బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు శాఖ ఆధ్వర్యంలో చింతన్ శిబిరం 2.0: బొగ్గు రంగం భవిష్యత్తుకు రూపు రేఖల కల్పన
Posted On:
07 JAN 2025 9:21PM by PIB Hyderabad
బొగ్గు శాఖ ‘చింతన్ శిబిర్ 2.0’ను ఈ రోజు సుష్మా స్వరాజ్ భవన్‌లో విజయవంతంగా నిర్వహించింది. బొగ్గు రంగంలో నవకల్పనలనూ, స్థిరత్వాన్నీ పెంచడానికీ, రాబోయే కాలంలో ఈ రంగానికంటూ ఒక మార్గసూచీని తయారు చేయడంలో సహకరించుకోవడానికీ ఒక వేదికను ఈ కార్యక్రమం ద్వారా అందించారు. బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దుబే సహాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన చర్చల్లో కార్యదర్శి (బొగ్గు శాఖ) శ్రీ విక్రం దేవ్ దత్, అదనపు కార్యదర్శులు రూపీందర్ బ్రార్, విస్మిత తేజ్‌లతోపాటు బొగ్గు పీఎస్‌యూలన్నిటి సీఎమ్‌డీలు, డైరెక్టర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
‘చింతన్ శిబిర్ 2.0’లో బొగ్గు, గనుల శాఖ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రధానోపన్యాసాన్నిస్తూ, భారతదేశంలో ఇంధన భద్రతకు పూచీపడడంలో బొగ్గు రంగానిది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఈ రంగానికి స్థిరత్వం, నవకల్పనల పరంగా ఎదురవుతున్న సవాళ్లను కూడా మంత్రి ప్రస్తావించారు. దేశం సంప్రదాయక ఇంధన వనరుల నుంచి కొత్త రకం ఇంధన వనరుల వైపునకు మళ్లే క్రమంలో బొగ్గు రంగం ముఖ్య పాత్రధారిగా ఉండేటట్టుగా చూడడానికి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధిని కనబరుస్తుందనీ, ఉత్పత్తిని పెంచడంపైనా, స్వచ్ఛ సాంకేతికలన్నిటినీ ఏకీకృతం చేయడంపైనా, పర్యావరణాన్ని సంరక్షించడంపైనా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొంటుందనీ ఆయన పునరుద్ఘాటించారు. బొగ్గు గనుల తవ్వకం పద్ధతుల్లో గ్లోబల్ స్థిరీకరణ లక్ష్యాల్ని అనుసరించాల్సిన అవసరం ఉందనీ, అంతేకాకుండా కోల్ గ్యాసిఫికేషన్ (బొగ్గును గ్యాస్‌గా మార్పిడి చేసే ప్రక్రియ) వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు స్థిరీకరణ దృష్టిలో పెట్టుకొని ఉత్తమ విధానాల్ని పాటించాలనీ శ్రీ కిషన్ రెడ్డి ప్రధానంగా చెప్పారు.
గనుల్లో తవ్వకాన్ని కొనసాగించే కార్యకలాపాల్లో భద్రతకు పెద్దపీట వేయాలని శ్రీ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సూత్రం రాజీ పడడానికి ఎంతమాత్రం తావు లేదన్న విషయాన్ని ఈ రంగంలోని ఆసక్తిదారులంతా గుర్తుంచుకోవాలని కూడా ఆయన చెప్పారు. శ్రామికుల ప్రాణాలకు అభయాన్నివ్వడానికీ, శ్రామికలోకం అభ్యున్నతికి పూచీపడడానికీ నిర్దుష్ట సురక్షత ప్రమాణాలను అమలుపరచాలనీ, అత్యంత ఆధునిక టెక్నాలజీలను వినియోగించాలనీ బొగ్గు రంగ పీఎస్‌యూలకూ, పరిశ్రమ భాగస్వామ్య సంస్థలకూ ఆయన విజ్ఞప్తి చేశారు. గనులను మూసివేసేటప్పుడు పాటించడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పరచాల్సిన అవసరం ఉందనీ, అలాగే జీవవైవిధ్య సంరక్షణపైనా , భూములను వాపసు తీసుకోవడంపైనా దృష్టిని కేంద్రీకరించాలనీ, తవ్వకం ముగించిన గని ప్రాంతాలను సాముదాయిక కార్యకలాపాలకూ, జీవావరణ సమతుల్య పరిరక్షణకూ ఉద్దేశించిన కూడలి ప్రాంతాలు (హబ్స్)గా తీర్చిదిద్దాలనీ మంత్రి ప్రధానంగా చెప్పారు.
