రక్షణ మంత్రిత్వ శాఖ
స్క్రాంజెట్ ఇంజిన్ ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించిన డీఆర్డీవో
Posted On:
21 JAN 2025 6:38PM by PIB Hyderabad
ఎక్కువ కాలం మన్నికతో ఉండగలిగేలా సూపర్ సోనిక్ కంబషన్ రామ్ జెట్/ స్క్రాంజెట్ హైపర్ సోనిక్ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన హైదరాబాద్ ప్రయోగశాల (డీఆర్డీఎల్) శ్రీకారం చుట్టింది. ఇటీవల ఈ సాంకేతికతలను అభివృద్ధి చేసిన డీఆర్డీఎల్.. దేశంలో మొదటిసారిగా 120 సెకన్ల పాటు అత్యాధునిక యాక్టివ్ కూల్డ్ స్క్రామ్‌జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్ట్ ను నిర్వహించింది. ఈ ప్రయోగాత్మక పరీక్ష (గ్రౌండ్ టెస్ట్) విజయవంతం కావడం తదుపరి తరం హైపర్ సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుంది.
అధునాతన ఆయుధ తరగతికి చెందిన హైపర్ సోనిక్ క్షిపణులు మాక్ 5 వేగంతో.. లేదా గంటకు 5,400 కిలోమీటర్లకు మించిన వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. ప్రస్తుత వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించి.. వేగంగా, ప్రభావవంతంగా దాడులు చేయగల సామర్థ్యంతో ఈ అధునాతన ఆయుధాలను రూపొందిస్తున్నారు. అమెరికా, రష్యా, భారత్, చైనా సహా అనేక దేశాలు హైపర్ సోనిక్ సాంకేతికతను చురుగ్గా అనుసరిస్తున్నాయి. హైపర్ సోనిక్ వాహనాలకు స్క్రాంజెట్లు కీలకమైనవి. అవి గాలి నుంచి ఆక్సిజనును ఉపయోగించి ఇంధనాన్ని మండిస్తాయి (ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్లు). ధ్వనివేగాన్ని మించిన వేగంతో ఉన్న సమయాల్లో ఎటువంటి కదిలే భాగాలనూ ఉపయోగించకుండా దహనానికి అంతరాయం కలగకుండా నిలపగల సమర్థత వీటికి ఉంది.
హైపర్ సోనిక్ వాహనాల్లో మండించడానికి, అంతరాయం కలగకుండా ఇంధన దహనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడడంలో స్క్రాంజెట్ దాహక సామర్థ్యాన్ని ఈ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతంగా చాటింది. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌లో జ్వలన ప్రక్రియ ‘తుఫానులో కొవ్వొత్తిని వెలిగించడం’ వంటిది. స్క్రామ్‌జెట్ దాహకంలో ఒక వినూత్న జ్వాల స్థిరీకరణ సాంకేతికతను పొందుపరిచారు. ఇది సెకనుకు 1.5 కిలోమీటర్ల వాయు వేగం వద్దా దాహకం లోపల జ్వాలను నిలిపి ఉంచుతుంది. స్క్రాంజెట్ ఇంధన దాహక కాన్ఫిగరేషన్ ను రూపొందించడం కోసం అనేక ప్రయోగాత్మక పరీక్షల ద్వారా అనేక అధునాతన దహన - జ్వాలను నిలిపి ఉంచే పద్ధతులను అధ్యయనం చేశారు. అధునాతన కంప్యుటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ (సీఎఫ్ డీ) సాధనాలను ఉపయోగించి వాటి పనితీరును మదించి, అంచనావేశారు.
డీఆర్డీఎల్, పరిశ్రమ కలిసి ఉష్ణ గ్రాహక స్క్రాంజెట్ ఇంధనాన్ని తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేయడమే ఈ పురోగతికి మూలం. శీతలీకరణను గణనీయంగా మెరుగుపరచడంతోపాటు జ్వలన సౌలభ్యాన్నీ అందించడం ద్వారా ఇంధనం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. పారిశ్రామిక స్థాయిలో డీఆర్డీఎల్ భారీ ఇంధన అవసరాలను నెరవేర్చడానికి ఈ బృందం ఒక ప్రత్యేక తయారీ ప్రక్రియను అభివృద్ధి చేసింది.
అత్యాధునిక ఉష్ణ రోధక లేపన (థర్మల్ బ్యారియర్ కోటింగ్ - టీబీసీ) సాంకేతికతను అభివృద్ధి చేయడం మరో కీలక విజయం. ధ్వనివేగాన్ని మించిన వేగంతో ఎగురుతున్న సమయంలో ఎదురయ్యే అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా దీనిని రూపొందించారు. ఎక్కువ ఉష్ణ నిరోధకతతోపాటు ఉక్కు ద్రవీభవన స్థాయిని దాటి కూడా పనిచేసే సామర్థ్యం గల ఒక అధునాతన సిరామిక్ టీబీసీని డీఆర్డీఎల్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోగశాల సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రత్యేక నిక్షేపణ పద్ధతులను ఉపయోగించి స్క్రామ్‌జెట్ ఇంజిన్ లోపల ఈ పూతను వేస్తారు. ఇది వాటి పనితీరును మెరుగుపరచడమే కాకుండా, ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది. దహన ప్రక్రియ కొనసాగింపు, మెరుగైన పనితీరు, అత్యాధునిక ఉష్ణ నిర్వహణల్లో సామర్థ్యాలను చాటిన ఈ పురోగతి తదుపరి తరం హైపర్ సోనిక్ క్షిపణులకు వేదికవుతుంది.
స్క్రాంజెట్ ఇంజిన్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్డీవోను, పరిశ్రమను రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అభినందించారు. “తదుపరి తరం హైపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో ఈ విజయం కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.
అంతరాయం లేకుండా దహనం, మెరుగైన పనితీరు, అధునాతన ఉష్ణ నిర్వహణ పరీక్షను సమర్థవంతంగా నిర్వహించిన డీఆర్డీఎల్ బృందానికి, పరిశ్రమకు రక్షణ పరిశోధన - అభివృద్ధి కార్యదర్శి, డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వీ కామత్ శుభాకాంక్షలు తెలిపారు.
***
(Release ID: 2095001)
Visitor Counter : 14