల ప్రధాన భాగాన్ని మూలధన వ్యయానికి , పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డీ) పథకాలకు ఆర్థిక మద్దతును అందించడానికి కేటాయించారు. దీంతో డీఆర్‌డీఓకు మౌలిక పరిశోధన పై విశేష శ్రద్ధ తీసుకోవడం కోసం అభివృద్ధితోపాటు ఉత్పత్తి కి తగిన భాగస్వామిని ఎంచుకొనే పద్ధతిలో ప్రైవేటు సంస్థల సహాయాన్ని పొందుతూ కొత్త కొత్త టెక్నాలజీలకు రూపకల్పన చేయడంలోనూ ఆర్థికంగా దన్ను లభిస్తుంది. డీఆర్‌డీఓకు మూలధనం పద్దుకింద కేటాయింపులు ఎక్కువగా జరపడం వల్ల ఈ సంస్థ ప్రధాన పథకం ‘టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్’ ద్వారా ప్రైవేట్ సంస్థల సహకారంతో ప్రత్యేక ప్రాజెక్టుల్ని కొనసాగించడానికి చాలినన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాక రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధిపరచడానికి అండ కూడా లభించినట్లయింది.
రక్షణ రంగంలో నవకల్పనకు
అంకుర సంస్థలు ప్రధానపాత్రను పోషించే
అనుబంధ విస్తారిత వ్యవస్థకు ప్రోత్సాహం
సాయుధ దళాలను రక్షణ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానంలో స్వయంసమృద్ధంగా మలచాలన్నా, నవకల్పనలను ప్రోత్సహించాలన్నా ఈ విధులలో ప్రైవేటు సంస్థలను కూడా నిమగ్నం అయ్యేటట్టు చూడడంతోపాటు, రక్షణ రంగంలో సాంకేతిక అభివృద్ధి, నవకల్పనలకు గాను దేశంలో అంకుర సంస్థలు ప్రధానపాత్రను పోషించే ఓ విస్తారిత అనుబంధ వ్యవస్థను బలోపేతం చేయడం తప్పనిసరి. ఈ ఉద్దేశంతో, రూ. 449.62 కోట్లను ఐడీఈఎక్స్ పథకానికి, దీని ఉపపథకం అయిన ‘యాక్టింగ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్నొవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడీఈఎక్స్’ (ఎడీఐటీఐ..ADITI)కి కేటాయించారు. ఈ డబ్బును ఈ పథకంలో భాగంగా చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థికసహాయాన్ని అందించడానికి వినియోగిస్తారు. ఈ పద్దుకు కేటాయింపుల్ని రెండేళ్ల కాలంలో దాదాపు మూడు రెట్ల మేర పెంచారు.
మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి...
ఎక్స్-సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీము (ఈసీహెచ్ఎస్)ను ప్రభుత్వం అమలుచేస్తూ, సైన్యానికి దీర్ఘకాలం సేవల్ని అందించి పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సదుపాయాల నిమిత్తం ప్రతిసారీ అధిక మొత్తాల్ని కేటాయిస్తూ వస్తోంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలోనూ, ఈసీహెచ్ఎస్‌కు రూ.8,317 కోట్లను కేటాయించారు. ఇది 2024-25 బడ్జెట్ అంచనా కన్నా 19.38 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మధ్యలో సమీక్షను నిర్వహించిన సందర్బంగా, వైద్య చికిత్సలకు సంబంధించిన వ్యయాలను పెంచాల్సిరావడంతో, కొంత మొత్తాన్ని అదనంగా కేటాయించారు.
రక్షణ రంగ పింఛన్ బడ్జెటులో నుంచి నెల నెలా పింంఛనును దాదాపుగా 34 లక్షల మంది పింఛనుదారులకు అందజేస్తున్నారు. సాయుధ దళాలకు ఉద్దేశించిన డిఫెన్స్ పెన్షనును ఇంకా పెంచే ఉద్దేశంతో, 2014 జులై నుంచి ‘ఒకే ర్యాంకు, ఒకే పింఛను’ ని అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి, దీనిని ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి సవరిస్తూ వస్తున్నారు. ఓఆర్ఓపీలో మూడో సవరణను 2024 జులై నుంచి వర్తింపచేసి, దానిని సకాలంలో అమలుపరిచారు.
రక్షణ రంగ పెన్షన్ పరంగా అవుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకొని, 2025-26కు రూ. 1.61 లక్షల కోట్లను కేటాయించారు. ఇది 2024-25లో కేటాయించిన దానితో పోలిస్తే 13.8 శాతం ఎక్కువ. ధరల పెరుగుదల తీరుతెన్నులను లెక్కలోకి తీసుకుంటూ మాజీ సైనికోద్యోగులు, వారి మీదనే ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులు మెరుగైన జీవనాన్ని గడపడానికి ఈ చర్య తోడ్పడనుంది.
