మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
జంతు సంరక్షణ ప్రతినిధుల శిక్షణకై భారత పశు సంరక్షణ బోర్డు, నల్సార్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం
దేశవ్యాప్తంగా ‘‘బాధ్యతాయుతమైన జంతు సంరక్షణ’’ సంస్కృతిని ప్రోత్సహించేందుకు కొత్త శిక్షణ కార్యక్రమం
జనవరి 14 నుంచి 30 వరకు పశు సంక్షేమ పక్షోత్సవాలను నిర్వహించనున్న ఏడబ్ల్యూబీఐ
Posted On:
09 JAN 2025 4:47PM by PIB Hyderabad
పశుసంవర్థక, పాడిపరిశ్రమ విభాగంలోని చట్టబద్ధ సంస్థ అయిన భారత పశు సంరక్షణ బోర్డు (ఏడబ్ల్యూబీఐ), మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ రోజు హైదారాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై ఏడబ్ల్యూబీఐ ఛైర్మన్ డాక్టర్ అభిజిత్ మిత్ర, నల్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీకృష్ణ దేవరావు సంతకాలు చేశారు.
జిల్లా జంతు హింస నివారణా సంఘాలు (ఎస్పీసీఏ), రాష్ట్ర పశు సంరక్షణ బోర్డులు పశు సంక్షేమానికి చేస్తున్న కార్యక్రమాలకు మద్దతిస్తున్న వారికి నాణ్యమైన న్యాయ నైపుణ్య శిక్షణ అందించే వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఈ అధికారిక ఒప్పందం కుదిరింది. ఏడబ్ల్యూబీఐ, హైదరాబాద్ లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా ఆనరరీ యానిమల్ వెల్ఫేర్ రిప్రజెంటేటివ్ - గౌరవ పశు సంరక్షణ ప్రతినిధి (హెచ్ఏడబ్ల్యూఆర్) దరఖాస్తుదారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. దీనిలో భాగంగా జంతు సంరక్షణ చట్టాలు, విధానాలు, పరిశోధన మెలకువలు, సంబంధిత ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు. బృందాల వారీగా అందించే ఈ శిక్షణలో ఒక్కో సెషన్లో గరిష్టంగా 25 మంది చొప్పున పాల్గొంటారు. కనీసం మూడు రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి, నల్సార్ నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఆనరరీ యానిమల్ వెల్ఫేర్ రిప్రజెంటేటివ్ (హెచ్ఏడబ్ల్యూఆర్) సర్టిఫికేట్లను ఏడబ్ల్యూబీఐ అందిస్తుంది. శిక్షణాంశాలకు సంబంధించిన మేధోహక్కులు పూర్తిగా నల్సార్ విశ్వవిద్యాలయానికే చెందుతాయి. ఈ అంశాలను హెచ్ఏడబ్ల్యూఆర్ శిక్షణ కోసం ఉపయోగించుకొనే ప్రత్యేక హక్కులు ఏడబ్ల్యూబీఐకి ఉన్నాయి. ఏడబ్ల్యూబీఐ, నల్సార్ మధ్య కుదిరిన భాగస్వామ్య ఒప్పందం దేశంలో పశు సంక్షేమంలో న్యాయవ్యవస్థను సుసంపన్నం చేసే దిశగా వేసిన ముందడుగును సూచిస్తుంది.
హైదరాబాద్లోని నేషనల్ యానిమల్ రీసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ (ఎన్ఏఆర్ఎఫ్‌బీఆర్)లో ఏడబ్ల్యూబీఐ ఈ రోజు 53 వ సాధారణ సమావేశాన్ని నిర్వహించింది. దేశంలో పశు సంక్షేమాన్ని ప్రోత్సహించడంతో సహా వివిధ సంస్థాగత అంశాలపై చర్చించారు. జనవరి 14 నుంచి 30 వరకు పశు సంక్షేమ పక్షోత్సవాలను దేశవ్యాప్తంగా ఏడబ్ల్యూబీఐ నిర్వహిస్తుంది. జీవ వైవిధ్యం, పర్యావరణ వ్యవస్థలో జంతువులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను ఈ కార్యక్రమం తెలియజేస్తుంది.
జంతు సంరక్షణ ప్రతినిధుల గురించి
జంతు సంక్షేమం కోసం అంకితమైన పౌర సమాజంలోని ముఖ్యమైన సభ్యులే ఈ గౌరవ జంతు సంరక్షణ ప్రతినిధులు (హెచ్ఏడబ్ల్యూఆర్). పశువులకు అయిన గాయాలు, వాటితో అధిక బరువులను మోయించడం, అమానుషంగా ప్రవర్తించడం లాంటి జంతు హింసకు సంబంధించిన అంశాలపై వారు పనిచేస్తారు. అలాగే వాటికి ప్రథమ చికిత్సను అందించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, చట్టాలకు లోబడి పశువుల రవాణా జరిగేలా చూస్తారు. పశువులకు ఆవాసాలను ఏర్పాటు చేయడానికి, ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ కార్యక్రమాలు చేపట్టడానికి, జంతువులను హింసించే క్రీడలను నిలువరించడానికి ప్రాంతీయ యంత్రాంగంతో కలసి హెచ్ఏడబ్ల్యూఆర్‌లు పని చేస్తారు. వారు చేస్తున్న ప్రయత్నాలు దేశవ్యాప్తంగా పశువుల పరిస్థితిలో మార్పులు తీసుకువస్తాయి. అలాగే కరుణతో నిండిన, బాధ్యాయుతమైన జంతు సంరక్షణా సంస్కృతిని ప్రోత్సహిస్తాయి.
ఏడబ్ల్యూబీఐ, పీసీఏ చట్టం 1960 గురించి
జంతువులపై క్రూరత్వ నిషేధ (పీసీఏ) చట్టం-1960 సెక్షన్ 4 ప్రకారం ఏడబ్ల్యూబీఐను ఏర్పాటు చేశారు. జంతు సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ, హింస నుంచి వాటిని కాపాడేందుకే ఇది ఏర్పాటయింది. దేశవ్యాప్తంగా జంతువులపై హింసను నిరోధించడం, పెంపుడు, అటవీ జంతువులను సంరక్షించడమే లక్ష్యంగా పీసీఏ చట్టం-1960 పనిచేస్తుంది. రవాణా, ప్రయోగాలు, ప్రదర్శనల సమయంలో యజమానుల నుంచి ఎదురయ్యే హింస నుంచి వాటిని రక్షించడం కూడా దీనిలో భాగం. జంతు సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు జంతువులతో మమేకమయ్యే వారికి శిక్షణ ఇవ్వడంపై ఈ చట్టం దృష్టి సారిస్తుంది.
***
(Release ID: 2091650)
Visitor Counter : 11