నిలకడతనంతో కూడిన వృద్ధిని సాధించడంలో సామాజం పోషించే పాత్ర కూడా కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ‘‘బొగ్గు గనుల తవ్వకం దేశ ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం ఒక్కటే కాకుండా గనులకు సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల అభ్యున్నతికి కూడా తోడ్పడాలి’’ అని ఆయన అన్నారు. స్థానిక సముదాయాలతోనూ, స్వయంసహాయ బృందాలతోనూ క్రియాశీల సంబంధాల్ని ఏర్పరచుకోవాలనీ, ఆరోగ్య సంరక్షణనూ, విద్యనూ, జీవనోపాధులనూ మెరుగుపరచే సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించాలనీ బొగ్గు పీఎస్‌యూలకు, ఆసక్తిదారులకు శ్రీ కిషన్ రెడ్డి సూచించారు. నైపుణ్యాభివృద్ధికీ, ఉద్యోగకల్పనకూ, పర్యావరణ పరిరక్షణకూ ఉద్దేశించిన కార్యక్రమాల్ని నిర్వహించడం బొగ్గు రంగ కార్యకలాపాలతో ముడిపడ్డ స్వాభావిక కార్యక్రమాలుగా రూపొందాలని ఆయన ఉద్ఘాటించారు.
బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రం దేవ్ దత్ మాట్లాడుతూ, కొత్త కొత్త ఆలోచనలను ఆచరణలో పెడుతూ, ఇప్పుడు అమలుచేస్తున్న విధానాలలో మంచి మార్పులను ప్రవేశపెట్టడానికి ఉన్న అవకాశాల్ని కనుగొని బొగ్గు రంగాన్ని రాబోయే కాలానికి సర్వసన్నద్ధంగా తీర్చిదిద్దాలన్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి ఆలోచనపూర్వక విధానాల్నీ, పద్ధతి ప్రకారం నడిచే విధానాల్నీ పాటిస్తూనే, దేశ ప్రజల అవసరాలు అంతకంతకూ పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడానికి బొగ్గు ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలనీ ఆయన ప్రధానంగా చెప్పారు.
కార్యకలాపాలను సాఫీగా సాగేటట్టు చూడడానికి సమర్ధ, సత్వర, ఖర్చులు తక్కువగా ఉండే బొగ్గు తరలింపు ప్రక్రియల్ని చేపట్టాలనీ, అంతరాయాలకు తావివ్వని పద్ధతుల్ని అనుసరించాలనీ కూడా శ్రీ దత్ సూచించారు. బొగ్గు రంగంలో అన్ని విధాలైన కార్యకలాపాల్లోనూ నిలకడతనానికీ, గనుల మూసివేతలో క్రమబద్ధతకూ ప్రాముఖ్యాన్నిస్తూ, జీవవైవిధ్య పునరుద్ధరణతోపాటు పర్యావరణమైత్రీపూర్వక స్పృహతో కూడిన విధానాలను అనుసరించాలని తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
బొగ్గు రంగాన్ని తీర్చిదిద్దడానికి వివిధ కీలక అంశాలపై దృష్టిని సారిస్తూ రెండు లోతైన బృంద చర్చలను కూడా ఈ ‘చింతన్ శిబిర్ 2.0’లో నిర్వహించారు.
మొదటి బృంద చర్చకు బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి విస్మిత తేజ్ సంధానకర్త పాత్రను పోషించారు. మన దేశ బొగ్గు రంగ భవిష్యత్తుపై ఆమె మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తిలో 2 బీటీ (బిలియన్ టన్నులు) ఆకాంక్షాత్మక లక్ష్యాన్ని సాధించడాన్ని గురించీ, బొగ్గు రవాణా వ్యవస్థల్ని మెరుగుపరచడాన్ని గురించీ, భారతదేశంలో ఇంధన మూల వనరుల్లో మార్పు దిశగా పయనించాలన్న క్రమంలో నిర్దేశించుకొన్న లక్ష్యాలకు తోడు అదే క్రమంలో కోల్ గ్యాసిఫికేషన్ వంటి స్వచ్ఛతభరిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడాన్ని గురించీ చర్చలో పాలుపంచుకొన్న వారు వారి అభిప్రాయాలను తెలిపారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి స్థాయికీ, 2 బీటీ లక్ష్యానికీ మధ్య ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి అవలంబించాల్సిన వ్యూహాలనూ వారు చర్చించారు. క్యాప్టివ్ కోల్ బ్లాక్స్‌తోపాటు వాణిజ్య సరళి బొగ్గు బ్లాకుల విషయంలో సమగ్ర ఎస్‌డబ్ల్యూఓటీ విశ్లేషణ (అంటే బలాలు, బలహీనతలు, అవకాశాలు, ముప్పులపై విశ్లేషణ)ను చేపట్టాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఉత్పత్తి ఖర్చుల్ని తగ్గించుకొనే విధంగా కసరత్తులు చేసి లాభదాయకతను మెరుగుపర్చుకోవడం, గ్రీన్ పవర్‌తో పోటీపడడం, మార్కెట్ అవసరాలకు తగ్గ ఉత్పాదనలను సిద్ధం చేయడం వంటి కీలక అంశాలు కూడా చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి.
