గనుల మంత్రిత్వ శాఖ
గనుల రంగంలో సంస్కరణలు, ప్రత్యేకించి కీలక ఖనిజాలకు సంబంధించిన సంస్కరణలు వికసిత్ భారత్ 2047 దిశగా పయనించడంలో ఒక ప్రధానమైన అడుగు..
ఈ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్‌ను, భవిష్యత్తు అవసరాలకు దీటుగా నిలిచే భారత్‌ను ఆవిష్కరించగలుగుతాయి: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
ఈ రోజు బడ్జెటులో చేసిన ప్రకటనలు గనుల రంగం వృద్ధికి, ఆధునికీకరణకు మా ప్రభుత్వ కట్టుబాటును కొనసాగించేవే
సమాఖ్యవాదం పోటీతత్వంతో ముందుకు సాగాలన్న స్ఫూర్తికి అనుగుణంగా, రాష్ట్ర మైనింగ్ సూచీని ప్రవేశపెట్టడం రాష్ట్రాల గనుల తవ్వకం విభాగాల్లో వృత్తినైపుణ్యాన్ని పెంపొందించడంలో గణనీయ మార్పుల్ని తీసుకురానుంది
టైలింగ్స్ పాలసీ (గనుల తవ్వకం కార్యకలాపాలలో వెలువడే వ్యర్థాల విధానం) ప్రకటనతో జాతీయ కీలక ఖనిజాల మిషన్ లక్ష్యాలకు మరింత బలం
నాన్ ఫెర్రస్ మెటల్ స్క్రాప్, కీలక ఖనిజాలకు సంబంధించిన తుక్కులు, కోబాల్ట్ పౌడర్, లిథియం-అయాన్ బ్యాటరీ (ఎల్ఐబీ) తుక్కులపై దిగుమతి సుంకాల తొలగింపుతో ప్రయోజనాలు అనేకం
బొగ్గును, లిగ్నైట్‌ను గ్యాస్‌గా మార్చే ప్రక్రియ (గ్యాసిఫికేషన్)కు రూ. 300 కోట్లను కేటాయించడం తక్కువ ఉద్గారాలకు, కార్బన్ కేప్చరుకు, హైడ్రోజన్ ఉత్పత్తికి బాటపరచనుంది
2014కు వెనుకటి కాలంలో అవినీతితో, వ్యాజ్యాలతో ఉక్కిరిబిక్కిరైన భారత గనుల తవ్వకం రం
Posted On:
01 FEB 2025 5:45PM by PIB Hyderabad
‘‘ప్రగతిశీల, దార్శనిక ప్రకటనలతో కేంద్ర బడ్జెటు 2025-26ను తీసుకు వచ్చినందుకు మాన్య ఆర్థిక మంత్రికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ బడ్జెటు ఆరు రంగాలలో గణనీయ మార్పులకు కారణమయ్యే సంస్కరణలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొందని, ఆ రంగాలలో గనుల తవ్వకం రంగం కూడా ఒక ప్రధాన రంగంగా ఉందని గౌరవనీయురాలైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. ఇది ఇంధన వినియోగంలో మార్పు దిశగా పయనించాలని భారత్ గట్టిగా ప్రయత్నిస్తుండడాన్ని, అభివృద్ధి సాధన స్థిర ప్రాతిపదికను సంతరించుకోవాలని, రాబోయే అయిదేళ్ల పాటు ప్రపంచ దేశాలతో భారత్ పోటీపడే తత్వాన్ని బలపరచాలని కూడా సూచిస్తోంది. గనుల తవ్వకం రంగంలో, విశేషించి కీలక ఖనిజాలకు సంబంధించిన సంస్కరణలు ఆత్మనిర్భర్ (స్వయంసమృద్ధ) భారత్, భవిష్యత్తు అవసరాలకు దీటుగా నిలిచే భారత్ దిశగా.. మరొక మాటలో చెప్పాలంటే వికసిత్ భారత్ ను 2047 కల్లా ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించడంలో ఒక ప్రధానమైన అడుగును వేసినట్లు చాటుతున్నాయి.
బొగ్గు, గనుల తవ్వకం రంగంలో వరసబెట్టి అమలులోకి తీసుకు వస్తున్న సంస్కరణల పరంపర దేశీయంగా ఉత్పత్తి స్థాయిని పెంచడంతోపాటు నవకల్పన (ఇన్నొవేషన్)కు కూడా దారి తీస్తుంది. అదే సమయంలో ప్రపంచ ఖనిజాల మార్కట్లో మన దేశాన్ని ఒక కీలక పాత్రధారిగా నిలబెడుతుంది. జాతీయ కీలక ఖనిజాల మిషన్‌ను ప్రారంభించిన కాలంలోనే ఈ సంస్కరణలు తెర మీదకు రావడం వల్ల గొప్ప అండదండలు లభించి, ఈ మిషన్ అమలును వేగవంతం చేయనుంది.
