రక్షణ మంత్రిత్వ శాఖ
నేడు 77వ సైనిక దినోత్సవం సందర్భంగా రక్షణ దళాల ప్రధానాధికారి శుభాకాంక్షలు భారతీయ సైన్యం గొప్ప సేవాతత్పరతతో, అకుంఠిత దీక్షతో దేశ నిర్మాణానికి సహాయపడుతోందంటూ ప్రశంస
Posted On:
15 JAN 2025 10:52AM by PIB Hyderabad
నేడు 77వ సైనిక దినోత్సవం సందర్భంగా రక్షణ దళాల ప్రధానాధికారి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ భారత సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఒక సందేశాన్నిస్తూ.. మన సైనికుల్లోని అంకితభావం, వారి ధైర్య సాహసాలూ, ఓటమి అంటే ఏమిటో తెలియని వారి స్వభావాన్నీ, చిత్తశుద్ధినీ గుర్తుచేసుకొంటూ వేడుకగా జరుపుకొనే రోజు అనీ, మన దేశ భద్రతకూ, ఐక్యతకు భారతీయ సైన్యం మూలస్తంభంగా నిలుస్తోందనీ అన్నారు.
ఎన్ని సవాళ్లెదురైనా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ, దేశ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయగలిగిన శక్తిసామర్థ్యాలు భారతీయ సైన్యానికి వారసత్వంగా లభించాయని జనరల్ అనిల్ చౌహాన్ అభివర్ణించారు. ‘‘మన సైనికుల నిరంతర దృఢ ప్రయత్నాల వల్లే మన సైన్యం అప్రమత్తంగా ఉంటూ, అన్ని విధాలైన సైనిక కార్యకలాపాల్లో రాణిస్తూ, ఎప్పటికీ దేశ పౌరుల రక్షణకూ, వారి క్షేమానికీ పూచీపడుతోంది. ఇది ఎంతైనా అభినందనీయం’’ అని ఆయన అన్నారు.
శత్రువులతో యుద్ధంలో అనుసరించాల్సిన పద్ధతులు రోజురోజుకూ వేగంగా మారుతున్నాయనీ, కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవడం పెరుగుతోందనీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. ఆధునిక యుద్ధ వ్యూహాల రూపురేఖలను చాలా వేగంగా మార్చేస్తున్నారనీ, టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతుండడమే దీనికి కారణమన్నారు. దీంతో భౌగోళిక-రాజకీయ స్థితిగతులు కూడా మార్పులకు లోనవుతున్నాయని అన్నారు. సైబర్ ప్రపంచం, అంతరిక్షంలతోపాటు మనిషి మేధస్సు వికసిస్తుండడం అనేక కొత్త రంగాల్లో వివిధ దేశాల మధ్య శత్రుత్వ భావన చోటు చేసుకుంటున్నదని ఆయన వివరించారు. ‘‘కొత్త తరం టెక్నాలజీలు, కృత్రిమ మేధస్సు డేటాను బలమైన ఆయుధంగా వాడుకోవడం, యుద్ధతంత్రాలను అవతలిపక్షం ఊహకు అందకుండా అత్యంత దూకుడుగా మార్చుకోవడం, శబ్ద వేగాని కన్నా 5 రెట్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే తరహా సాంకేతికతలతో దాడులు చేయడం, రోబోటిక్స్ వంటి నూతన శాస్త్రవిజ్ఞానం ఆధారంగా భవిష్యత్తులో యుద్ధాలు ఊహకందని విధంగా ఉంటాయి’’ అని కూడా ఆయన ఒక హెచ్చరికగా చెప్పారు.
రానున్న కాలంలో యుద్ధాలు గతంలో మాదిరిగా ఉండవనీ, ఎలాగైనా గెలవాలనేదే ఏ సైన్యానికైనా లక్ష్యంగా ఉంటుందని జనరల్ అనిల్ చౌహాన్ ప్రస్తావించారు. భారతీయ సైన్యం తన ప్రత్యర్థి పక్షాల కన్నా ఒక అడుగు ముందుండడానికి సాంకేతికంగా తన శక్తియుక్తులకు పదును పెట్టుకోవడంతోపాటు ఎత్తుగడల్లో, సాంకేతిక విజ్ఞానంలో, విధానాల్లో ఉన్నత స్థితిలో నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సిబ్బందికి ఉన్నత సాంకేతిక సామర్థ్యాన్ని సమకూర్చడంతోపాటు ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీలో వారిని నిపుణులుగా తీర్చిదిద్దడం ఎంతైనా అవసరమంటూ పిలుపునిచ్చారు.
కర్తవ్య నిర్వహణ పథంలో ప్రాణత్యాగాలు చేసిన ధీర శూర సైనికులకు సీడీఎస్ నివాళులు అర్పించారు.
‘‘ఈ ప్రత్యేక రోజును మనం పాటించుకొంటున్న సందర్భంలో, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృఢనిశ్చయంతో, సగర్వంగా ఎదుర్కొని, సైన్యానికున్న గొప్ప సంప్రదాయాల్ని నేను కాపాడతాను అంటూ సైన్యంలో ప్రతి ఒక్కరూ సంకల్పం చెప్పుకొని తీరాలి. మాతృభూమికి మన సైన్యం ఘన విజయాల్నీ, కీర్తినీ సంపాదించిపెడుతూ, అలసట లేకుండా దేశ నిర్మాణానికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను’’ అని జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.
***
(Release ID: 2093188)
Visitor Counter : 7