సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుల కోసం వెబ్ పోర్టల్ ప్రారంభం


2024లో పరిపాలనలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుల ద్వారా గుర్తించడమే లక్ష్యం, మూడు విభాగాల్లో16 పురస్కారాల ప్రదానం

విభాగాలు, పురస్కారాల వివరాలు: విభాగం1: 11 ప్రాధాన్యతా రంగాలకు చెందిన కార్యక్రమాల ద్వారా జిల్లాల సమగ్రాభివృద్ధి (05 పురస్కారాలు); విభాగం 2: ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమం (05 అవార్డులు); విభాగం 3: కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు, జిల్లాల్లో ఆవిష్కరణలు (06 పురస్కారాలు)

ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమానికి ప్రోత్సాహం: మొదటిసారిగా ఆకాంక్షాత్మక బ్లాకుల కార్యక్రమాన్ని పీఎం అవార్డుల పథకంలో చేర్చారు, ఇది ఆ జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది

సంబంధిత ఆవిష్కరణల విభాగంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు పాల్గొంటాయి

ప్రధానమంత్రి పురస్కారం 2024 గ్రహీతలకు రూ.20 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహం

Posted On: 20 JAN 2025 6:50PM by PIB Hyderabad

ప్రభుత్వ పాలన 2024లో ఉత్తమ పనితీరు కనబరిచిన వారి సేవలకు గుర్తింపుగా అందించే ప్రధానమంత్రి పురస్కారాల పథకం, వెబ్ పోర్టల్ (http://www.pmawards.gov.in)ను జనవరి 20 మధ్యాహ్నం 3 గం.లకు పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారికంగా ప్రారంభించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాల అధికారులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు (పాలనా సంస్కరణలు/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), జిల్లా కలెక్టర్/జిల్లా మెజిస్ట్రేట్ (డీసీ/డీఎం)లు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి పురస్కారాలకు వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్లు జనవరి 20 నుంచి ప్రారంభమవుతాయి. జనవరి 27 నుంచి మొదలయ్యే నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ఫిబ్రవరి 14న ముగుస్తుంది.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో పీఎం ఎక్సలెన్స్ పురస్కారాల భావనలో, విధానంలో 2014 నుంచి విప్లవాత్మకమైన రీతిలో మార్పులు తీసుకువస్తున్నారు. నిర్మాణాత్మక పోటీ, ఆవిష్కరణలను, ఉత్తమ పద్దతులను స్వీకరించి సంస్థాగతంగా వాటి అమలును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఈ విధానం ద్వారా నిర్దేశిత లక్ష్యాల సాధనకు మాత్రమే పరిమితం కాకుండా సుపరిపాలన, గుణాత్మక ప్రగతి, చిట్టచివరి వ్యక్తి వరకు చేరుకోవడానికి సైతం ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఏడాది కూడా ఈ సమగ్రాభివృద్ధి విభాగంలో వ్యక్తిగత లబ్ధిదారులు, సంతృప్తికరమైన విధానంలో పథకాల అమలు ద్వారా జిల్లా కలెక్టర్ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. దీని ఆధారంగానే సుపరిపాలన, నాణ్యత, పరిమాణం అనే మూడు ప్రామాణికాలకు అనుగుణంగా అవార్డు కోసం వచ్చిన దరఖాస్తుల మూల్యాంకనం జరుగుతుంది.

అత్యుత్తమ ప్రభుత్వ పరిపాలన 2024 ప్రధానమంత్రి పురస్కారానికి అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఆకాంక్షాత్మక బ్లాకులు ఉన్న జిల్లాలు ఆకాంక్షాత్మక బ్లాకు కార్యక్రమం విభాగంలో పాల్గొంటాయి. దేశవ్యాప్తంగా 329 జిల్లాల్లో 500 ఆకాంక్షాత్మక బ్లాకులు ఉన్నాయి.

ఏప్రిల్ 1, 2022 నుంచి డిసెంబర్ 31, 2024 వరకు పరిశీలనా వ్యవధిగా నిర్దేశించారు. ప్రభుత్వ పరిపాలన 2024కి గాను అందించే ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డుల మొత్తం సంఖ్య 16.

(i) స్క్రీనింగ్ కమిటీ (మొదటి, రెండో దశ) (ii) నిపుణుల కమిటీ (iii) సాధికారత కమిటీల ద్వారా మూల్యాంకనం చేసి జిల్లాలు/సంస్థలను అవార్డులకు ఎంపిక చేస్తారు. సాధికార కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులను ప్రధామంత్రి ఆమోదిస్తారు.

ప్రధానమంత్రి పురస్కార గ్రహీతలకు (i) జ్ఞాపిక, (ii) ప్రశంసాపత్రం (iii) రూ. 20 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఈ నగదును జిల్లా/సంస్థల్లో ప్రాజెక్టులు/కార్యక్రమాల అమలుకు లేదా ప్రజా సంక్షేమం విభాగంలో ఉన్న వనరుల అంతరాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు.


 

****


(Release ID: 2094810) Visitor Counter : 16