జనాభా అంతకంతకు పెరుగుతున్న, ఆకాంక్షలతో తపిస్తున్న మన దేశ ప్రజానీకం.. ఈ నేపథ్యంలో ఇంధనం కోసం పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రధానంగా బొగ్గు మీదే ఆధారపడుతోంది. ఇంధన భద్రతకు, ఇంధన వినియోగం తీరులో మార్పును ప్రవేశపెట్టాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం.. ఈ రెండిటి మధ్య సమతౌల్యాన్ని సాధించడంపై దృష్టిని కేంద్రీకరించాం. బొగ్గును, లిగ్నైట్‌ను గ్యాస్‌గా మార్చే ప్రక్రియ (గ్యాసిఫికేషన్)కు రూ. 300 కోట్లను కేటాయించడంతో ఉద్గారాలను తక్కువ స్థాయికి పరిమితం చేయడానికి, కార్బన్ క్యాప్చరుకు, హైడ్రోజన్ ఉత్పత్తికి బాట పడుతుంది. ఇది ఇంధన వినియోగ సరళిలో మార్పు దిశగా పయనించాలన్న భారత్ లక్ష్యాలకు , దేశ ఇంధన భద్రతకు పూచీపడడంతోపాటు ‘క్లీన్ కోల్’ను ఉత్పత్తి చేసే దిశలో మన సామర్థ్యాలు పుంజుకోవడానికి కూడా భారీ ఊతాన్ని అందించేదే.
పోటీపడే తత్వంతో కూడిన సమాఖ్యవాద స్ఫూర్తికి అనుగుణంగా, రాష్ట్ర గనుల తవ్వక సూచీ (స్టేట్ మైనింగ్ ఇండెక్స్)ను ప్రవేశపెట్టడం గణనీయ మార్పులకు కారణమవుతుంది. ఇది రాష్ట్రాల గనుల తవ్వకం విభాగాల్లో వృత్తినైపుణ్యాన్ని పెంచుతుంది. ఆ విభాగాలు నవకల్పన (ఇన్నొవేషన్)కు నడుం బిగించడానికి, ఖనిజాల అన్వేషణ, వేలంపాటలు, గనుల తవ్వకాన్ని దీర్ఘకాలిక ప్రాతిపదికన కొనసాగించడం వంటి వాటిలో అత్యుత్తమ పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహిస్తుంది. అంతేకాక, ఈ చర్య సామర్థ్యాన్ని పెంచి, పెట్టుబడులను ఆకర్షించి, మన ఖనిజ వనరులకున్న అపార అవకాశాల్ని వెలికితీస్తుంది కూడా.
టైలింగ్స్ (గనుల తవ్వకం కార్యకలాపాలలో వ్యర్థాలకు సంబంధించిన) పాలసీని ప్రకటించడం కూడా జాతీయ కీలక ఖనిజాల మిషన్ ధ్యేయాలను నెరవేర్చుకొనే దిశలో తోడ్పడే చర్యే. మైనింగ్ టైలింగ్స్ ప్రక్రియలో వెలువడే వ్యర్ధాల నుంచి విలువైన కీలక ఖనిజాలను రాబట్టుకోవడం ద్వారా ఈ విధానం దేశీయంగా వాటి లభ్యతను పెంచుతుంది. తద్వారా స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, రక్షణ, అంతరిక్షం సహా మన వ్యూహాత్మక పరిశ్రమలను బలోపేతం చేస్తుంది. సమర్ధమైన రికవరీ ప్రక్రియల కోసం పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై పెట్టుబడి పెట్టడం వల్ల కీలక ఖనిజాల సరఫరా హారాల విషయంలో భారత్ స్వయంసమృద్ధి సాధన కృషిని పటిష్టపరుస్తుంది.
