జల శక్తి మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025: గంగానది పరిశుభ్రత.. పరిరక్షణపై డిజిటల్ ప్రదర్శనతో ప్రధాన ఆకర్షణగా నమామి గంగే పెవిలియన్
గంగా పరిరక్షణ సందేశాన్ని కళ్లకుకట్టే స్వీయానుభవ జీవవైవిధ్య సొరంగం
Posted On:
17 JAN 2025 9:21PM by PIB Hyderabad
ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్-2025 నిర్వహణలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నమామి గంగే పెవిలియన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో నిర్వహిస్తున్న డిజిటల్ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గంగా నది పరిశుభ్రత, పరిరక్షణపై అవగాహన పెంచడంలో ఈ పెవిలియన్ ఒక విశిష్ట మాధ్యమంగా మారింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక ప్రదర్శనలు, సమాచారంతో కూడిన వివిధ అంశాలతో అన్ని వయోవర్గాల ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోంది.
ప్రధాన ఆకర్షణ: స్వీయానుభవ జీవవైవిధ్య సొరంగం
ఈ పెవిలియన్‌లో ప్రవేశించే సందర్శకులు తొలుత స్వీయానుభవ జీవవైవిధ్య సొరంగం గుండా సాగుతారు. ఇందులో ఆధునిక ప్రొజెక్షన్ సాంకేతిక సాయంతో గంగా నదీతీరాన విహరించే పక్షిజాతుల జీవవైవిధ్యం, వాటి కిలకిలరావాలు కళ్లకు కడతాయి. పర్యావరణ సౌందర్యాన్ని ప్రముఖంగా చూపడంతోపాటు గంగానదిని పరిశుభ్రంగా, సకల ప్రాణి జీవనాధారంగా నిలపడంలోగల ప్రాధాన్యాన్ని కూడా ఈ సొరంగ ప్రదర్శన వివరిస్తుంది. ఈ మేరకు గంగా నది పరిశుభ్రత, పరిరక్షణ చేపట్టిన ఇప్పటిదాకా సాగిన వివిధ రకాల కృషిని వివరిస్తూ డిజిటల్ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
ఈ ప్రదర్శన ముఖ్యాంశాలలో ప్రయాగ్ మంచ్ (ప్రయాగ వేదిక) ఒకటి. గంగా, యమున సహా వాటి ఉపనదుల ప్రత్యక్ష విశ్లేషణ దిశగా దీన్ని రూపొందించారు. ఆయా నదుల నీటిమట్టాలు, పరిశుభ్రత, కాలుష్య స్థితిగతులపై సమాచారాన్ని ఈ వేదిక ప్రదర్శిస్తుంది. గంగా నది వెంబడిగల తీర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా ఈ పెవిలియన్‌లో వివరాలు లభిస్తాయి. ముఖ్యంగా గంగా నదిలో ప్రవహించే నీటిని శుభ్రం చేయడానికి ఉద్దేశించిన మురుగు శుద్ధి కర్మాగారాల నిర్మాణం-పనితీరును ప్రదర్శిస్తుంది. అలాగే పరిశుభ్రత-జల సంరక్షణ సందేశ వ్యాప్తి లక్ష్యంగా గంగానది స్వచ్ఛత, పరిశుభ్రత సందేశాన్నిస్తూ ఏర్పాటు చేసిన సుందరమైన గణేశ విగ్రహం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
గంగా నదిలో కనిపించే డాల్ఫిన్లు, తాబేళ్లు, మొసళ్ళు సహా వివిధ జలచరాల ప్రతిరూపాలను ఈ పెవిలియన్‌లో ఏర్పాటు చేశారు. అలాగే గంగా నదిలోని మత్స్యజాతుల రూపాలు, వివరాలు కూడా ప్రదర్శిస్తున్నారు. ఇది ముఖ్యంగా బాలలు, యువతలో అవగాహన పెంపు లక్ష్యంగా ఏర్పాటైన ప్రదర్శన. తద్వారా నది ఆధారిత జీవవైవిధ్యం, దాని పరిరక్షణ ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవడంలో వారికిది తోడ్పడుతుంది.
ఈ ప్రదర్శనలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్బిటి) సందర్శకుల కోసం వివిధ పుస్తకాలతో ప్రత్యేక పఠన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రదర్శిస్తున్న గంగానది సంబంధిత పుస్తకాలు కుంభమేళా గాథ, సామాజిక విధివిధానాలు, జాతీయ ప్రతిష్ఠ గురించి వివరిస్తాయి. పుస్తక ప్రియులతోపాటు గంగా నది సాంస్కృతిక-చారిత్రక విశేషాలపై ఆసక్తిగల సందర్శకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది.
అంతరిస్తున్న జీవజాతుల పరిరక్షణ, ప్రజా చైతన్యం, వ్యర్థాల నిర్వహణ సంబంధిత వివరాలు కూడా ఈ పెవిలియన్‌లో ఉంచారు. వైల్డ్లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గంగా టాస్క్ ఫోర్స్, ఐఐటి-ఢిల్లీ సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి. గంగా నది ప్రాధాన్యం, దాని పరిశుభ్రత దిశగా సాగుతున్న కృషిని ప్రజలకు వివరించడమే ఈ ప్రదర్శన లక్ష్యం.
ఈ పెవిలియన్ గంగానది జీవవైవిధ్యం, పరిశుభ్రతల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా భావోద్వేగపరంగా, సాంస్కృతికంగానూ నదీమాతతో వారిని మమేకం చేస్తుంది. ఈ మేరకు ఆధునిక సాంకేతికత, సృజనాత్మకతల మేళవింపుతో ఈ పెవిలియన్ మహాకుంభ్-2025 ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తోంది.
గంగానది పరిశుభ్రత, పరిరక్షణ ప్రాధాన్యంపై అవగాహన పెంచుకోవాల్సిందిగా మహాకుంభ్-2025 సందర్భంగా నిర్వహిస్తున్న నమామి గంగే మిషన్ సందర్శకులకు సూచిస్తోంది. గంగ అంటే కేవలం ఒక నది కాదు... భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆర్థిక జీవనంలో అదొక అంతర్భాగం. ఈ జీవనదిని పరిశుభ్రంగా ఉంచడం, పరిరక్షించడం ప్రతి పౌరుడి కర్తవ్యం.
(Release ID: 2094118)
Visitor Counter : 5