భారతీయ తీర రక్షకదళానికి కేపిటల్ బడ్జెటు
భారతీయ తీరరక్షకదళానికి (ఇండియన్ కోస్ట్ గార్డ్.. ఐసీజీ) కేపిటల్ అండ్ రెవిన్యూ పద్దు కింద రూ. 9,676.70 కోట్లను కేటాయించారు. ఇది 2024-25లో బడ్జెట్ అంచనా దశలో కేటాయించిన దాని కన్నా 26.50 శాతం ఎక్కువగా ఉంది. ఈ కేటాయింపు ఐసీజీ సామర్థ్యాల్ని పెంచి, ఆధునిక సామగ్రిని అందజేయాలని ప్రభుత్వం తీసుకొంటున్న శ్రద్ధకు అనుగుణంగా ఉంది. ఐసీజీ మన కోస్తాతీర భద్రతను పటిష్టపరచడమొక్కటే కాకుండా, అత్యవసర స్థితి ఏర్పడితే పొరుగు దేశాలకు, వాణిజ్య నౌకలకు త్వరితగతిన సహాయాన్ని కూడా అందిస్తోంది.
మూలధన బడ్జెటును 43 శాతం మేర, అంటే 2024-25లో ఇది రూ. 3,500 కోట్లుగా ఉన్న దానిని 2025-26లో రూ. 5,000 కోట్లకు పెంచడంతో అడ్వాన్స్‌డ్ లైట్ హెలీకాప్టర్లు (ఏఎల్‌హెచ్), డార్నియర్ విమానం, ఫాస్ట్ పాట్రల్ వెసల్స్ (ఎఫ్‌పీవీస్) శిక్షణనివ్వడానికి ఉపయోగించే నౌకలు, ఇంటర్‌సెప్టర్ నౌకల వంటివి కొనుగోలు చేయడానికి తగినంత ఆర్థిక సహాయం అందనుంది. రాబడి పద్దు కింద కేటాయింపును 2025-26కు రూ. 4,676.70 కోట్లకు పెంచారు. 2024-25లో ఈ పద్దుకు కేటాయించింది రూ. 4,151.8 కోట్లు మాత్రమే. అంటే ఈ సారి 2025-26లో 12.64 శాతం ఎక్కువ మొత్తాన్ని కేటాయించారన్నమాట. ధరల పెరుగుదల విసిరే సవాలును ఎదుర్కోవడానికి తోడు సిబ్బందిని, వనరులను అదనంగా మోహరించడానికి అయ్యే ఖర్చును భరించడానికి ఈ నిధులను వినియోగించనున్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల్ని పటిష్టపరచడం
సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు సాయుధ బలగాలకు చెందిన జవాన్లు దుర్గమ ప్రాంతాలకు రాక పోకలు జరపడాన్ని సుగమం చేయాలన్న ఉద్దేశాాలతో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)కు రూ. 7,146.50 కోట్లను మూలధన పద్దు లో భాగంగా కేటాయించారు. ఇది 2024-25 బడ్జెట్ అంచనా కన్నా 9.74 శాతం ఎక్కువగా ఉంది. బీఆర్ఓకు 2025-26కు చేసిన ఆర్థిక సర్దుబాటుతో అరుణాచల్ ప్రదేశ్‌లో ఎల్‌జీజీ-డంటెంగ్-యాంగ్సో, జమ్మూ కాశ్మీర్ లో ఆశా-చీమా-అనీతా, అలాగే రాజస్థాన్‌లో బిరథ్‌వాల్-పుగ్గల్-బజ్జూ వంటి సొరంగాలు, వంతెనలు, రహదారుల నిర్మాణాన్ని చేపట్టి సరిహద్దు ప్రాంతాల్లో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు దన్నుగా నిలవడానికి ఆస్కారం ఏర్పడడమే కాకుండా సామాజిక, ఆర్థిక ప్రగతికి కూడా ఊతం లభించనుంది. మరిన్ని ఉద్యోగావకాశాలూ అందుబాటులోకి వస్తాయి. పర్యటన రంగానికి కూడా చాలా ప్రోత్సాహం అంతుతుంది. బీఆర్ఓ ఇప్పటికే 70,000 మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాల్ని ఇచ్చింది. దీర్ఘకాలిక పనిపాటులను కల్పించి, నైపుణ్యాలు వృద్ధి చెందడానికి సహకరించి ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ఉన్నతికి ఈ సంస్థ తోడ్పాటును ఇచ్చింది.
***
(Release ID: 2099076)
Visitor Counter : 8