కిందటి సంవత్సరం బడ్జెటులో గనుల రంగానికి పన్ను రాయితీ చర్యలను ప్రకటించిన దానికి తరువాయిగా- ముఖ్యంగా కీలక ఖనిజాలకు సంబంధించినంతవరకు- ఈ సంవత్సరం బడ్జెటు కూడా అనేక ప్రగతిశీల పన్ను ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. ఈ చర్యలు యావత్తు గనుల తవ్వకం రంగంలో, ముఖ్యంగా భారత్ కీలక ఖనిజాల పరిశ్రమలో తన స్థానాన్ని బలపరచుకోవడం మొదలుపెట్టిన నేపథ్యంలో, పోటీతత్వాన్ని గణనీయంగా పెంచనున్నాయి. నాన్-ఫెర్రస్ మెటల్ స్క్రాప్‌లు, కోబాల్ట్ పౌడరు, లిథియం-అయాన్ బ్యాటరీ (ఎల్ఐబీ) తుక్కులు సహా కీలక ఖనిజాలకు సంబంధించిన తుక్కులపై దిగుమతి సుంకాలను తొలగించడం పెను మార్పులను తీసుకురానుంది. ఈ చర్యలు మన సెకండరీ మెటల్ పరిశ్రమలతోపాటు కీలక ఖనిజాల రీసైక్లింగ్ పరిశ్రమల పోటీపడేతత్వాన్ని పెంపొందించి, ఉత్పత్తి వ్యయాలను తగ్గించి, పురోగామి రీసైక్లింగ్ టెక్నాలజీలలో కొత్తగా పెట్టుబడులను ఆకట్టుకోగలుగుతాయి. ఇది సరఫరా హారం దృఢత్వాన్ని పటిష్టపరుస్తుంది. భారత్‌ను కీలక ఖనిజాల ప్రాసెసింగ్‌లో ఒక గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతుంది.
గత పదేళ్లలో, గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారత మైనింగ్ రంగం ఇదివరకు ఎన్నడూ ఎరుగనన్ని సంస్కరణలకు నోచుకొంది. అవినీతిమయమైన, న్యాయస్థానాలలో వ్యాజ్యాలు పోగుపడిన రంగంగా 2014వరకు ఉంటూ వచ్చిన ఈ రంగం, ఇవాళ బొగ్గు తవ్వకాల పరంగా దీర్ఘకాలం మనుగడ సాగించగలది గాను, కీలక ఖనిజాల విలువ సంబంధిత హారం (వేల్యూ చైన్)లో గ్లోబల్ ప్లేయర్ గాను పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతోంది. ఈ రోజు బడ్జెటులో పొందుపరిచిన ప్రకటనలు బొగ్గు తవ్వకం రంగం ఆధునికీకరణలోనూ, వృద్ధిలోనూ మా ప్రభుత్వం ఒకటే నిబద్ధతతో ఉందన్న విషయాన్ని చాటిచెబుతున్నాయి.
మన దేశ బొగ్గు, గనుల తవ్వకం రంగం ఉపాధికల్పనకు అవకాశం ఉన్న ప్రధాన రంగాలలో ఒకటిగా ఉంది. తాజా సంస్కరణలు గనుల తవ్వకం రంగం పరిధిని మరింతగా పెంచడానికి, కొత్త ఉద్యోగాలను కల్పించడానికి అవకాశాల్నివ్వడంతోపాటు మలితరం టెక్నాలజీ వినియోగానికి అవసరపడే నైపుణ్యాల సాధనకు అనువైన వాతావరణాన్ని ఏర్పరచనుంది.
మనం 2070కల్లా నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించి, ఇంధన వినియోగ సరళిలో మార్పు కోసం యత్నిస్తున్న ప్రపంచ దేశాలలో ముందు వరుసలో నిలబడాలని పాటుపడుతున్న క్రమంలో, గనుల తవ్వకం రంగం ఒక కీలక పాత్రను పోషిస్తుంది. ఈ మార్పునకు దోహదం చేసే కీలక ఖనిజాలను పోగేసుకోవడంలో గనుల తవ్వకం రంగానిదే ముఖ్య పాత్ర. వాతావరణ మార్పు రువ్వే సమస్యలను పరిష్కరించుకోవడం, స్వచ్ఛ ఇంధనం (క్లీన్ ఎనర్జీ) పరిష్కారమార్గాలను ముందుకు తీసుకుపోవడం కోసం దేశీయంగా పక్కా మౌలిక సదుపాయాలను ఏర్పరచాలని భారత్ కృషి చేస్తోంది. ఈ దృక్పథంతోను, గనుల తవ్వకం రంగంలో సంస్కరణలను కొనసాగిస్తూను భారత్ దీర్ఘకాలిక మైనింగ్ లో ఒక గ్లోబల్ ప్లేయర్‌గా ఎదగడంతోపాటు ఇటు మన దేశ ఆర్థిక వ్యవస్థ, అటు ప్రపంచ భవితవ్యాల రూపురేఖలను తీర్చిదిద్దడానికి సన్నద్ధం కానుంది’’ అని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి బడ్జెటు ప్రతిపాదనలపై ప్రతిస్పందించారు.
***
(Release ID: 2098811)
Visitor Counter : 11