తవ్విన బొగ్గును చేరవేసేందుకు పాటిస్తున్న ప్రక్రియలను క్రమబద్ధం చేయాల్సిన అవసరం, రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, ముఖ్యంగా రైల్వేల, క్యాప్టివ్ కోల్ ఇవాక్యుయేషన్ పద్ధతులను అవలంబించి ఈ పనిని చేయడం సైతం చర్చలో చోటు చేసుకొన్నాయి. స్వల్ప దూరాలకు బొగ్గు రవాణా, దూర ప్రాంతాలకు బొగ్గు రవాణా కోసం రాబోయే కాలాల్లో లాజిస్టిక్స్ పరంగా అమలుచేయాల్సిన వ్యూహాలు, ప్రత్యేకించి కోస్తాతీర ప్రాంతాల్లో బొగ్గు రవాణాపైనా, దేశాంతర్గత బొగ్గు రవాణా పైనా తీసుకోవలసిన శ్రద్ధ పైనా చర్చించారు. దీనికి అదనంగా, బొగ్గును కోల్ గ్యాసిఫికేషన్ తదితర ప్రత్యామ్నాయ పద్ధతులకు వినియోగించడంపైనా, క్లీనర్ కోల్ టెక్నాలజీస్ వైపునకు మళ్లడంలో ఎదురుకాగల సవాళ్లపైనా, నిలకడతనాన్ని ప్రోత్సహించడానికిగాను కార్బన్ క్యాప్చర్ యుటిలిజేషన్ అండ్ స్టోరేజీ (సీసీయూఎస్) వైపు మొగ్గు చూపడంపైనా ప్రభుత్వం దృష్టిన సారించాలని బృందం ఉద్ఘాటించింది.
బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి రూపీందర్ బ్రార్ సమన్వయపరచిన రెండో బృంద చర్చ బొగ్గు గనుల తవ్వకం కార్యకలాపాలు దీర్ఘకాల ప్రాతిపదికన కొనసాగేటట్టు చూడడం, సముదాయం భాగస్వామ్యం అనే అంశాలు ప్రధానంగా సాగింది. గనుల మూసివేతలు, జీవవైవిధ్య సంరక్షణ, గనుల మూసివేతను జీవనోపాధి కల్పనకు అవకాశాలుగా మలచడం వంటి అంశాలపైన కూడా ఈ సందర్భంగా చర్చించారు. జీవావరణ అభివృద్ధి, సామాజిక-ఆర్థిక అభివృద్ధి సాధనల్లో సమతౌల్యాన్ని సాధించడానికి దీర్ఘకాలం పాటు కార్యకలాపాలను కొనసాగించడంలో స్థానిక ప్రజలకు భాగం పంచడం, స్వయంసహాయ బృందాలను భాగస్వామ్యులను చేయడం జరగాలని చర్చలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.
‘స్పెషల్ క్యాంపెయిన్ 4.0’లో భాగంగా అసాధారణ పనితీరును కనబరచినందుకు బొగ్గు రంగ పీఎస్‌యూలను కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సన్మానించారు. ఐజీఓటీ కర్మయోగి (iGOT Karmayogi) ప్లాట్‌ఫాంలో అగ్రగామి ఫలితాలను చూపిన వారితో మంత్రి మాట్లాడారు. సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకోవడంలో వారు చూపిన అంకిత భావాన్ని ఆయన ప్రశంసించారు. పరిపాలనలో రాణించడానికీ, అందరికీ చక్కని సేవలను అందించడానికీ అవసరమైన నైపుణ్యాలను ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఒక పరివర్తనపూర్వక సాధనం ఐజీఓటీ కార్యక్రమం అని ఆయన అభివర్ణించారు.
బొగ్గు గనుల తవ్వకానికి సంబంధించి స్థిర, బాధ్యతాయుత, సమ్మిళిత ఫ్రేంవర్క్‌ను అనుసరిస్తూ ముందుకుపోవాలన్న మంత్రిత్వ శాఖ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ‘చింతన్ శిబిర్ 2.0’ ముగిసింది. కోల్ గ్యాసిఫికేషన్ వంటి వినూత్న సాంకేతికతలను వినియోగిస్తూ, గని ప్రాంతాల్లో భద్రతను బలపరిచే చర్యలు చేపడుతూ, తవ్వకం కార్యకలాపాలు ముగిసిన తరువాత ఆయా ప్రాంతాలను జీవవైవిధ్య సంరక్షక కూడళ్లు (బయోడైవర్సిటీ హబ్స్)గా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యాన్నివ్వాలని చర్చల్లో ప్రధానంగా తీర్మానించారు. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికి శ్రద్ధ వహిస్తూనే పర్యావరణపరమైన, సామాజికపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి కూడా సమాన స్థాయిలో పూచీపడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాన్ని నెలకొల్పడం, ‘ఆత్మనిర్భర్ భారత్’ను (స్వయంసమృద్ధ భారతదేశం) ఆవిష్కరించడంలో బొగ్గు రంగం ఒక కీలక పాత్రధారిగా నిలచేలా చొరవ తీసుకోవడం ఈ శిబిరంలో నిర్వహించిన చర్చల ధ్యేయం.
***
(Release ID: 2091311)
Visitor Counter : 14