ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
నకిలీ ఔషధాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన చర్యలు.. కలకత్తాలో భారీగా స్వాధీనం
Posted On:
31 DEC 2024 9:49AM by PIB Hyderabad
నకిలీ ఔషధాల అక్రమ వాణిజ్యాన్ని నిరోధించే దిశగా నిశ్చయాత్మక చర్యలు తీసుకుంటున్న తూర్పు జోన్ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో), పశ్చిమ బెంగాల్ ఔషధ నియంత్రణ డైరెక్టొరేట్ సంయుక్తంగా కలకత్తాలోని ఓ హోల్ సేల్ సంస్థ ప్రాంగణంలో సోదాలు నిర్వహించాయి. కలకత్తాలోని ఎం/ఎస్ కేర్ అండ్ క్యూర్ ఫర్ యూలో సోదాలు నిర్వహించి.. నకిలీవిగా భావిస్తున్న క్యాన్సర్ నిరోధక, డయాబెటిక్ నిరోధక ఔషధాలతోపాటు పలు ఇతర ఔషధాలను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
ఐర్లాండ్, టర్కీ, అమెరికా, బంగ్లాదేశ్ సహా వివిధ దేశాల్లో తయారైనట్టుగా వాటిపై ముద్రించి ఉంది. కానీ, భారత్ లోకి చట్టబద్ధంగా అవి దిగుమతి అయినట్టు నిరూపించేలా ధ్రువీకరించే ఎలాంటి పత్రాలూ లేవు. అవసరమైన పత్రాలు లేని ఈ ఔషధాలను నకిలీవిగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో కొన్ని ఖాళీ ప్యాకింగ్ వస్తువులు కూడా దర్యాప్తు బృందానికి లభించడం.. స్వాధీనం చేసుకున్న ఈ ఉత్పత్తుల ప్రామాణికతపై మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
స్వాధీనం చేసుకున్న ఔషధాల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ. 6.60 కోట్లుగా ఉంటుందని అంచనా. సరైన పరిశోధన కోసం, ఔషధాల నమూనాలను నాణ్యత పరీక్షలకు పంపారు. స్వాధీనం చేసుకున్న మిగతా సరుకును సీడీఎస్సీవో భద్రపరిచింది. దర్యాప్తులో భాగంగా నిందితులను అరెస్టు చేశారు. ఓ మహిళను హోల్ సేల్ సంస్థ యజమానిగా గుర్తించారు. తూర్పు జోన్ సీడీఎస్సీవో డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించిన న్యాయస్థానం.. తదుపరి విచారణకు అనుమతించింది. ఈ విషయమై తదుపరి విచారణ కొనసాగుతోంది.
ప్రజల భద్రత, శ్రేయస్సు కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. నకిలీ, నాసిరకం ఔషధాలను మార్కెట్లో చెలామణీ చేయడాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదనడానికి.. ఈ స్వాధీనమూ, కొనసాగుతున్న విచారణా నిదర్శనాలు. నకిలీ ఔషధాల వల్ల పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికీ, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికీ సీడీఎస్సీవో, రాష్ట్ర అధికారులు ఇక మీదట కూడా సమన్వయంతో పని చేస్తారు.
***
(Release ID: 2089220)
Visitor Counter : 17